కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసు: ఆ డాక్యుమెంట్ చుట్టే తిరిగిన సుప్రీం కోర్టు విచారణ

కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసు: ఆ డాక్యుమెంట్ చుట్టే తిరిగిన సుప్రీం కోర్టు విచారణ
x
Highlights

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్ - మర్డర్ కేసుపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణలో సుప్రీం కోర్టు ప్రధానంగా ఒక డాక్యుమెంట్...

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్ - మర్డర్ కేసుపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణలో సుప్రీం కోర్టు ప్రధానంగా ఒక డాక్యుమెంట్ గురించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్‌ను, సీబీఐ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

ఎందుకంటే ఆ డాక్యుమెంట్‌ని కోర్టుకు అందివ్వడంలో పశ్చిమ బెంగాల్ సర్కారు విఫలమైంది. ఇంతకీ ఆ ముఖ్యమైన డాక్యుమెంట్ ఏంటి? కోర్టు ఎందుకు ఆ డాక్యుమెంట్ గురించే పశ్చిమ బెంగాల్ సర్కారుని నిలదీసింది? తనకు ఆ డాక్యుమెంట్ కచ్చితంగా కావాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఎందుకన్నారు? ఆ డాక్యుమెంట్ ఎందుకంత ముఖ్యం? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసుపై విచారణ సుప్రీం కోర్టులో విచారణ నడుస్తోంది. గతంలోనే ఈ కేసుపై లోతైన దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి శాంపిల్స్ పంపించి నివేదిక తెప్పించుకున్నారు. ఇదే విషయమై ఈ కేసులో ప్రధానమైన ఫోరెన్సిక్ రిపోర్ట్ అంశంపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఘటనా స్థలంలో దుస్తులు లేకుండా పడి ఉన్న బాధితురాలి మృతదేహం, అక్కడికి సమీపంలోనే ఆమె జీన్స్, లోదుస్తులు పడి ఉండటం వంటి వివరాలు ఈ కేసు పైలులో నమోదయ్యాయి. అంతేకాకుండా, మృతదేహంపై గాయాలను కూడా గుర్తించారు. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పంపించిన శాంపిల్స్‌ను ఎవరు సేకరించారనే కోణంలోనే తమకు స్పష్టత కొరవడిందని సీబీఐ పలు సందేహాలు వ్యక్తంచేసింది. అందుకే మరోసారి పరీక్షల కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కి శాంపిల్స్ పంపించాలని అనుకుంటున్నామని కోర్టుకు తెలిపింది. సరిగ్గా ఇక్కడే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సూటిగా స్పందించారు. అక్కడి నుండి విచారణ మొత్తం ఆ డాక్యుమెంట్ చుట్టే తిరిగింది. ఇంతకీ ఏంటా డాక్యుమెంట్?

ఆ ముఖ్యమైన డాక్యుమెంట్ ఏమైంది ? చీఫ్ జస్టిస్ సూటి ప్రశ్న..

శాంపిల్స్ ఎవరు సేకరించారో స్పష్టత లేదన్న సీబీఐ సందేహానికి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందిస్తూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినప్పుడు అవసరమైన చలాన్ డాక్యుమెంట్ ఎక్కడుందని పశ్చిమ బెంగాల్ సర్కారు తరపు న్యాయవాది కపిల్ సిబల్‌ని ప్రశ్నించారు.

సీజేఐ అడిగిన ప్రశ్నకు కపిల్ సిబల్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆ డాక్యుమెంట్ తన వద్ద లేదన్నారు. సమయం ఇస్తే త్వరలో ఆ డాక్యుమెంట్‌ను కోర్టుకి అందిస్తానని బదులిచ్చారు. కపిల్ సిబల్ రిప్లైతో సంతృప్తి చెందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ డాక్యుమెంట్ తమకు చాలా ముఖ్యమని, తప్పకుండా కావాలని అన్నారు.

చీఫ్ జస్టిస్ ఆ డాక్యుమెంట్ ఎందుకు కావాలన్నారు.. అందులో ఏముంది?

ఏదైనా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించేటప్పుడు ఆ మృతదేహం ఏ తేదీన, ఏ సమయంలో, ఎక్కడ, ఎలాంటి కండిషన్‌లో లభించింది అనే వివరాలు తెలిపే డాక్యుమెంట్ అది. దానినే చలాన్ అని లేదా రిక్వెస్ట్ ఫామ్ అని కూడా అంటుంటారు. మృతదేహంపై ఉన్న దుస్తులు ఏ రకం, వాటి రంగు ఏంటి? ఆ దుస్తులు ఎలాంటి కండిషన్‌లో ఉన్నాయి? మృతదేహంపై ఉన్నాయా లేదా పక్కన లభించాయా? అలాగే మృతదేహం వద్ద లభించిన ఇతర వస్తువులు ఏంటి అనే వివరాలను పొందుపరుస్తూ కేసు విచారణ చేపట్టిన పోలీసు ఆఫీసర్ ఆ చలాన్‌ని అటాప్సీ నిర్వహించే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. చలాన్ లేదా రిక్వెస్ట్ ఫామ్ అని పిలిచే ఆ లీగల్ డాక్యుమెంట్ లేకుండా పంపించే మృతదేహాలకు డాక్టర్స్ పోస్టుమార్టం చేయరు. అది అటాప్సీ నిర్వహించే ప్రక్రియలో ఒక తప్పనిసరి నిబంధన. అందుకే ఆ డాక్యుమెంట్ తనకు కావాలని.. ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్న దుస్తులు, వస్తువుల వివరాలు తమకు తెలియాలి అని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ పశ్చిమ బెంగాల్ సర్కారు తరుపు న్యాయవాది కపిల్ సిబల్‌ని ఆదేశించారు. అంతేకాదు.. ఆ డాక్యుమెంట్ లేకుండా పోస్టుమార్టం కూడా చేయరు కనుక అసలు ఆ డాక్యుమెంట్ ఏమైంది, అందులో ఏముందో కోర్టు చూడాల్సిందేనని చీఫ్ జస్టిస్ అడిగారు.

దీనిపై కపిల్ సిబల్ చెప్పిన వివరణను విన్న ప్రధాన న్యాయమూర్తి , మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తే అసలు ఆ రిక్వెస్ట్ ఫామ్ డాక్యుమెంట్ లేకుండానే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారా అని మరోసారి సూటిగా ప్రశ్నించారు.

సీజేఐ అడిగిన ప్రశ్నకు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. రిక్వెస్ట్ ఫామ్ లేకుండా పోస్ట్ మార్టం నిర్వహించడం అసాధ్యమని మెహతా అన్నారు. పోస్టుమార్టం ప్రక్రియకు అది తప్పనిసరి నిబంధన అని ఆయన కపిల్ సిబల్‌కి గుర్తుచేశారు.

అదే సమయంలో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కలిసి ఈ కేసు విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనంలో మరో జస్టిస్ అయిన జేబి పరిడ్వాలా స్పందించారు. పోస్టుమార్టం రిపోర్టుని సూచిస్తూ జస్టిస్ పరిడ్వాలా కీలక వ్యాఖ్యలు చేశారు. పోస్టుమార్టం నివేదికలో మూడో కాలమ్‌ని పరిశీలిస్తే.. పోస్టుమార్టంకు డెడ్ బాడీని తీసుకొచ్చిన కానిస్టేబుల్ వివరాలు అక్కడ రాసి ఉండాలి. కానీ ఆ కాలమ్ కొట్టేసి ఉంది. అంటే పోస్టుమార్టం నివేదికలోనే ఆ వివరాలు మిస్ అవుతున్నాయి. ఆ వివరాలు మిస్ అవుతున్నాయి అంటే ఇంకేదో తప్పు జరుగుతున్నట్లేనని భావించాల్సి ఉంటుంది అని జస్టిస్ పరిడ్వాలా కపిల్ సిబల్‌ని ఉద్దేశించి ప్రశ్నించారు.

జస్టిస్ పరిడ్వాలా లేవనెత్తిన పాయింట్ గురించి సీజేఐ డివై చంద్రచూడ్ స్పందిస్తూ... మిస్ అవుతున్న ఆ కీలకమైన డాక్యుమెంట్ గురించి సీబీఐ అధికారులు కూడా పశ్చిమ బెంగాల్ సర్కారుని డిమాండ్ చేయాలన్నారు.

ఇదే కేసు విచారణకు హాజరైన మరో న్యాయవాది స్పందిస్తూ.. ఆ డాక్యుమెంట్‌ని తాము కోల్‌కతా హై కోర్టు విచారణ జరిగిన సమయంలోనే హై కోర్టుకు సమర్పించామని తెలిపారు.

ఆ న్యాయవాది చెప్పిన వివరణపై సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. పోస్టుమార్టం నివేదికలోనే ఆ డాక్యుమెంట్ గురించి ప్రస్తావించలేదు. అలాంటి డాక్యుమెంట్‌ని ఆ తరువాత జరిగిన కోర్టు విచారణలో ప్రొడ్యూస్ చేశారంటే.. అది ఆ తరువాత సృష్టించినదే అయ్యుండే అవకాశం లేకపోలేదన్నారు.

సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేవనెత్తిన సందేహానికి కపిల్ సిబల్‌ స్పందించారు. తామేదీ కొత్తగా సృష్టించలేదని.. అన్ని వివరాలు పొందుపరుస్తూ తాము కోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తామని బదులిచ్చారు.

సీబీఐ కూడా, తమకు అప్పగించిన కేసు ఫైలులోనూ ఆ డాక్యుమెంట్ లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సరిగ్గా ఇక్కడే పిటిషనర్స్ తరపు న్యాయవాది ఒకరు కలుగజేసుకున్నారు. హైకోర్టు ఇచ్చిన నివేదికలో పోస్టుమార్టం రిక్వెస్ట్ ఫామ్ ఉన్నట్లుగా ఉంది. కానీ ఆ డాక్యుమెంట్ తన వద్ద లేదని పశ్చిమ బెంగాల్ సర్కారు తరపు న్యాయవాది కపిల్ సిబల్‌ చెప్పడం ఏంటని ఆ న్యాయవాది ప్రశ్నించారు.

సుప్రీం కోర్టులో జరిగిన వాదనలు, సీజీఐ సహా మిగతా జడ్జిలు అడిగిన ప్రశ్నల ప్రకారం ప్రస్తుతం ఈ కేసులో కోర్టు ఎదుట జవాబు లేని ప్రశ్నలివి.

కోల్‌కతా రేప్, మర్డర్ కేసులో మృతదేహాన్ని పోస్టుమార్టంకి తీసుకెళ్లిన పోలీసు సిబ్బంది ఎవరు? పోస్టుమార్టం తీసుకెళ్లినప్పుడు అటాప్సీ అధికారులకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన రిక్వెస్ట్ ఫామ్ ఏమైంది?

ఒకవేళ ఆ రిక్వెస్ట్ ఫామ్ ఉంటే, పోస్టుమార్టం నివేదికలో మూడో కాలమ్ ఎందుకు కొట్టేశారు ?

పోస్టుమార్టం నివేదికలోనే ఆ డాక్యుమెంట్ వివరాలు లేనప్పుడు, ఆ తరువాత జరిగిన విచారణలో భాగంగా కోల్‌కతా హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్ ఎక్కడి నుండి వచ్చింది?

ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి శాంపిల్స్ సేకరించి పంపించింది ఎవరు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్న సుప్రీంకోర్టు... సెప్టెంబర్ 17 నాటికి మరొక తాజా నివేదికతో రావాలని సీబీఐని ఆదేశించిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories