Parliament: ‘మణిపుర్‌’పై కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. లోక్‌సభ వాయిదా

Lok Sabha Adjourned Till 12 Noon As Bedlam Over Manipur Issue Continues
x

Parliament: ‘మణిపుర్‌’పై కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. లోక్‌సభ వాయిదా

Highlights

Parliament: ప్రధాని మోడీ పార్లమెంట్‌లో స్పందించాలని విపక్షాల డిమాండ్

Parliament: మణిపూర్ అంశంపై విపక్ష సభ్యుల నిరసనలతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. దీంతో లోక్ సభను ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నినాదాలు చేశారు. ఈ విషయమై ప్రధాని మోడీ లోక్ సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ప్రతి రోజూ పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలను స్పీకర్ ఓం బిర్లా కొనసాగించారు. అయితే విపక్ష సభ్యులు ప్ల కార్డులతో పోడియం వద్దకు వచ్చారు. ఈ పరిస్థితులతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

మణిపూర్ విషయంలో మోదీ సర్కార్ విఫలమైందని విపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్‌ హింసపై మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఒకవేళ ప్రధాని మోదీ దీనిపై మాట్లాడి ఉంటే కొంత వరకైనా అలజడి తగ్గుతుందన్నారు. అందుకే...ఈ తీర్మానం ప్రవేశపెట్టామన్నారు.

అటు రాజ్యసభలోనూ విపక్షాలు మణిపూర్‌ అంశాన్ని లేవనెత్తగా.. వారి ఆందోళనల నడుమే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అంతకుముందు కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఉభయ సభలు నివాళులర్పించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories