KC Venugopal: కర్ణాటక కాంగ్రెస్ ఐక్యంగా ఉంది.. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు

KC Venugopal About Karnataka Congress
x

KC Venugopal: కర్ణాటక కాంగ్రెస్ ఐక్యంగా ఉంది.. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు 

Highlights

KC Venugopal: కర్ణాటక సీఎం ఎంపిక ప్రక్రియ సజావుగా జరుగుతుంది

KC Venugopal: ఢిల్లీలోని ఖర్గే నివాసంలో కర్ణాటక పంచాయితీ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు డీకే శివకుమార్. ప్రస్తుతం సోనియా గాంధీ ఢిల్లీలో అందుబాటులో లేనందున.... ఖర్గే, రాహుల్‌తో శివకుమార్, సిద్దరామయ్య భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రంలోపు కర్ణాటక సీఎం ఎవరో అధిష్టానం తేల్చనుంది. నూతన సీఎం ప్రమాణస్వీకారం గురువారం జరగనుంది. మంత్రులు కూడా ఆరోజే ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఓ వైపు సీఎం ఎంపిక ప్రక్రియ హస్తిన కేంద్రంగా కొనసాగుతుండగానే... మరో వైపు కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు అసెంబ్లీ, సచివాలయాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఐదు గ్యారెంటీ స్కీమ్‌ల అమలుకు ఫైల్స్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ఫైలుపైనే కొత్త సీఎం తొలి సంతకం చేయనున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కోటిన్నర మహిళలకు నెలకు 2వేలు, బీపీఎల్ కుటుంబానికి ఉచితంగా 10కిలోల బియ్యం, నిరుద్యోగ భృతి కింద డిగ్రీ చదివిన వారికి 3 వేలు, డిప్లమా హోల్డర్లకు నెలకు 15 వందలతో పాటు... మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఫైలుపై సీఎం సంతకం చేయనున్నారు. అయితే కొత్త సీఎం రాజభవన్‌లో ప్రమాణస్వీకారం చేస్తారా లేక బహిరంగసభలో ప్రమాణస్వీకారం చేస్తారా అన్న అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని శివకుమార్‌ అన్ని విధాలా ముందుకు నడిపించి అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించినప్పటికీ ఆయనపై ఉన్న ఈడీ, ఆదాయపు పన్ను కేసులే ఇప్పుడు అడ్డంకిగా మారవచ్చని తెలుస్తోంది.

ఒకటికి మించిన డిప్యూటీ సీఎంలు ఉంటే తనకు ప్రాధాన్యం ఉండదన్న కారణంతో శివకుమార్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఒకటే డిప్యూటీ సీఎం పదవి ఉండాలని డీకే పట్టుబడితే మిగతా వర్గాలకు ఎలా నచ్చజెప్పాలన్న అంశంపైనా ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని తనకు అప్పగిస్తూ సీఎల్పీలో తీర్మానం చేసినా పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాత్రం పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌లతో సంప్రదించాకే నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు.

2024 పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌ చెప్పుకోదగ్గ పనితీరు కనబరచాలంటే డీకే శివకుమార్‌ సేవలు చాలా అవసరమని, ఆ నేపథ్యంలో ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి తేవడం సాధ్యంకాదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తగిన సంఖ్యలో లోక్‌సభ స్థానాలు గెలిపించుకోవాంటే సిద్ధరామయ్య, శివకుమార్‌లు ఇద్దర్నీ ఒప్పించి ముందుకు నడిపించడం అత్యంత అవసరమని పార్టీ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories