ఎన్ పీఆర్ కు, ఎన్నార్సీకి మధ్య సంబంధం ఉందా.. రాష్ట్రాలు సహకరించకపోతే ఏమవుతుంది ?

ఎన్ పీఆర్ కు, ఎన్నార్సీకి మధ్య సంబంధం ఉందా.. రాష్ట్రాలు సహకరించకపోతే ఏమవుతుంది ?
x
Highlights

ఇప్పుడు యావత్ దేశంలోనూ ఒకే మాట వినిపిస్తోంది. అదే నేషనల్ పాపులేషన్ రిజిష్టర్. రేపటి నాడు నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ కు , నేషనల్ పాపులేషన్...

ఇప్పుడు యావత్ దేశంలోనూ ఒకే మాట వినిపిస్తోంది. అదే నేషనల్ పాపులేషన్ రిజిష్టర్. రేపటి నాడు నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ కు , నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ కు ముడిపెడుతారన్న భయాందోళనలను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాంటిదేమీ ఉండదని కేంద్రం చెబుతున్నా విపక్షాలు మాత్రం విశ్వసించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలు గురించి మాట్లాడుకుందాం.

పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబికిన ఆందోళనను కాస్తంత పక్కదోవ పట్టించడంలో కేంద్రం విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఇప్పుడు అందరి దృష్టి కూడా నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ పై పడింది. మరో వైపున నేషనల్ పాపులేషన్ రిజిష్టర్, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్, పౌరసత్వ సవరణ చట్టం మూడింటినీ లింక్ చేస్తూ విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. ఈ ఆందోళనల్లో సంఘవిద్రోహశక్తులు మిళితమైనట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ ను అమలు చేసేందుకు 3,900 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం పై భగ్గుమంటున్న విపక్షాలు ఎన్పీఆర్ ను కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. రేపటి నాడు నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ ను అమలు చేసేందుకు తొలి అడుగే ఎన్పీఆర్ అని విపక్షాలు భావిస్తున్నాయి. కేంద్రం మాత్రం ఈ రెండిటి మధ్య సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. మరో వైపున విపక్షాల పాలనలో ఉన్న కేరళ, బెంగాల్ రాష్ట్రాలు తాము ఎన్పీఆర్ ను అమలు చేయబోమని ప్రకటించాయి.

అసలు ఎన్పీఆర్ అంటే ఏంటో చూద్దాం. నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ అనేది ఒక దేశంలో సాధారణంగా నివసించే వారి జాబితా. సాధారణంగా నివసించే అనే పదం అర్థం ఏమిటో కూడా హోమ్ మంత్రిత్వ శాఖ వివరించింది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో గత ఆరునెలలుగా నివసిస్తున్నా వారు లేదా కనీసం ఆరు నెలల పాటు అక్కడ ఉందామనుకునేవారు సాధారణ నివాసులుగా తెలిపింది. దీనికీ, పౌరుల గణనకూ సంబంధం లేదు. ఎందుకంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఆరు నెలలకు మించి నివసిస్తున్న విదేశీయులనూ నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ లో నమోదు చేస్తారు. ఎన్నార్సీలో మాత్రం భారతీయ పౌరులను మాత్రమే చేరుస్తారు. ఇదీ ఈ రెండిటికీ ఉండే ప్రధానమైన తేడా.

నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ అనేది కొత్తదేమీ కాదు. కాంగ్రెస్ కూటమినే దీన్ని మొదటిసారిగా ప్రారంభించింది. ఇప్పుడు అదే కూటమి దీన్ని వ్యతిరేకిస్తోంది. ఇక నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ ను తయారు చేసేందుకు చట్టం కూడా అనుమతిస్తోంది. సిటిజన్ షిప్ యాక్ట్ 1955 లోని ప్రావిజన్ల, సిటిజన్ షిప్ నిబంధనల కింద దీన్ని రూపొందిస్తున్నారు. భారతదేశంలో ప్రతీ సాధారణ నివాసి కూడా ఎన్పీఆర్ లో నమోదు కావడం తప్పనిసరి. అసోంను మాత్రం దీని నుంచి మినహాయించారు. అందుకు కారణం ఆ రాష్ట్రంలో ఎన్నార్సీ ఇప్పటికే పూర్తి అయింది. ఎన్పీఆర్ కు, ఎన్నార్సీకి మధ్య సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా విపక్షాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నానాటికీ తీవ్రమవుతున్నాయి.

2004లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం 1955 సిటిజన్ షిప్ యాక్ట్ ను సవరించింది. ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడిని నమోదు చేస్తుంది. ఐడెంటిటీ కార్డ్ ను అందించే వీలు కూడా ఉంది. నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ ను 2010లో, 2015లో కూడా నిర్వహించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎన్పీఆర్ లో సేకరించే వివరాలు ఉపయోగపడుతాయి. అయితే, గతంలో రాని వ్యతిరేకత ఇప్పుడే ఎందుకు వస్తుందో కూడా చూద్దాం.

జనాభా గణన కు ముందు మొదటి దశలో ఎన్పీఆర్ ప్రక్రియ చేపడుతారు. పదేళ్ళకోసారి సెన్సస్ నిర్వహించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే 2021 లో జనాభా గణన చేపట్టనున్నారు. అంతకంటే ముందుగా ఎన్నార్పీని నిర్వహిస్తారు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో దీన్ని నిర్వహిస్తారు. పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తయింది. అంతిమంగా దీన్ని 2020 ఏప్రిల్ ప్రారంభించి సెప్టెంబర్ లో ముగిస్తారు. అయితే గతంలో కంటే ఎక్కువ వివరాలను కేంద్రప్రభుత్వం ఇప్పుడు సేకరిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి.

దేశంలో 2010లో నిర్వహించిన ఎన్పీఆర్ లో 15 అంశాలపై మాత్రమే ప్రజల నుంచి సమాచారం సేకరించారు. వ్యక్తి పేరు, కుటుంబ పెద్దతో అనుబంధం, తండ్రిపేరు, తల్లిపేరు, భర్త లేదా భార్య పేరు, లింగం, పుట్టిన తేదీ, వివాహబంధం, పుట్టిన ప్రాంతం, జాతీయత, ప్రస్తుత చిరునామా, ఎంతకాలంగా ఆ ప్రాంతంలో ఉంటున్నారు, శాశ్వత చిరునామా, వృత్తి, చదువు వివరాలు మాత్రమే గతంలో సేకరించారు. ఇప్పుడు మాత్రం కొత్తగా ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం, గతంలో చివరిసారిగా ఎక్కడ నివసించారు, పాస్ పోర్ట్ ఉంటే దాని నెంబర్, వోటర్ ఐడీ కార్డ్ నెంబర్, పాన్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ లాంటి వివరాలు కూడా సేకరించనున్నారు.

ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరికొన్ని కూడా ఉన్నాయి. ఎన్నార్సీని గనుక చేపట్టదలిస్తే, అందుకు ఎన్పీఆర్ ఉపయోగపడుతుంది. ఒకసారి ఎన్పీఆర్ గనుక రూపొందితే ఎన్నార్సీని తయారు చేయడం కేంద్రానికి సులభమవుతుంది. ఇదే విషయాన్ని 2014లోనే అప్పటి హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు పార్లమెంట్ లో స్పష్టం చేశారు. ఎన్నార్సీ రూపకల్పనలో తొలి అడుగు ఎన్పీఆర్ అవుతుందని స్పష్టం చేశారు. అంటే ఆరేళ్ళ నుంచి బీజేపీ ఈ విషయంలో ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ కలిగి ఉందనే విషయం అర్థమవుతుంది. అందుకే ఎన్పీఆర్ నే అడ్డుకుంటే ఎన్నార్సీకి ఇక స్థానం ఉండదని విపక్షాలు భావిస్తున్నాయి. కాకపోతే ఎన్పీఆర్ డేటాను ఎన్నార్సీ కోసం వినియోగించుకోబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ తీసుకువచ్చిన చట్టం ప్రకారం విదేశీయులతో సహా ప్రతీ ఒక్కరు కూడా ఎన్పీఆర్ లో నమోదు కావడం తప్పనిసరి. ఆ విషయాన్ని మాత్రం విపక్షాలు విస్మరిస్తున్నాయి.

తాజాగా విపక్షాలు ఇప్పుడు ఎన్ పిఆర్ ని వివిధ రాష్ట్రాల్లో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు తాము ఎన్ పిఆర్ ని అమలు చేయబోమని స్పష్టం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్ పిఆర్ ని అమలు చేయవద్దని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు గనుక ఎన్ పిఆర్ ని అమలు చేయకపోతే కేంద్రం ఏం చేస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎన్ పిఆర్ ప్రక్రియను వ్యతిరేకించడంలో మరెన్నో కారణాలు కూడా తోడవుతున్నాయి. వీటిలో ముఖ్యమైంది ప్రైవసీ. పౌరుల వ్యక్తిగత వివరాలెన్నిటినో ప్రభుత్వం సేకరిస్తోంది. రేపటి నాడు ఆధార్, పాన్ లాంటి అనేక కార్డులకు బదులుగా ఒకే కార్డ్ ప్రవేశపెట్టడం కూడా ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. నిజానికి ఇలాంటి ఏర్పాటు ఇప్పటికే పలు దేశాల్లో జరిగింది. ఇలా చేయడం వల్ల వివిధ కార్డులను పొందడంలో జరిగే జాప్యాన్ని నివారించవచ్చు. సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపిక సులభమవుతుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో రకరకాల కార్డులు సమర్పించే అవసరం ఉండదు.

విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ పిఆర్ ని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందన్ని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పౌరసత్వం సంబంధిత అంశాలు పూర్తిగా కేంద్రజాబితాలో ఉన్న అంశాలు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండదు. ఎన్ పిఆర్ విషయంలో కూడా అంతే. కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు పాటించక తప్పదు. మహా అయితే అవి సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అంతిమంగా సుప్రీం తీర్పు కేంద్రానికి అనుగుణంగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేంద్రం గనుక తాను విడుదల చేసే నిధులను ఎన్ పిఆర్ కి ముడిపెడితే రాష్ట్రప్రభుత్వాలకు చిక్కులు తప్పవు. మొదట్లో కొంత బెట్టు చేసినా రాష్ట్రప్రభుత్వాలు ఎన్నార్పీని నిర్వహించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కేరళ, బెంగాల్ బాటలో తెలంగాణ ప్రభుత్వం సైతం ఎన్నార్పీని అమలు చేయవద్దని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఎన్సీఆర్ అమలులో తొలి అడుగు ఎన్ పిఆర్ అంటూ ఆయన విమర్శించారు.

నిజానికి ఎన్ పిఆర్ కొత్తదేమీ కాదు. కాంగ్రెస్ కూటమి తీసుకువచ్చిన చట్టం కిందనే ఎన్ పిఆర్ అమలవుతోంది. అప్పుడు ఆ చట్టానికి మద్దతు పలికిన వారంతా ఇప్పుడు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. అప్పుడే వారు ఆ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకించలేదన్నది ఓ పెద్ద ప్రశ్నగా మారింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశభద్రతతో ముడిపడిన అంశాల పట్ల అన్ని పార్టీల వైఖరి కూడా ఒకే విధంగా ఉండాలి. అలా లేకుండా ప్రజలను విభజించే ప్రక్రియకు పునాది వేసినట్లే అవుతుంది. అదే సందర్భంలో విపక్షాల సందేహాలను తీర్చాల్సిన బాధ్యత కూడా కేంద్రప్రభుత్వంపై ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories