ఖుష్బూను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ఖాయమా?

ఖుష్బూను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ఖాయమా?
x
Highlights

ఒకప్పుడు వెండితెరకే కొత్త అందం అద్దిన హీరోయిన్. హీటెక్కించే ట్వీట్లతో కాక రేపిన ఫైర్‌బ్రాండ్. కాంగ్రెస్‌‌కు స్ట్రాంగ్‌ వాయిస్‌గా దుమ్మురేపిన లీడర్....

ఒకప్పుడు వెండితెరకే కొత్త అందం అద్దిన హీరోయిన్. హీటెక్కించే ట్వీట్లతో కాక రేపిన ఫైర్‌బ్రాండ్. కాంగ్రెస్‌‌కు స్ట్రాంగ్‌ వాయిస్‌గా దుమ్మురేపిన లీడర్. ఇప్పుడామె కాషాయతీర్థం పుచ్చుకున్నారు. కోలుకుంటున్న కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. ఆమె ఎవరో మీకిప్పటికే అర్థమై వుంటుంది. ఔను. ఖుష్బూ. తమిళనాడు రాజకీయ సంక్షోభం నేపథ్యంలో, ఇక నుంచి ఖుష్బూ ప్రస్థానం ఎలా ఉండబోతోంది? అరవభూమిలో ఖుష్బూకి బీజేపీ ఎంత అవసరం బీజేపీకి ఖుష్బూ ఎంత అవసరం.? శశికళ, స్టాలిన్‌ను ఖుష్బూ ఢీకొట్టగలరా? అప్‌కమింగ్‌ రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ను దాటెయ్యగలరా? మరో జయలలితలా జనం గుండెల్లో స్థానం సంపాదించాలన్న ఖుష్బూ ఆశయం నెరవేరుతుందా?

ఖుష్భూ. పరిచయం అక్కర్లేని పేరు. దక్షిణాది సినిమాలో ఇండస్ట్రీలో కథానాయిక. రాజకీయాల్లోనూ నిత్యం పతాక శీర్షికల్లో వుండే లీడర్. తమిళనాడులో కాంగ్రెస్‌కు స్ట్రాంగ్‌ వాయిస్‌గా రైజ్ అయిన ఖుష్బూ, హస్తానికి హ్యాండిచ్చి, కమలం గూటికి చేరారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా తన వాగ్దాటితో చెలరేగిపోయిన ఖుష్బూ, కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలోకి వెళ్లారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపిన ఖుష్బూ, అందుకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధంలేని కొందరు కాంగ్రెస్‌ అగ్ర నాయకుల తీరుతో విసుగొచ్చి, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడు కాంగ్రెస్‌ అభివృద్దికి ఇంత కష్టపడినా, తాను ఏనాడూ నేము, ఫేము కోసం పాకులాడలేదన్న ఖుష్బూ, రాహుల్‌ గాంధీకి కృతజ్నతలు తెలిపారు. ఖుష్బూ రాజీనామా వెనువెంటేనే, ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.

హీరోయిన్‌గా ఇటు తెలుగు, అటు తమిళ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఖుష్బూ. ఆమె అంటే తమిళనాడులో ఎంత పిచ్చి అంటే, ఏకంగా ఆమెకు ఆలయాలూ కట్టారు. 2010లో డీఎంకేలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఖుష్బూ, 2014లో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు సరిగ్గా తమళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు, కమలం తీర్థం పుచ్చుకున్నారు.

జయలలిత చనిపోయిన తర్వాత తమళనాడు రాజకీయంలో, ఒక శూన్యత ఏర్పడింది. దాన్ని భర్తీ చేసేందుకు కమల్‌హాసన్‌ ప్రయత్నించారు. కొంత వెనకబడ్డారు. రజినీకాంత్‌ వస్తాడు, వస్తాడు అని ఊరిస్తున్నా, ఆయన పార్టీ ఏంటో, విధానమేంటో ఇప్పటికీ ఎవ్వరికీ బోధపడలేదు. అన్నాడీఎంకే నడిసంద్రంలో నావలా, మునిగేందుకు సిద్దంగా వుంది. దీంతో అన్నాడీఎంకేను రీప్లేస్ చేసేందుకు, డీఎంకేను బలంగా ఢీకొట్టేందుకు బీజేపీకి బలమైన అస్త్రం లేదు. అటు జయలలిత నెచ్చెలి శశికళ కూడా త్వరలో జైలు నుంచి విడుదలై, అన్నాడీఎంకేను పూర్తిగా హ్యాండోవర్ చేసుకోవడమో లేదంటే, కొత్త పార్టీ పెట్టడమో చేస్తారు. దీంతో అటు శశికళ, ఇటు స్టాలిన్‌తో పోరాడేందుకు బీజేపీకి కనపడుతున్న అస్త్రం ఖుష్బూ.

ఖుష్బూకు కూడా, బీజేపీ తీర్థం ఇప్పుడు అవసరమే. ఎందుకంటే, కాంగ్రెస్‌కు అంత సీన్‌ లేదు. తన రాజకీయ అత్యున్నత ఆశయం నెరవేరాలంటే, కాషాయమే శరణ్యం. అటు బీజేపీకి ఖుష్బూ ఎంత అవసరమో, ఇటు ఖుష్బూకి సైతం బీజేపీ అంతే అవసరం. అందుకే విన్‌విన్‌ సిచ్యువేషన్ ఇద్దరికీ. ఖుష్బూను బీజేపీ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే తమిళనాడులో బలపడేందుకు బీజేపీ ఎన్నో ఎత్తులు వేసింది. మోడీ సైతం ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇప్పడు ఖుష్బూను ముందు పెట్టి, మరో జయలలిత ఈమె అంటూ ప్రొజెక్ట్ చేసి, దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని గుప్పిపట్టేందుకు పావులు కదుపుతున్నారు కమలం అధి నాయకులు.

అయితే, కర్ణాటకలో ఖాతా ఓపెన్ చేసినంత ఈజీకాదు తమిళనాడులో బీజేపీకి. హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటూ ఇప్పటికే అక్కడి జనం బీజేపీ మీద చాలా కోపంగా వున్నారు. జల్లికట్టుపై బీజేపీ తీరుపైనా ఆగ్రహంగా వున్నారు. జాతీయ పార్టీలకు ఇక్కడ ఏమాత్రం స్థానంలేదని తమిళ మేధావులంటున్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు ఎక్కువగా వుండే తమిళనాడులో, కమలానికి అంత ఈజీకాదు. అదే సమయంలో మొన్నటి వరకు బీజేపీ విధానాలను, మోడీని, అమిత్‌ షాను, తిట్టిపోసిన ఖుష్బూ, ఇప్పుడు సమర్థించాల్సి రావడం, అక్కడి జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. ఖుష్బూకి కూడా కత్తి మీద సామే. మొత్తానికి ఖుష్బూ రాకతో, తమిళనాడు కమలానికి కొత్త గ్లామరొచ్చింది. ఆమెను చూసి మరికొందరు పార్టీలో చేరుతారని భావిస్తోంది బీజేపీ. చూడాలి, మరో జయలలిత కావాలని తపిస్తున్న ఖుష్బూ, మరో దక్షిణాది రాష్ట్రాన్ని ఏలాలన్న కమలం ఆశలు, నెరవేరుతాయో, రివర్స్‌ అవుతాయో.


Show Full Article
Print Article
Next Story
More Stories