సీఎం స్టాలిన్ చేతిలో తలైవి డెత్ సీక్రెట్స్.. ఆర్ముగస్వామి రిపోర్టులో అసలేముంది?
Jayalalitha’s Death: ఒక్క మరణం.. వందల ప్రశ్నలు.. అన్నింటికీ మించి సీఎంగా ప్రమాణం చేయడానికి ఆ కొన్ని గంటల ముందు ఏం జరిగింది..?
Jayalalitha's Death: ఒక్క మరణం.. వందల ప్రశ్నలు.. అన్నింటికీ మించి సీఎంగా ప్రమాణం చేయడానికి ఆ కొన్ని గంటల ముందు ఏం జరిగింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తమిళులతో పాటు యావత్ దేశాన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది. అయితే, ఐదేళ్లకుపైగా అందరినీ వెంటాడుతున్న జయ డెత్ మిస్టరీ వీడే టైం వచ్చేసింది. జయలలిత మరణం ఎలా సంభవించింది..? అనారోగ్య కారణాలతోనే అమ్మ తుదిశ్వాస విడిచారా..? లేక కుట్రకోణం ఉందా అన్నదానికి సంబంధించి దాదాపు 500 పేజీల రిపోర్ట్ సీఎం స్టాలిన్ టేబుల్‌పై ఉంది. ఇంతకూ, తమిళనాడు దివంగత సీఎం డెత్ రిపోర్ట్‌లో ఏముంది..? అపోలో ఆస్పత్రిలో చేరడానికి కొన్ని గంటల ముందు అసలేం జరిగింది..?
29-08-22... ఈ రోజు కోసమే కోట్లాది మంది తమిళులతో పాటు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే తమిళుల ఆరాధ్యదైవం, దివంగత ముఖ్యమంత్రి మరణ రహస్యం వీడేది ఆ రోజే. ఐదేళ్లకుపైగా జయలలిత మరణం అంతులేని మిస్టరీగా మారింది. ఒక్కటి రెండూ కాదు కొన్ని వందల ప్రశ్నలు తమిళులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. వాటిలో ప్రధాన ప్రశ్న 2016లో సీఎంగా ప్రమాణం చేయబోయే కొన్ని గంటల ముందు ఏం జరిగిందన్నదే. ఓ వైపు ప్రమాణస్వీకారానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. ఆల్ ఆఫ్ సడెన్‌గా తలైవి అనారోగ్యానికి గురయ్యారు. చివరికి ప్రమాణ స్వీకార ముహూర్తానికి తాత్కాలికంగా మందులు తీసుకుని కార్యక్రమాన్ని ముగించేశారు. కట్ చేస్తే రోజుల వ్యవధిలోనే జయ ఆరోగ్యం మరింత క్షీణించింది. అనంతరం అపోలో ఆస్పత్రిలో చేరడం, 75 రోజులు ప్రాణాలతో పోరాడడం, చివరికి కోట్లాది మంది తమిళులను శోకసంద్రంలో ముంచేస్తూ తుదిశ్వాస విడిచారు. సరిగ్గా ఇక్కడే అమ్మ మరణం అంతుచిక్కని రహస్యంగా మారింది.
ఓవైపు జయలలిత మరణాన్ని తమిళులు జీర్ణించుకోలేపోతోంటే మరోవైపు అక్కడి రాజకీయాలు మొత్తం తలైవి మరణం చుట్టే తిరగడం మొదలైంది. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమెకు అందించిన చికిత్స దగ్గర నుంచి మొదలు పెట్టి సీఎంగా ప్రమాణం చేయబోయే ముందు అసలేం జరిగిందన్న ప్రశ్న వరకూ ప్రతి అంశంపైనా రాజకీయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అందులోనూ జయలలిత నెచ్చెలి శశికళ, పార్టీ నేతలు సహా ఎవ్వరినీ జయతో కలవనివ్వకపోవడం కూడా ఆ అనుమానాలకు తావిచ్చింది. కట్ చేస్తే జయ మరణంపై విచారణ జరిపించాల్సిందిగా శశికళ కోర్టు మెట్లెక్కడం, అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేసిన విజ్ఞప్తులతో అర్ముగస్వామి కమిషన్ ఏర్పాటైంది. 2017 నవంబర్‌లో కమిషన్ విచారణ షురూ చేసింది. జయలలిత సన్నిహితులు, ఆమెకు చికిత్స అందించిన వైద్యులు, అప్పటి తమిళనాడు ఆరోగ్యమంత్రి విజయ భాస్కర్, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం తదితరులను విచారించింది. దాదాపుగా 150 మంది కమిషన్ ఎదుట హాజరై జయలలిత మరణానికి సంబంధించి తమ వద్ద ఉన్న కీలక సమాచారాన్ని అందించారు.
అయితే, 2019లో విచారణ పీక్స్‌లో ఉన్నవేళ అపోలో ఆస్పత్రి మద్రాస్ హైకోర్టును ఆశ్రియించింది. జయ మరణంపై జరుగుతున్న విచారణపై మధ్యంతర స్టే ఇవ్వాలని కోరింది. ఆ పిటిషన్‌లో అపోలో ఆసుపత్రి లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చి పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు ఆర్డర్‌ను అపోలో ఆసుపత్రి సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్ట్ జయలలితకు అందించిన చికిత్సను అర్ధం చేసుకునే విషయంలో అర్ముగస్వామి కమిషన్‌కు తోడ్పాటునందించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎయిమ్స్‌ను ఆదేశించింది. సీన్లోకి ఎంటరయిన ఎయిమ్స్ ప్యానల్ అపోలో మెడికల్ రిపోర్ట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ రిపోర్ట్స్‌లో జయ హార్ట్ ఫెయిల్యూర్ అయినట్టు కూడా గుర్తించింది. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటికే మధుమేహం నియంత్రించలేని కండిషన్‌లో ఉన్నారని, చికిత్స కూడా ఇందుకు అనుగుణంగానే జరిగిందని కమిషన్ తేల్చేసింది. దీనికితోడు హైపర్ టెన్షన్, హైపర్ థైరాయిడ్, ఆస్తమా, ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్, అటోపిక్ డెర్మాటిటిస్ ఉన్నాయని ప్యానెల్ గుర్తించింది. అపోలో ఫైనల్ డయాగ్నసిస్‌తో తాము పూర్తిగా ఏకీభవించినట్టు ఎయిమ్స్ ప్యానల్ స్పష్టం చేసింది.
మరోవైపు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంగా ప్రమాణం చేయబోయే ముందురోజు రాత్రి ఏం జరిగిందనే దానిపైనా కీలక వివరాలు సేకరించారు. ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందే జయ ఆరోగ్యం క్షీణించినట్టు జయ వ్యక్తిగత ఫ్యామిలీ డాక్టర్ శివకుమార్ నివేదించారు. జయలలిత అప్పటికే సొంతంగా నడవలేని పరిస్థితిలో ఉన్నారని ఎక్కువగా స్పృహ కోల్పోయేవారని వెల్లడించారు. అప్పుడే ఆమెను కొడనాడు ఎస్టేట్‌లో విశ్రాంతి తీసుకోమని చెప్పానని అయినా ఆమె వినలేదన్నారు. రోజుకు 16 గంటల చొప్పున పని చేస్తున్న తాను విశ్రాంతి తీసుకోవడం సాధ్యపడదని చెప్పారన్నారు. ఈ క్రమంలోనే సుప్రీం నియమించిన ఎయిమ్స్ ప్యానల్ సైతం రీసెంట్‌గా మరిన్ని వివరాలు వెల్లడించింది. జయ మరణంలో అపోలో తప్పేంలేదని తెలిపింది. జయ తీసుకున్న కొన్ని రకాల ఆహార పదార్ధాలవల్లే ఆమె ఆరోగ్యం విషమించినట్టు స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చేరిన తరువాత చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె ద్రాక్ష, కేక్, స్వీట్లు తీసుకున్నారని, ఫలితంగా జయలలిత ఆరోగ్యం మరింత క్షీణించిందని మూడు పేజీల నివేదికలో పేర్కొంది.
ఇప్పటి వరకూ వచ్చిన నివేదికల ప్రకారం జయలలిత అపోలో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న 75 రోజులకు సంబంధించిన కీలక వివరాలు కూడా బయటకొచ్చాయి. 2016 సెప్టెంబర్ 28న జయ ఆరోగ్యం క్షీణించడం దగ్గర నుంచి డిసెంబర్ 5న మరణించడం వరకూ ఏరోజు ఏం జరిగిందనే వివరాలు అపోలో వైద్యులు తెలిపారు. 2016 సెప్టెంబర్ 28న జయలలిత ఆరోగ్యం క్షీణించడం, ఆ తర్వాత ఊపిరితిత్తుల సమస్య తలెత్తడం లాంటి పరిణామాలతో అక్టోబర్ 7న జయకు ట్రాక్టియోస్టమీ చికిత్సను ప్రారంభించారు. అక్టోబర్ 14 నుంచి లండన్ డాక్టర్ రిచర్డ్ బిలే, ఎయిమ్స్ వైద్యులు, అపోలో వైద్యులు జయకు చికిత్స అందించారు. డిసెంబర్ 3 నాటికి జయ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ తర్వాత డిసెంబర్ 4న శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో జయకు ఎక్మో ఏర్పాటు చేసి 24 గంటల పాటు పర్యవేక్షించారు. చివరికి డిసెంబర్ 5న గుండె, మెదడు పని చేయకపోవడంతో మృతి చెందారు. ఓవరాల్‌గా జయకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపం లేదనేది ఇప్పటి వరకూ వచ్చిన పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే, స్టాలిన్ టేబుల్‌పై ఉన్న దాదాపు 500 పేజీల ఫైనల్ రిపోర్ట్‌లో ఏముందన్నదే అసలు ప్రశ్నంతా.
ఐదేళ్ల విచారణపై ఆర్ముగస్వామి వెల్లడించిన కీలక వివరాలు ఇవే. ఇక మిగిలిందల్లా ఆ ఫైనల్ రిపోర్ట్‌లో ఏముందన్నదే. ఇప్పుడు ఏడు కోట్లకు పైగా తమిళులు, దేశ రాజకీయాలు అమ్మ మరణంపై ఆర్ముగస్వామి అండ్ టీమ్ ఏం తేల్చారని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే, ఈ రిపోర్ట్ తమిళనాడు అసెంబ్లీ ముందుకు వస్తే తప్ప పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఈ నెల 29న జయలలిత ఫైనల్ డెత్ రిపోర్ట్ తమిళనాడు మంత్రివర్గం ముందుకు రానుంది. ఆ తర్వాత అక్కడి అసెంబ్లీలో జయలలిత మరణంపై కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల తర్వాతే ఆర్ముగస్వామి ఐదేళ్ల విచారణ సీక్రెట్స్ బయటపడనున్నాయి. దీంతో అందరి దృష్టీ ఆగస్ట్ 29పైనే ఉంది. మరి ఆ రోజు తలైవి మర్డర్ మిస్టరీ పూర్తిగా వీడుతుందేమో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire