Mann ki baat : మన పండుగ, పర్యావరణం- ఈ రెండింటి మధ్య చాలా లోతైన బంధం ఉంది..ప్రధాని మోడీ

Mann ki baat : మన పండుగ, పర్యావరణం- ఈ రెండింటి మధ్య చాలా లోతైన బంధం ఉంది..ప్రధాని మోడీ
x
Highlights

Mann ki baat: ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

కరోనా క్లిష్ట పరిస్థితులలో కూడా మన రైతులు తమ శక్తిని నిరూపించుకున్నారు అని ప్రధాని మోడీ రైతన్నలను ప్రశంశలతో ముంచెత్తారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ఆయన ఈరోజు దేశాప్రజలనుద్దేశింఛి రేడియో ద్వారా ప్రసంగించారు. వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన రైతుల కృషితో మన దేశంలో ఈసారి ఖరీఫ్ పంట నాట్లు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7 శాతం పెరిగాయని చెప్పారు. వరిని 10 శాతం, పప్పుధాన్యాలను 5 శాతం, తృణధాన్యాలను 3 శాతం, నూనె గింజలను 13 శాతం, పత్తిని 3 శాతం అధికంగా నాటారు. ఈ కృషి చేసినందుకు దేశంలోని రైతులను అభినందిస్తున్నాను. అన్నదాతలకు వందనం అంటూ అయన పేర్కొన్నారు.

ఇక బొమ్మల గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. బొమ్మలతో మనం చేయగలిగే విషయాలు రెండు ఉన్నాయి. మన జీవితంలోని అద్భుతమైన గతాన్ని పునరుద్ధరించవచ్చు. స్వర్ణమయ భవిష్యత్తును కూడా రూపొందించవచ్చు. అంటూ చెప్పిన ప్రధాని మోడీ.. దేశంలో బొమ్మల తయారీలో ప్రధానంగా చెప్పుకునె ప్రాంతాల గురించి ప్రధాని వివరించారు. ''ప్రపంచ బొమ్మల పరిశ్రమ విలువ 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 7 లక్షల కోట్ల రూపాయల పెద్ద వ్యాపారం. కానీ ఇందులో భారతదేశం వాటా చాలా తక్కువ. గొప్ప వారసత్వం, సంప్రదాయం, వైవిధ్యం, అధిక సంఖ్యలో యువత ఉన్న దేశం వాటా బొమ్మల పరిశ్రమలో చాలా తక్కువగా ఉండడం మీకు సబబుగా అనిపిస్తోందా? లేదు.. ఇది మీకు నచ్చదు. మిత్రులారా! బొమ్మల పరిశ్రమ చాలా విస్తృతమైనది. గృహ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఇల తో పాటు పెద్ద పరిశ్రమలు, ప్రైవేట్ పారిశ్రామికసంస్థలు కూడా దాని పరిధిలోకి వస్తాయి. దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేశం ఉమ్మడిగా కృషి చేయాల్సి ఉంటుంది.''అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.

ఈరోజు 'మన్ కీ బాత్' లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమన్నారో పూర్తి ప్రసంగానికి అక్షర రూపం ఇది..

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. సాధారణంగా ఈ సమయంలో వేర్వేరు ప్రదేశాల్లో వేడుకలు జరుగుతాయి. మతపరమైన ధార్మిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఈ ఉత్సవాలను నిర్వహించుకోవాలన్న ఉత్సాహం మనలో ఉన్నప్పటికీ ఇలాంటి సంక్షోభ సమయంలో మనం ఎలా ఉండాలనే నియమాలతో కూడిన క్రమశిక్షణ కూడా ఉంది. పౌరులలో బాధ్యత కూడా ఉంది. ప్రజలు తమను తాము చూసుకుంటూ ఇతరులను కూడా పట్టించుకుంటున్నారు. తమ రోజువారీ పనిని కూడా చేస్తున్నారు. దేశంలో ఈ సమయంలో జరుగుతున్న ప్రతి సంఘటనలో సంయమనం, సారళ్యత అపూర్వమైనవి. గణేశ్ ఉత్సవాలను ఆన్‌లైన్‌లో జరుపుకుంటున్నారు. చాలా చోట్ల ఈసారి పర్యావరణ అనుకూలమైన గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మిత్రులారా! మనం చాలా సమీపం నుండి పరిశీలిస్తే ఒక విషయం ఖచ్చితంగా మన దృష్టికి వస్తుంది. మన పండుగ, పర్యావరణం- ఈ రెండింటి మధ్య చాలా లోతైన బంధం ఉంది. ఒక వైపు పర్యావరణం, ప్రకృతితో సహజీవన సందేశం ఈ ఉత్సవాల్లో ఉంది. మరోవైపు ప్రకృతిని కాపాడే లక్ష్యంతో మాత్రమే అనేక పండుగలు జరుపుకుంటారు. ఉదాహరణకు బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌లో, శతాబ్దాలుగా థారు గిరిజన సమాజంలోని ప్రజలు 60 గంటల లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. వారు దీన్ని '60-గంటల బర్నా ' అంటారు. ప్రకృతిని కాపాడటానికి థారు జాతి కి చెందిన గిరిజనులు తమ సంప్రదాయం ప్రకారం బర్నాను శతాబ్దాల కాలం నుండి అనుసరిస్తున్నారు. ఈ సమయంలో ఎవరూ వారి గ్రామానికి వెళ్లలేరు. వారి ఇళ్ళ నుండి ఎవ్వరూ బయటకు రారు. వారు బయటికి రావడమో, ఎవరైనా బయటి నుండి రావడమో జరిగితే వారి కదలికల వల్ల, వారి రోజువారీ కార్యకలాపాల వల్ల కొత్త చెట్లు, మొక్కలకు హాని కలగవచ్చని భావిస్తారు. బర్నా ప్రారంభంలో మన గిరిజన సోదరులు, సోదరీమణులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవాల చివర్లో గిరిజన సంప్రదాయం ప్రకారం పాటలు, సంగీతం, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు.

మిత్రులారా! ఈ రోజుల్లో ఓనం పండుగను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ చింగం నెలలో వస్తుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త వస్తువులను కొంటారు. తమ ఇళ్లను అలంకరిస్తారు. పూక్కలం అనే ముగ్గులతో తమ ఇంటి ప్రాంగణాలను తీర్చిదిద్దుతారు. ఓనం రోజుల్లో సద్య అనే ఆహారపదార్థాలను ఆస్వాదిస్తారు. వివిధ రకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. ఓనం దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. అమెరికా, యూరప్, గల్ఫ్ మొదలైన ప్రాంతాలలోని అనేక దేశాలలో కూడా ఓనం ఆనందం కనిపిస్తోంది. ఓనం అంతర్జాతీయ ఉత్సవంగా మారుతోంది.

మిత్రులారా! ఓనం వ్యవసాయానికి సంబంధించిన పండుగ. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఆరంభం. రైతుల శక్తి ఫలితంగానే మన జీవితం గడుస్తుంది. మన సమాజం నడుస్తుంది. రైతుల శ్రమ వల్ల మన పండుగలు వర్ణమయమవుతాయి. మన అన్నదాతకు, రైతుల శక్తికి వేదాలలో కూడా గౌరవనీయమైన స్థానం లభించింది.

రుగ్వేదంలో ఒక మంత్రం ఉంది ..

అన్నానామ్ పతయే నమః , క్షేత్రానామ్ పతయే నమః |

అంటే అన్నదాతకు నమస్కారం.. రైతుకు వందనం అని. కరోనా క్లిష్ట పరిస్థితులలో కూడా మన రైతులు తమ శక్తిని నిరూపించుకున్నారు. మన దేశంలో ఈసారి ఖరీఫ్ పంట నాట్లు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7 శాతం పెరిగాయి. వరిని 10 శాతం, పప్పుధాన్యాలను 5 శాతం, తృణధాన్యాలను 3 శాతం, నూనె గింజలను 13 శాతం, పత్తిని 3 శాతం అధికంగా నాటారు. ఈ కృషి చేసినందుకు దేశంలోని రైతులను అభినందిస్తున్నాను. వారి కృషికి వందనం.

నా ప్రియమైన దేశవాసులారా! ఈ కరోనా కాలంలో దేశం అనేక రంగాల్లో ఐక్యంగా పోరాడుతోంది. కానీ దీర్ఘ కాలం ఇళ్ళలో ఉండడం వల్ల నా చిన్న చిన్న బాల మిత్రుల సమయం ఎలా గడిచిపోతుందన్న ఆలోచన వస్తుంది. ప్రపంచంలో భిన్నమైన ప్రయోగమైన గాంధీనగర్ చిల్డ్రన్ యూనివర్శిటీ; మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ; విద్యా మంత్రిత్వ శాఖ; సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖతో కలిసి పిల్లల కోసం మనం ఏం చేయగలమనే విషయం ఆలోచించాం. ఈ చర్చలు నాకు చాలా ఆహ్లాదం కలిగించాయి. ఈ చర్చలు ప్రయోజనకరంగా ఉన్నాయి. ఒక విధంగా కొత్త అంశాన్ని నేర్చుకోవటానికి నాకు ఇది ఒక అవకాశంగా మారింది.

మిత్రులారా! మా చర్చల అంశం - బొమ్మలు - ముఖ్యంగా భారతీయ బొమ్మలు. భారతదేశ పిల్లలు కొత్త బొమ్మలు ఎలా పొందాలో, బొమ్మల ఉత్పత్తికి భారతదేశం కేంద్రంగా ఎలా మారాలి అనే అంశాలపై మా చర్చలు జరిగాయి. 'మన్ కీ బాత్' వింటున్న పిల్లల తల్లిదండ్రులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ఎందుకంటే ఈ 'మన్ కీ బాత్' విన్న తర్వాత బొమ్మల కోసం కొత్త డిమాండ్లు ముందుకు రావచ్చు.

మిత్రులారా! బొమ్మలు కార్యాచరణను పెంచడంతో పాటు మన ఆకాంక్షలకు రెక్కలను ఇస్తాయి. బొమ్మలు మనస్సును అలరించడమే కాదు, ప్రయోజనాలను కూడా అందజేస్తాయి. అసంపూర్ణంగా ఉన్న బొమ్మ ఉత్తమమైనదన్న గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయాన్ని నేను ఎక్కడో చదివాను. అటువంటి బొమ్మను ఆటలో భాగంగా పిల్లలు పూర్తి చేస్తారు. బాల్యంలో తన స్నేహితులతో- తన కల్పనా శక్తితో ఇంట్లో ఉన్న వస్తువుల నుండి బొమ్మలను, ఆటలను తయారు చేసేవాడినని ఠాగూర్ అన్నారు. అలా ఒక రోజు సరదాగా ఆడుకునే సమయంలో ఆయన సహచరులలో ఒకరు అందమైన పెద్ద విదేశీ బొమ్మను తీసుకు వచ్చాడు. దాంతో ఆయన మిత్రుల దృష్టి అంతా ఆట కంటే బొమ్మపైనే ఎక్కువగా నిమగ్నమైంది. ఆటలు కాకుండా ఆ బొమ్మే ఆకర్షణ కేంద్రంగా మారింది. అంతకు ముందు అందరితో ఆడుకుంటూ, అందరితో కలిసి ఉంటూ, క్రీడలలో మునిగిపోయే అతను దూరంగా ఉండడం ప్రారంభించాడు. ఒక విధంగా చెప్పాలంటే మిగతా పిల్లల కంటే తాను భిన్నమైనవాడిననే భావన అతని మనస్సులో ఏర్పడింది. ఖరీదైన బొమ్మలలో తయారు చేయడానికి ఏమీ లేదు- నేర్చుకోవడానికి ఏమీ లేదు. అంటే, ఆకర్షణీయమైన బొమ్మ ఒక అద్భుతమైన పిల్లవాడిని అణిచివేసింది. అతని ప్రతిభను కప్పేసింది. ఈ బొమ్మ అతని సంపదను ప్రదర్శించింది. కాని పిల్లల సృజనాత్మక వికాసాన్ని నిరోధించింది. బొమ్మ వచ్చింది. కానీ ఆట ముగిసింది. వికాసం ఆగిపోయింది. అందువల్ల పిల్లల బాల్యాన్ని బయటకు తెచ్చే విధంగా, సృజనాత్మకతను వెలికితీసే విధంగా బొమ్మలు ఉండాలని గురుదేవ్ చెప్పేవారు. పిల్లల జీవితంలోని వివిధ అంశాలపై బొమ్మల ప్రభావాన్ని జాతీయ విద్యా విధానం కూడా పరిగణనలోకి తీసుకుంది. బొమ్మల తయారీని నేర్చుకోవడం, బొమ్మల తయారీ పరిశ్రమల సందర్శన - ఇవన్నీ పాఠ్యాంశాల్లో భాగంగా చేశారు.

మిత్రులారా! మన దేశంలో స్థానిక బొమ్మల తయారీ విషయంలో గొప్ప సంప్రదాయం ఉంది. మంచి బొమ్మలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులైన వారున్నారు. నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారు చాలా మంది ఉన్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు బొమ్మల కేంద్రాలుగా కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఉదాహరణకు కర్ణాటకలోని రామనగరంలో చన్నాపట్నం, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కొండపల్లి, తమిళనాడులో తంజావూరు, అస్సాంలోని ధుబరీ, ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి – ఇలాంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచ బొమ్మల పరిశ్రమ విలువ 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 7 లక్షల కోట్ల రూపాయల పెద్ద వ్యాపారం. కానీ ఇందులో భారతదేశం వాటా చాలా తక్కువ. గొప్ప వారసత్వం, సంప్రదాయం, వైవిధ్యం, అధిక సంఖ్యలో యువత ఉన్న దేశం వాటా బొమ్మల పరిశ్రమలో చాలా తక్కువగా ఉండడం మీకు సబబుగా అనిపిస్తోందా? లేదు.. ఇది మీకు నచ్చదు. మిత్రులారా! బొమ్మల పరిశ్రమ చాలా విస్తృతమైనది. గృహ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఇల తో పాటు పెద్ద పరిశ్రమలు, ప్రైవేట్ పారిశ్రామికసంస్థలు కూడా దాని పరిధిలోకి వస్తాయి. దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేశం ఉమ్మడిగా కృషి చేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన సి.వి. రాజు గారి ఉదాహరణ చూద్దాం. అతని గ్రామానికి చెందిన ఏటి కొప్పాక బొమ్మలు గతంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ బొమ్మలు చెక్కతో తయారు కావడం విశేషం. ఈ బొమ్మలలో ఎక్కడా వంపు కోణం కనబడదు. ఈ బొమ్మలు అన్ని వైపుల నుండి గుండ్రంగా ఉంటాయి. మొనతేలి ఉండవు. అందువల్ల పిల్లలకు గాయాలయ్యే అవకాశం లేదు. సివి రాజు గారు తన గ్రామంలోని చేతివృత్తి పనివారి సహకారంతో ఏటి కొప్పాక బొమ్మల కోసం కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఏటి కొప్పాక బొమ్మలను ఉత్తమ నాణ్యతతో తయారు చేయడం ద్వారా స్థానిక బొమ్మలు కోల్పోయిన ప్రాభవాన్ని రాజు గారు తిరిగి నిలబెట్టారు. బొమ్మలతో మనం చేయగలిగే విషయాలు రెండు ఉన్నాయి. మన జీవితంలోని అద్భుతమైన గతాన్ని పునరుద్ధరించవచ్చు. స్వర్ణమయ భవిష్యత్తును కూడా రూపొందించవచ్చు. మన స్టార్టప్ స్నేహితులకు, మన కొత్త పారిశ్రామిక వేత్తలకు.. కలిసి బొమ్మలు తయారు చేద్దామని పిలుపు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్థానిక బొమ్మలపై ప్రచారం చేసే సమయం ఆసన్నమైంది. రండి.. మన బాలల కోసం కొత్త రకాల నాణ్యమైన బొమ్మలను తయారు చేద్దాం. బాల్యాన్ని వికసింపజేసేవే బొమ్మలు. ఇలాంటి బొమ్మలను, పర్యావరణ అనుకూలమైన బొమ్మలను తయారు చేద్దాం.

మిత్రులారా! కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు ఉన్న ఈ యుగంలో కంప్యూటర్ గేమ్స్ కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. పిల్లలు కూడా ఈ ఆటలను ఆడతారు. పెద్దవారు కూడా ఆడతారు. వీటిల్లో చాలా ఆటలు ఉన్నాయి. వాటి థీమ్స్ కూడా అధికంగా విదేశాలకు సంబంధించినవే ఉన్నాయి. మన దేశంలో చాలా ఆలోచనలు ఉన్నాయి. చాలా భావనలు ఉన్నాయి. మనకు చాలా గొప్ప చరిత్ర ఉంది. మనం వాటిపై ఆటలు రూపొందించగలమా? నేను దేశంలోని యువ ప్రతిభావంతులకు పిలుపు ఇస్తున్నాను. మీరు భారతదేశంలో కూడా ఆటలు రూపొందించండి. భారతదేశానికి సంబంధించిన ఆటలు రూపొందించండి. ఎక్కడికి వెళ్ళినా ఆటలు ప్రారంభిద్దాం! రండి.. ఆట ప్రారంభిద్దాం!

మిత్రులారా! .. కాల్పనిక క్రీడలయినా, బొమ్మల రంగం అయినా భారత స్వావలంబన ప్రచారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. వందేళ్ల కిందట సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆ ఉద్యమం భారతీయుల ఆత్మగౌరవాన్ని పెంచి, మన శక్తిని వెల్లడించేందుకు ఒక మార్గమని గాంధీజీ పేర్కొన్నారు.

దేశాన్ని స్వయం సమృద్ది చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం పూర్తి విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతి రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా చేసుకోవాలి. సహాయ నిరాకరణ రూపంలో నాటిన విత్తనాన్ని ఇప్పుడు స్వయం సమృద్ధిగల భారత వట వృక్షంగా మార్చడం మనందరి బాధ్యత.

నా ప్రియమైన దేశవాసులారా! భారతీయుల ఆవిష్కరణ సామర్థ్యాన్ని, సమస్యా పరిష్కార నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. అంకితభావం ఉన్నప్పుడు ఈ శక్తి అపరిమితంగా మారుతుంది. ఈ నెల ప్రారంభంలో యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను దేశ యువత ముందు ఉంచారు. ఈ స్వావలంబన భారతదేశ యాప్ ఆవిష్కరణ పోటీ లో మన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 7 వేల ఎంట్రీలు వచ్చాయి. అందులో కూడా మూడింట రెండు వంతుల అనువర్తనాలను మెట్రో నగరాలు కాని రెండవ, మూడవ అంచెలో ఉన్న నగరాల యువత సృష్టించింది. . ఇది స్వావలంబన భారతదేశానికి, దేశ భవిష్యత్తుకు చాలా శుభ సంకేతం. ఈ ఆవిష్కరణ సవాలు ఫలితాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఈ పోటీ ఎంట్రీలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత, వివిధ కేటగిరీలలో సుమారు రెండు డజన్ల అనువర్తనాలకు పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈ అనువర్తనాల గురించి తెలుసుకోవాలి. వాటివల్ల ఇలాంటివి సృష్టించడానికి మీరు కూడా ప్రేరణ పొందవచ్చు. వాటిలో ఒక అనువర్తనం ఉంది. అది కుటుకి పిల్లల అభ్యసన అనువర్తనం. చిన్నపిల్లల కోసం రూపొందించిన ఇంటరాక్టివ్ అనువర్తనమిది. దీని ద్వారా పాటలు కథల ద్వారా గణితం, సామాన్య శాస్త్రాల లో చాలా విషయాలను పిల్లలు నేర్చుకోవచ్చు. దీంట్లో యాక్టివిటీస్ ఉన్నాయి. ఆటలూ ఉన్నాయి. అదేవిధంగా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కోసం ఒక అనువర్తనం ఉంది. దీని పేరు 'కూ'.. . ఇందులో, మన మాతృభాషలో టెక్స్ట్ ఉంచడం ద్వారా, వీడియో ఆడియోల ద్వారా సంభాషించవచ్చు.

అదేవిధంగా, చింగారి యాప్ కూడా యువతలో బాగా ప్రాచుర్యం పొందింది. 'ఆస్క్ సర్కార్' అనేది కూడా ఒక యాప్. ఇందులో మీరు చాట్ బోట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వవచ్చు. ఏదైనా ప్రభుత్వ పథకం గురించి సరైన సమాచారాన్ని పొందవచ్చు. అది కూడా టెక్స్ట్, ఆడియో, వీడియో ద్వారా- మూడు విధాలుగా. ఇది మీకు చాలా సహాయపడుతుంది. మరొక అనువర్తనం ఉంది- అది 'స్టెప్ సెట్ గో'. ఇది ఫిట్‌నెస్ అనువర్తనం. మీరోజు వారీ కార్యకలాపాల్లో ఎన్ని కేలరీల శక్తిని మీరు ఖర్చు చేస్తారో ఈ అనువర్తనం ట్రాక్ చేస్తుంది. ఫిట్‌గా ఉండటానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. ఇంకా చాలా అనువర్తనాలు పురస్కారాలను గెలుచుకున్నాయి. 'ఈజ్ ఈక్వల్‌ టు', బుక్స్ అండ్ ఎక్స్‌పెన్స్, జోహో వర్క్‌ప్లేస్, ఎఫ్‌టిసి టాలెంట్ వంటి అనేక బిజినెస్ యాప్స్, ఆటల అనువర్తనాలు వాటిలో ఉన్నాయి. వాటి గురించి నెట్‌లో శోధిస్తే మీకు చాలా సమాచారం దొరుకుతుంది. మీరు కూడా ముందుకు రండి. ఆవిష్కరించండి. అమలు చేయండి. మీ ప్రయత్నాలు, మీ చిన్నచిన్న స్టార్టప్‌లు రేపు పెద్ద కంపెనీలుగా మారుతాయి. భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు ప్రపంచంలో కనిపించే పెద్ద కంపెనీలు కూడా ఒకప్పుడు చిన్న స్థాయిలో ప్రారంభమైనవే అనే విషయం మీరు మర్చిపోకూడదు.

ప్రియమైన దేశ వాసులారా! మన పిల్లలు, మన విద్యార్థులు వారి పూర్తి సామర్థ్యాన్ని చూపించడంలో, వారి బలాన్ని చూపించగలగడంలో పోషకాహారానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ను పోషకాహార మాసంగా జరుపుకుంటారు. దేశం, పోషకాహారం చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. "యథా అన్నం తథా మన్నం" అనే ఒక లోకోక్తి కూడా ఉంది.

అంటే మన ఆహారం వల్లే మానసిక, శారీరక వికాసాలు జరుగుతాయని అర్థం. గర్భంలోనూ బాల్యంలోనూ ఎంత మంచి పోషకాహారం లభిస్తే మానసిక వికాసం, ఆరోగ్యం అంతబాగా ఉంటాయని నిపుణులు చెప్తారు. పిల్లల పోషణలో తల్లికి పూర్తి పోషకాహారం లభించడం కూడా ముఖ్యమైంది. పోషణ అంటే ఏం తింటున్నారు, ఎంత పరిమాణంలో తింటున్నారు, ఎంత తరచుగా తింటున్నారు అని కాదు. అన్ని పోషక పదార్థాలు శరీరానికి అందడం ముఖ్యం. మీ శరీరానికి ఎన్ని ముఖ్యమైన పోషకాలు అందుతున్నాయి? మీరు ఐరన్, కాల్షియం పొందుతున్నారా లేదా? సోడియం పొందడం లేదా? విటమిన్లు పొందడం లేదా? ఇవన్నీ పోషకాహారంలో చాలా ముఖ్యమైన అంశాలు. ఈ పోషకాహార ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. ప్రజల భాగస్వామ్యం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. గత కొన్నేళ్లుగా దేశంలో ఈ దిశలో చాలా ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా మన గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో దీనిని పెద్ద ఎత్తున ఉద్యమంగా నిర్వహిస్తున్నారు. పోషకాహార వారోత్సవాలైనా, పోషకాహార మాసమైనా- వాటి ద్వారా మరింత అవగాహన ఏర్పడుతోంది. ఈ ఉద్యమంలో పాఠశాలలను కూడా అనుసంధానించడం జరిగింది. పిల్లల కోసం పోటీల నిర్వహణ, వారిలో అవగాహన పెంచడం- వీటికోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తరగతిలో క్లాస్ మానిటర్ ఉన్న విధంగానే న్యూట్రిషన్ మానిటర్ కూడా ఉండాలి. రిపోర్ట్ కార్డ్ లాగా న్యూట్రిషన్ కార్డ్ కూడా తయారు చేయాలి. అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పోషకాహార మాసోత్సవాల్లో మైగవ్ పోర్టల్‌లో ఆహారం, పోషణ క్విజ్ జరుగుతుంది. అలాగే ఇతర పోటీలు కూడా ఉంటాయి. మీరు పాల్గొనండి. ఇతరులను కూడా వీటిలో పాల్గొనేలా ప్రేరేపించండి.

మిత్రులారా! కోవిడ్ తరువాత గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ సందర్శనకు అనుమతించిన తర్వాత సందర్శించే అవకాశం మీకు లభిస్తే అక్కడ నిర్మించిన ప్రత్యేకమైన న్యూట్రిషన్ పార్క్ ను కూడా చూడండి. ఆట పాటలతో పోషకాహార పరిజ్ఞానాన్ని పొందవచ్చు.

మిత్రులారా! భారతదేశం చాలా విశాలమైంది. ఆహార అలవాట్లలో చాలా వైవిధ్యం ఉంది. మన దేశంలో ఆరు వేర్వేరు రుతువులలో వివిధ ప్రాంతాలలో అక్కడి వాతావరణం ప్రకారం వేర్వేరు వస్తువులు ఉత్పత్తి అవుతాయి. అందువల్ల ప్రతి ప్రాంతంలో సీజన్ ప్రకారం ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయాలను బట్టి పోషకాహార ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు రాగులు, జొన్నలు మొదలైన చిరు ధాన్యాలు చాలా ఉపయోగకరమైన పోషకా హారం. ప్రతి జిల్లాలో పండే పంటలు, వాటి పోషక విలువ గురించి పూర్తి సమాచారంతో 'అగ్రికల్చరల్ ఫండ్ ఆఫ్ ఇండియా' తయారవుతోంది. ఇది మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. రండి, పోషకాహార మాసంలో పోషక పదార్థాలు తినడానికి, ఆరోగ్యంగా ఉండటానికి అందరినీ ప్రోత్సహించండి.

ప్రియమైన దేశవాసులారా! గతంలో మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త నా దృష్టిని ఆకర్షించింది. ఇది మన భద్రతా దళాలకు సంబంధించిన రెండు సాహస గాథల వార్త. ఈ రెండు గాథలు సోఫీ, విదా అనే రెండు శునకాలకు సంబంధించినవి. ఇవి రెండూ భారత సైన్యానికి చెందిన కుక్కలు. ఈ కుక్కలు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ 'కమెండేషన్ కార్డులు' పొందాయి. సోఫీ విదా దేశాన్ని పరిరక్షిస్తూ తమ విధులను చక్కగా నిర్వర్తించినందు వల్ల ఈ గౌరవాన్ని పొందాయి. మన భద్రతా దళాలలో దేశం కోసం పని చేసే ఎన్నో కుక్కలు ఉన్నాయి. ఆ శునకాలు దేశం కోసం బలిదానం కూడా చేస్తాయి. ఎన్నో బాంబు పేలుళ్లను, ఉగ్రవాద కుట్రలను నిరోధించడంలో ఇటువంటి కుక్కలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. దేశ భద్రతలో కుక్కల పాత్ర గురించి కొంతకాలం క్రితం నేను చాలా వివరంగా తెలుసుకున్నాను.

ఇలాంటి చాలా సంఘటనలు కూడా వినండి. అమరనాథ్ యాత్రకు వెళ్లే దారిలో బలరామ్ అనే కుక్క 2006 లో మందుగుండు సామగ్రిని కనుగొంది. 2002 లో పేలుడు పదార్థాలను భావన అనే కుక్క కనుగొన్నది . ఈ పదార్థాల వెలికితీత సమయంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను పేల్చడంతోఆ కుక్క చనిపోయింది. రెండు, మూడు సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్‌లో జరిగిన మందుగుండు పదార్థాల పేలుడు సంఘటన లో సిఆర్‌పిఎఫ్ కు చెందిన స్నిఫర్ డాగ్ 'క్రాకర్' కూడా అమరత్వం పొందింది. కొన్ని రోజుల క్రితం మీరు టీవీలో చాలా భావోద్వేగ దృశ్యాన్ని చూసి ఉంటారు. బీడ్ పోలీసులు తమ శునకం రాకీకి అన్ని విధాలా గౌరవప్రదంగా తుది వీడ్కోలు పలికిన ఘట్టాన్ని మీరు చూడొచ్చు. 300 కి పైగా కేసులను పరిష్కరించడంలో రాకీ పోలీసులకు సహాయం చేసింది.

విపత్తు నిర్వహణ, రక్షణ కార్యక్రమాల్లో కుక్కల పాత్ర కూడా ముఖ్యమైంది. భారతదేశంలో నేషనల్ డైజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ - ఎన్డిఆర్ఎఫ్ అటువంటి డజన్ల కొద్ది కుక్కలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. భూకంపం సంభవించినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు శిధిలాలలో సజీవంగా ఉన్నవారిని కాపాడడంలో ఉండటంలో ఈ కుక్కలు నైపుణ్యం కలిగిఉన్నాయి.

మిత్రులారా! భారతీయ జాతికి చెందిన కుక్కలు చాలా మంచివని, చాలా సామర్థ్యం కలిగి ఉన్నాయని నిపుణులు నాకు చెప్పారు. భారతీయ జాతులలో ముధోల్ హౌండ్, హిమాచలి హౌండ్ ఉన్నాయి. అవి చాలా మంచి జాతులు. రాజాపలాయం, కన్నీ, చిప్పిపరాయ్, కొంబాయి కూడా గొప్ప భారతీయ జాతులు. వాటిని పెంచడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. అవి భారత వాతావరణానికి మేలైనవి.

ఇప్పుడు మన భద్రతా సంస్థలు ఈ భారతీయ జాతి కుక్కలను కూడా తమ భద్రతా బృందాల్లో చేరుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఆర్మీ, సిఐఎస్ఎఫ్, ఎన్‌ఎస్‌జి సంస్థలు ముధోల్ హౌండ్ కుక్కలకు శిక్షణ ఇచ్చి డాగ్ స్క్వాడ్‌లో చేర్చాయి. సిఆర్‌పిఎఫ్‌లో కొంబాయి జాతి కుక్కలు ఉన్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి – ఐ సి ఏ ఆర్- కూడా భారతీయ జాతి కుక్కలపై పరిశోధనలు చేస్తోంది. భారతీయ జాతులను మెరుగ్గా, ఉపయోగకరంగా మార్చడమే ఈ పరిశోధనల లక్ష్యం. మీరు కుక్కల జాతుల పేర్లను ఇంటర్నెట్‌లో శోధించి, వాటి గురించి తెలుసుకోండి. వాటి అందం, లక్షణాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. మీరు కుక్కను పెంచాలని అనుకున్నప్పుడల్లా తప్పకుండా ఈ భారతీయ జాతి కుక్కలలో ఒకదాన్ని ఇంటికి తీసుకురావాలి. స్వావలంబన భారతదేశం ప్రజల మనస్సు లోని మంత్రంగా మారుతోంది. ఇలాంటప్పుడు ఏ రంగంలో అయినా ఎలా వెనుకబడి ఉంటాం?

నా ప్రియమైన దేశ వాసులారా! కొన్ని రోజుల తరువాత- సెప్టెంబర్ 5 నాడు- మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. మన జీవిత ప్రయాణంలో విజయాలను చవి చూసినప్పుడు మన ఉపాధ్యాయులలో ఎవరో ఒకరిని మనం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటాం. వేగంగా మారుతున్న కాలంలో, కరోనా సంక్షోభంలో మన ఉపాధ్యాయులు కూడా కాలంతో పాటు మారవలసిన సవాలును ఎదుర్కొంటారు. మన ఉపాధ్యాయులు ఈ సవాలును అంగీకరించడమే కాకుండా దాన్ని ఒక అవకాశంగా స్వీకరించినందుకు నాకు సంతోషంగా ఉంది. అభ్యసనలో సాంకేతికతను ఎలా ఉపయోగించాలో, కొత్త పద్ధతులను ఎలా అనుసరించాలో, విద్యార్థులకు ఎలా సహాయం చేయాలో మన ఉపాధ్యాయులు ఇప్పటికే తెలుసుకున్నారు. విద్యార్థులకు కూడా నేర్పించారు. దేశంలో ఈరోజులలో ప్రతిచోటా నవీన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కొత్తవి రూపొందిస్తున్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా దేశంలో పెద్ద మార్పు జరగబోతోంది. దీని ప్రయోజనాలను విద్యార్థులకు అందజేయడంలో ఉపాధ్యాయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని నాకు నమ్మకం ఉంది.

మిత్రులారా! ముఖ్యంగా నా ఉపాధ్యాయ మిత్రులారా! మన దేశం 2022 సంవత్సరంలో 75 సంవత్సరాల స్వాతంత్ర్య సంబరాలను జరుపుకుంటుంది. స్వాతంత్య్రానికి ముందు సుదీర్ఘకాలం మన దేశంలో స్వాతంత్ర్య సమరం జరిగింది. ఈ సమయంలో స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేయని, తమ సర్వస్వాన్ని తృణప్రాయంగా భావించని ప్రాంతం దేశం లోని ఏ మూలలోనూ లేదు. మన దేశ స్వాతంత్ర్య వీరుల గురించి ఈ తరానికి, మన విద్యార్థులకు తెలవాల్సిన ఆవశ్యకత ఉంది. తమ జిల్లాలో, తమ ప్రాంతంలో స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు అమరవీరుడు, ఎంతకాలం దేశం కోసం జైలులో ఉన్నారు అనే విషయాలు విద్యార్థులకు తెలవాలి. మన విద్యార్థులకు ఈ విషయాలు తెలిస్తే వారి వ్యక్తిత్వంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. దీని కోసం చాలా పనులు చేయవచ్చు. ఇందులో మన ఉపాధ్యాయుల బాధ్యత ప్రధానమైంది. ఉదాహరణకు శతాబ్దాలుగా సాగిన స్వాతంత్ర్య యుద్ధంలో మీ జిల్లాలో ఏవైనా సంఘటనలు జరిగాయా? ఈ అంశాన్ని తీసుకొని విద్యార్థుల తో పరిశోధనలు నిర్వహించవచ్చు. లిఖితరూపంలో దీన్ని పాఠశాల తయారుచేయవచ్చు. మీ పట్టణంలో స్వాతంత్ర్య ఉద్యమంతో సంబంధం ఉన్న స్థలం ఉంటే విద్యార్థులను అక్కడికి తీసుకెళ్లవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా తమ ప్రాంతంలోని 75 మంది స్వాతంత్ర్య సమర వీరులపై కవితలు, నాటకాలు రాయాలని ఒక పాఠశాల విద్యార్థులు నిర్ణయించుకోవచ్చు.

మీ ప్రయత్నాలు దేశంలోని వేలాది మంది విస్మృత వీరుల సమాచారాన్ని వెలికి తీయవచ్చు. దేశం కోసం జీవించి, దేశం కోసం మరణించినప్పటికీ మరచిపోయిన వారి పేర్లను మీ ప్రయత్నాలు ముందుకు తెస్తాయి. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల ఉత్సవాల్లో గొప్ప వ్యక్తులను మనం గుర్తుకు తెచ్చుకుంటే అదే వారికి నిజమైన నివాళి అవుతుంది. సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా దీని కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని నా ఉపాధ్యాయ మిత్రులను కోరుతున్నాను. ఈ ఉద్యమం లో అందరూ సమిష్టి గా కృషిచేయాలని కోరుతున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! దేశం సాగించే ప్రగతి ప్రయాణం ప్రతి పౌరుడి భాగస్వామ్యం వల్లే విజయవంతం అవుతుంది. ఈ ప్రయాణంలో అందరూ కలిసివస్తేనే ఈ వికాస యాత్ర ఫలవంతమవుతుంది. అందువల్ల దేశంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. అందరం కలిసి కరోనాను పూర్తిగా ఓడించాలి. మీరు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే కరోనాను ఓడించవచ్చు. "రెండు గజాల దూరం. మాస్క్ అవసరం" అనే ఆచరణను మీరు పూర్తిగా పాటించినప్పుడు మాత్రమే కరోనా ఓడిపోతుంది. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి. సంతోషంగా ఉండండి. ఈ శుభాకాంక్షలతో తరువాతి 'మన్ కి బాత్'లో కలుద్దాం.

చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!

Show Full Article
Print Article
Next Story
More Stories