Kolkata Doctor Rape-Murder Case: అసలేం జరిగింది? మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేస్తోంది?

CBI questioned ex-principal in murder case
x

Kolkata Doctor Rape-Murder Case: హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

Highlights

Kolkata Doctor Rape and Murder Case: కోల్ కతాలోని ఆర్.జీ.కర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైన ఘటన దేశమంతటా ఆందోళనలకు దారి తీసింది.

Kolkata Doctor Rape and Murder Case: కోల్ కతాలోని ఆర్.జీ.కర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైన ఘటన దేశమంతటా ఆందోళనలకు దారి తీసింది. ఈ కేసులో నేరస్థుడిని వెంటనే ఉరి తీయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోరారు. ఈ డిమాండ్ తో ర్యాలీ నిర్వహిస్తానని కూడా ఆమె ప్రకటించారు.

స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. మహిళలపై అత్యాచారాలు చేస్తే ఉరికంబం ఎక్కాల్సి వస్తుందనే భయాన్ని సమాజంలో పుట్టించినప్పుడు, భవిష్యత్తులో ఎవరూ అలాంటి పనులకు సాహసించరని స్వయంగా ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.

మరో వైపు ఈ ఘటనను నిరసిస్తూ ఆగస్టు 17న దేశ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఆసుపత్రిపై దుండగులు దాడి చేసిన ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏం చేస్తోందని దీదీ సర్కార్ పై న్యాయస్థానం సీరియస్ అయింది.

ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య అంటూ పేరేంట్స్ కు సమాచారం

ఆర్ జీ కర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ట్రైనీ డాక్టర్ ఈ నెల 8 విధులకు హాజరయ్యారు. తోటి సిబ్బందితో కలిసి ఆమె డిన్నర్ చేశారు. అంతకుముందు ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా మ్యాచ్ ను ఆమె చూశారు. ఆ తర్వాత రెస్ట్ కోసం సెమినార్ హాల్ కు వెళ్లారు.

మరునాడు అంటే ఆగస్టు 9న ఆమె మృతదేహన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చిందని పేరేంట్స్ చెప్పారు. ఆగస్టు 8వ తేదీ రాత్రి పదకొండున్నర గంటల సమయంలో తమ కూతురు తమతో మాట్లాడిందని పేరేంట్స్ మీడియాకు చెప్పారు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే హత్య చేసినట్టుగా ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

పోస్టుమార్టం నివేదిక ఏం చెబుతోంది?

ట్రైనీ డాక్టర్ మృతదేహంపై ఉన్న గాయాలు ఆమెను హత్య చేశారనే అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్టుగా ఉన్నాయని మృతురాలి బంధువులు, ఆందోళన చేస్తున్న విద్యార్థులు చెబుతున్నారు. మృతదేహం పెదవులు, ముక్కు, చెంపలు, దవడకు గాయాలున్నాయి. అంతేకాదు కాళ్లు, చేతులు, మెడ భాగంలో గాయాలున్నట్టుగా పోస్టుమార్టం నివేదిక చెబుతుంది.

మృతురాలి రెండు కళ్ల నుంచి రక్తం కారింది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ తో పాటు శరీరంలోని పలు అవయవాల్లో రక్తస్రావమైందని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ఈ గాయాలను చూస్తే మృతురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఈ అనుమానాలకు బలం చేకూరేలా ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యాన్ని గుర్తించినట్టుగా పోస్టుమార్టం నివేదిక బయటపెట్టింది. ఈ నెల 9వ తేదీ రాత్రి ఈ నివేదిక బయటకు వచ్చింది.


కోల్ కతా పోలీసులకు మమత బెనర్జీ డెడ్ లైన్ ఎందుకిచ్చారు?

ఈ ఘటనపై బెంగాల్ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. బీజేపీ, లెఫ్ట్ పార్టీల నాయకులు దీదీపై విరుచుకుపడ్డారు. ఈ కేసుపై మొదటి నుంచే పోలీసులు విమర్శలు ఎదుర్కొన్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా పోలీసులకు డెడ్ లైన్ విధించడం చర్చకు దారితీసింది.

వారం రోజుల్లోపుగా కేసును తేల్చకపోతే సీబీఐకి అప్పగిస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ నెల 18 లోపుగా ఈ కేసును తేల్చాలని పోలీసులకు ఆమె అల్టిమేటం ఇచ్చారు. ఈ నెల 12న బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, పోలీసులు రేప్, హత్య కేసు పెట్టకుండా అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిండంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.

హత్య కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించిన హైకోర్టు

ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కోల్ కతా హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. మృతురాలి పేరేంట్స్ సహా మరో మూడు పిటిషన్లపై హైకోర్టు ఈ నెల 13న విచారించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.

హత్యకేసును ఎందుకు నమోదు చేయలేదని న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి ఆర్ జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ను ప్రశ్నించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. విధులనుంచి తప్పించిన ఘోష్ ను మరో కాలేజీకి ప్రిన్సిపల్ గా ఎలా నియమిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఆయనను సెలవుపై వెళ్లాలని కూడా కోర్టు ఆదేశించింది.


ఆమె నా బిడ్డ లాంటిదే: మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్

ట్రైనీ డాక్టర్ మృతిపై తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నానని మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ అన్నారు. మృతురాలు తనకు కూడా బిడ్డలాంటిదేనన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. సంఘటన జరిగిన గంటలోపుగానే తాను పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. పోలీసులకు సీసీటీవీ పుటేజీని కూడా అందించానన్నారు. అయితే, సందీప్ ఘోష్ మీద గతంలోనూ ఆరోపణలున్నాయి. రెండు సార్లు ఆయన సస్పెండ్ అయి మళ్ళీ విధుల్లో చేరారు.


నిందితుడు సంజయ్ రాయ్ ను పట్టించిన హెడ్ సెట్

ఈ కేసులో సంజయ్ రాయ్ ను పోలీసులు ఈ నెల 10న అరెస్ట్ చేశారు. మృతదేహం పడిఉన్న ప్రదేశంలో హెడ్ సెట్ లభ్యమైంది. ఈ హెడ్ సెట్ ఆధారంగా పోలీసులు సంజయ్ రాయ్ ను గుర్తించారు. ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున సెమినార్ హల్ కు నిందితుడు వెళ్లినట్టుగా పోలీసులు సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. సెమినార్ హల్ నుంచి అతను 45 నిమిషాల తర్వాత బయటకు వచ్చారని ఇందులో రికార్డైంది. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన అతను తన దుస్తులను శుభ్రపర్చుకొని నిద్రపోయారు.

నిందితుడు ఉపయోగిస్తున్న ఫోన్ కు సంఘటన స్థలంలో దొరికిన బ్లూటూత్ హెడ్ సెట్ కనెక్ట్ అయిందని కోల్ కతా పోలీసులు చెప్పారు. నిందితుడు ఇదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్నారు. 2019 నుంచి ఆయన సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.

తొలుత డిజాస్టర్ మేనేజ్ మెంట్ గ్రూప్ లో పనిచేసేవారు. ఆ తర్వాత పోలీస్ శాఖ వేల్ఫేర్ సెల్ కు బదిలీ అయ్యారు. దీంతో ఆయన ఈ ఆసుపత్రి వద్ద పనిచేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు బెడ్ ఇప్పిస్తానని, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తానని డబ్బులు వసూలు చేసేవారని ఆయనపై ఆరోపణలున్నాయి.

ముగ్గురు భార్యలు సంజయ్ ను వదిలివెళ్లారు. ఓ భార్య గత ఏడాది క్యాన్సర్ తో చనిపోయింది. నిందితుడు ఉపయోగించిన సెల్ ఫోన్ లో అశ్లీల వీడియో క్లిప్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు.


ఆర్ జీ కర్ ఆసుపత్రిపై దుండగుల దాడి.. హైకోర్టు సీరియస్

ఆర్ జీ కర్ ఆసుపత్రిపై ఈ నెల 14వ తేదీ రాత్రి దుండగులు దాడికి దిగారు. ఆసుపత్రిలోని అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, ఔట్ పేషేంట్ విభాగాలతో పాటు, ఆసుపత్రి ఆవరణలో ఉన్న కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న కొందరు వీడియో జర్నలిస్టులపై కూడా దాడికి యత్నించారు.

పోలీసులు ఈ గుంపును చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించారు. సెమినార్ హల్ లో ఎలాంటి ఆధారాలు ధ్వంసం కాలేదని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడినవారిలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఈ దాడి ఎందుకు చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కూడా హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని ఆగస్టు 16న హైకోర్టు అభిప్రాయపడింది. గుంపుగా వచ్చి దాడి చేసేవరకు పోలీసులకు ఎందుకు తెలియదా అని కోర్టు ప్రశ్నించింది.

రంగంలోకి దిగిన సీబీఐ బృందం

కోల్ కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ట్రైనీ డాక్టర్ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసింది. మృతురాలి కుటుంబసభ్యుల నుండి సమాచారం సేకరించారు. మరో వైపు ఘటన జరిగిన ప్రదేశాన్ని కూడ పరిశీలించారు. ఈ ఆసుపత్రిలోని ఐదుగురిని సీబీఐ అధికారులు ఆగస్టు 15న ప్రశ్నించారు. ఆసుపత్రి ప్రిన్సిపల్ సుహృతా పాల్ ను విచారించారు. 15 మంది వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. గతంలో ఈ కాలేజీకి ప్రిన్సిపల్ గా పనిచేసిన సందీప్ ఘోష్ ను కూడా విచారించనుంది.


వైద్య విద్యార్ధులకు అండగా గవర్నర్ ఆనంద్ బోస్

ఆర్ జీ కర్ ఆసుపత్రిపై దుండగులు దాడి చేసిన ప్రాంతాన్ని రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ పరిశీలించారు. ట్రైనీ డాక్టర్ హత్య ఘటనపై ఆందోళనకు దిగిన వైద్య విద్యార్థులతో మాట్లాడారు. నేను మీతో ఉన్నానని చెప్పారు. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కోల్ కతా ఘటనపై దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories