కాసేపట్లో కర్ణాటక ఎన్నికల షెడ్యూల్

Karnataka Election Schedule Release Soon
x

కాసేపట్లో కర్ణాటక ఎన్నికల షెడ్యూల్

Highlights

Karnataka: కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు

Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ఎన్ని విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారనే విషయంపై కాసేపట్లో స్పష్టత వస్తుంది. కాగా, ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనున్న నేపథ్యంలో ఏ క్షణమైన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి.

గత ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లలో గెలుపొందాయి. మరో ముగ్గురు ఇతరులు విజయం సాధించారు. తొలుత కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే సరిగ్గా ఏడాదిన్నర కూడా ఆ ప్రభుత్వం నిలబడలేదు. అనంతరం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.

కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలుండగా.. మ్యాజిక్‌ ఫిగర్‌ 113 స్థానాలు. ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 స్థానాలున్నాయి. కర్ణాటకలో 36 ఎస్సీ, 15 ఎస్టీ రిజర్వేషన్‌ స్థానాలు ఉన్నాయి. కర్ణాటకలో మొత్తం 5కోట్ల 21లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 150 స్థానాల్లో లక్ష్యంగా గెలుపును టార్గెట్ గా పెట్టుకుంది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో లింగాయత్‌ వర్గాలకు 4శాతం రిజర్వేషన్లను బీజేపీ కల్పించింది. 93 స్థానాలకు అభ్యర్థులను జేడీఎస్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ మొదటి వారంలో బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు వయనాడ్, జలంధర్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.

అయితే కర్ణాటక రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్.. తొలి జాబితాను ప్రకటించింది. ఈ నెల 25న 124 మందికి టికెట్ కేటాయిస్తూ తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేస్తుండగా, వరుణ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోలార్ నుంచి ఆయన కుమారుడు, కొరటగెరె నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, దేవనహళ్లి నుంచి మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప, చితాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేయనున్నారు. కాగా, 2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే నాగాలాండ్‌, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. తాజాగా కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఇక మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‍గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories