MUDA Scam: కర్ణాటక సీఎంపై విచారణకు గవర్నర్‌ అనుమతి

Karnataka Governor grants permission to prosecute CM Siddaramaiah in MUDA scam
x

MUDA Scam: కర్ణాటక సీఎంపై విచారణకు గవర్నర్‌ అనుమతి

Highlights

MUDA Scam: ముడా ఇంటి స్థలాల అక్రమాలపై ఫిర్యాదులు

MUDA Scam: కర్ణాటక రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల పంపిణీలో అక్రమాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్‌ అనుమతించడం కలకలం రేపింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ అనుమతులు ఇచ్చారు.

సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు- విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష బీజేపీ, జేడీఎస్‌ ఆరోపిస్తున్నాయి. ఇవే ఆరోపణలతో సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్‌కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ తదితరులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై వివరణ ఇచ్చేందుకు విచారణకు హాజరు కావాలని జులై 26న ముఖ్యమంత్రికి గవర్నర్‌ నోటీసులిచ్చారు.

సిద్దరామయ్యకు నేటిసుల నేపథ్యంలో.. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులంతా హుటాహుటిన బెంగళూరుకు బయల్దేరారు. సీఎం సిద్దరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చిన పత్రాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్‌, సీఎం కార్యదర్శి, అదనపు ముఖ్య కార్యదర్శి ఎల్‌కే అతీక్‌కు రాజ్‌భవన్‌ నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్‌ కీలుబొమ్మగా మారారని, ప్రాసిక్యూషన్‌ అనుమతులు ఇవ్వడం ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని, బీజేపీ, జేడీఎ్‌సకు చెందిన రాష్ట్ర నాయకులు కొందరు ఈ కుట్రకు సూత్రధారులని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. రాజీనామా చేసేంత తప్పు తానేమీ చేయలేదని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఢిల్లీలో చేసిన తరహాలోనే కర్ణాటకలోనూ కుట్ర పన్నారని ఆరోపించారు.

ప్రాథమికంగా తనపై ఎటువంటి ఆరోపణలు లేవన్నారు. గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని దుయ్యబట్టారు, ప్రాసిక్యూషన్‌ అనుమతులపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఫిర్యాదు వచ్చిన ఒక్కరోజులోనే షోకాజ్‌ నోటీసులు ఇచ్చారని, గవర్నర్‌ నుంచి ఈ విధమైన ప్రక్రియ ఊహించలేదని అన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతులు ఇచ్చారని అన్నారు.

సిద్దరామయ్యకు అధిష్టానం అండగా ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సుర్జేవాలా అన్నారు. ఢిల్లీ నుంచి సీఎంకు ఫోన్‌ చేసిన ఆయన.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఓ లేఖను కూడా పంపారు. కర్ణాటక ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన తీర్పును కాలరాసే విధంగా పీఎంవో, హోంశాఖ వ్యవహరించాయన్నారు. మరోవైపు, మంత్రులు, న్యాయనిపుణులతో సిద్దరామయ్య సాయంత్రం 5గంటలకు అత్యవసరంగా భేటీ అయ్యారు. సీఎంపై విచారణకు గవర్నర్‌ ఆదేశాలతో పార్టీ అగ్రనేతలు అప్రమత్తమయ్యారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వీ బెంగళూరుకు రానున్నారు. ఇవాళ బెంగళూరులో సీఎంతో చర్చలు జరపనున్నారు.

గవర్నర్‌ విచారణకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రమంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరులో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు చలో రాజ్‌భవన్‌కు సిద్ధం కాగా.. పోలీసులు అడ్డుకున్నారు. మైసూరులో కాంగ్రెస్‌ కార్యకర్తలు, సిద్దరామయ్య అభిమానులు ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ముడా కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories