అమెరికా vs చైనా ట్రేడ్ వార్.. మనకు కలిసొచ్చేనా?

అమెరికా vs చైనా ట్రేడ్ వార్.. మనకు కలిసొచ్చేనా?
x
Highlights

అమెరికా చైనా ట్రేడ్ వార్.. భారత్‌కు ఎంత వరకు లాభం చేకూరుస్తోంది..? కరోనా పుట్టినిల్లుగా పరువుమాసిన చైనాతో వాణిజ్యానికి అమెరికా సహా ఎన్నో దేశాలు విముఖత...

అమెరికా చైనా ట్రేడ్ వార్.. భారత్‌కు ఎంత వరకు లాభం చేకూరుస్తోంది..? కరోనా పుట్టినిల్లుగా పరువుమాసిన చైనాతో వాణిజ్యానికి అమెరికా సహా ఎన్నో దేశాలు విముఖత చూపటం భారత్‌కు సానుకూలంగా మారుతుందా..? అదే జరిగితే.. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు భారత్‌‌లో పరిస్థితులెలా ఉన్నాయి...? నిపుణులు ఏం చెబుతున్నారు..?

కరోనాను చైనానే పుట్టించిందంటూ ఆ దేశం ఊసెత్తితేనే నిప్పులు కక్కుతున్న అమెరికా బీజింగ్‌ను ఇరకాటంలోకి నెట్టడమే లక్ష‌్యంగా పావులు కదుపుతోంది. మరోవైపు అమెరికాతో పాటు జపాన్‌ కంపెనీలు చైనాను వదిలి ఆగ్నేయాసియా దేశాలను ప్రత్యామ్నాయాలుగా ఎంచుకున్నాయి. చైనా భూభాగంనుంచి మాన్యుఫాక్చరింగ్ యూనిట్లకు చేయూతగా జపాన్‌ దాదాపు 25వేల కోట్ల యెన్‌ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఇప్పటికే కొన్ని కొరియన్‌ సంస్థలు చైనాను వదిలి భారత్‌లో కార్యకలాపాలు సాగించడానికి ఉత్సాహం చూపుతున్నాయి.

ఈ మధ్య చైనా నుంచి 56 సంస్థలు తరలివెళ్లగా భారత్‌కు దక్కింది కేవలం మూడే అని నొమురా అధ్యయనం వెల్లడించింది. అయితే అన్ని దేశాలు చైనాకు వ్యతిరేకంగా మారుతుండటంతో తయారీ రంగంలో ఎదురు లేని శక్తిగా వెలుగొందిన చైనాది ఇక గత ప్రాభవమేనంటోంది మూడీస్‌ అధ్యయనం. ఇది తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలకు లాభాన్ని చేకూరుస్తాయని తెలిపింది. అయితే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే భారత్‌లో ప్రస్తుత పరిస్థితులు మారాలంటున్నారు నిపుణులు. మన దేశంలో అధిక ఉత్పత్తి వ్యయం, మూలధన పెట్టుబడులు, పన్నుల మోత, పనుల్లో జాప్యం ప్రగతికి ప్రతిబంధకాలుగా ఉన్నాయన్నారు.

‌చైనాకు ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో నిలదొక్కుకునేందుకు కృషి చేయాలని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాష్ట్రాలకు పిలుపిచ్చారు. అయితే ఆ దిశగా సక్సెస్ అవ్వాలంటే మరిన్ని మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లకు అనుమతులివ్వాలని సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థలకు మినహాయింపులు ఇవ్వాలన్న రాష్ట్రాల అభ్యర్థనలకు మన్నన దక్కాలంటున్నారు నిపుణులు. ఉత్పాదక రంగానికి ఊతమిచ్చేలా కీలక విధానాల్ని చురుగ్గా అమలు చేయాలంటున్నారు. భిన్న పరిశ్రమల్ని ప్రొడక్షన్ చైన్‌లో అంతర్భాగం చేయడంతో పాటు భూ, కార్మిక, పన్ను నియంత్రణ వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories