భారత్ కు ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ కంపెనీల క్యూ.. ఎందుకంటే?

భారత్ కు ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ కంపెనీల క్యూ.. ఎందుకంటే?
x
Highlights

కరోనా వ్యాక్సిన్లకు భారత్‌ అడ్డాగా మారుతోందా? అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్‌ కోసం భారత్‌ వైపే చూస్తున్నాయా;? కరోనా కాలంలో భారత్‌ ప్రాధాన్యం మరింత...

కరోనా వ్యాక్సిన్లకు భారత్‌ అడ్డాగా మారుతోందా? అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్‌ కోసం భారత్‌ వైపే చూస్తున్నాయా;? కరోనా కాలంలో భారత్‌ ప్రాధాన్యం మరింత పెరిగిందా? భారత్‌ కంపెనీలతో అగ్రదేశాల ఒప్పందాలు ఎంతవరకు వచ్చాయి..?ఈ సంవత్సరాంతానికి కరోనా ఖతం అవుతుందా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయడానికి దేశాల్నీ కలసికట్టుగా పనిచేస్తున్నాయి. అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్‌ తయారీ కోసం భారత్‌కు క్యూ కడుతున్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్‌లు పరిశోధనలు చేసి, రెండు దశల క్లినకల్‌ ట్రయిల్స్‌ పూర్తయిన తర్వాత మూడో దశ ట్రయిల్స్‌కు భారత్‌ను ఎంచుకున్నాయి. భారత్‌ కంపెనీలతో వ్యాక్సిన్‌ తయారీకి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. బల్క్‌ డ్రగ్స్‌ తయారీలో ప్రపంచంలోనే ముందున్న భారత్‌లో అయితేనే భారీ ఎత్తున టీకాలు తయారవుతాయని అగ్రదేశాలన్నీ విశ్వసిస్తున్నాయి.

చైనాలో టీకాలు జులై నుంచే కరోనా వారియర్స్‌కు ఇస్తున్నారని చెబుతున్నప్పటికీ ఇంతవరకు అధికారికంగా అయితే ప్రకటించలేదు కాని రష్యా, అమెరికా, బ్రిటన్‌ సంస్థలు రెండు దశల క్లినికల్‌ ట్రయిల్స్‌ పూర్తి చేశాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఇప్పటికే భారత ప్రభుత్వ సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌తో క్లినికల్‌ ట్రయిల్స్‌కు టీకా తయారీకి ఒప్పదం కుదుర్చుకుంది. తాజాగా రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ కోసం రెడ్డి ల్యాబ్స్‌తో ఒప్పందం చేసుకుంది. రష్యా వ్యాక్సిన్‌ను భారత్‌లో మూడో దశ క్లినికల్‌ ట్రయిల్స్‌ను రెడ్డి ల్యాబ్స్‌ నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ సంస్థ ద్వారానే దేశంలో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వం డైరెక్ట్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో రెడ్డి ల్యాబ్స్‌కు ఒప్పందం కుదిరింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి రాగానే రష్యా నుంచి పది కోట్ల డోసుల వ్యాక్సిన్‌ రెడ్డి ల్యాబ్స్‌కు సరఫరా జరుగుతుంది. మూడో దశ క్లినికల్‌ ట్రయిల్స్‌ విజయవంతం అయితే ఈ ఏడాది ఆఖరుకు మనదేశంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందనే విశ్వాసం కలుగుతోంది.

ఆక్స్‌ఫర్డ్‌ టీకా క్లినికల్‌ ట్రయిల్స్‌ దేశంలో మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ, ఆస్త్రాజెనికా ఫార్మాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా భాగస్వామిగా ఉంది. బ్రిటన్‌లో జరుగుతున్న రెండో దశ ప్రయోగాల్లో ఒక మహిళ అస్వస్థతకు గురి కావడంతో అక్కడ క్లినికల్‌ ట్రయిల్స్‌ నిలిపివేశారు. ఆ తర్వాత ఇండియాలో కూడా ప్రయోగాలు నిలిపివేయాలంటూ డ్రగ్‌ కంట్రోలర్‌ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇంగ్లాండ్‌లో అస్వస్థతకు గురైన మహిళ మెడికల్‌ రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత అక్కడి అధికారులు ప్రయోగాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతిచ్చారు. దాంతోపాటే మనదేశంలో కూడా ప్రయోగాలు మొదలయ్యాయి.

ఇంగ్లండ్‌, రష్యా సంస్థల మాదిరిగానే అమెరికా కంపెనీలు కూడా భారత్‌లోని టీకా తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి ప్రయోగాలు చేస్తున్న సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌తో అమెరికాకు చెందిన నోవా వ్యాక్స్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో టీకాలు తయారుచేసే అతిపెద్ద సంస్థ కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఒక్కటే. మూడో దశ క్లినికల్‌ ట్రయిల్స్‌తో పాటు వ్యాక్సిన్‌లోని యాంటిజెన్‌ భాగాన్ని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారుచేస్తుంది. వచ్చే నెల నుంచి ప్రయోగాలు మొదలవుతాయి. నోవా వ్యాక్స్‌ మొత్తం 200 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ డోసులను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ప్రపంచ దేశాలన్నిటికీ సరఫరా చేయాలని అమెరికన్‌ సంస్థ భావిస్తోంది.

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ సమయంలో టీకా తయారీ, క్లినికల్‌ ట్రయిల్స్‌కు సంబంధించి భారత్‌ ప్రాధాన్యం పెరిగింది. 130 కోట్ల జనాభాతో ఉన్న భారత్‌లో టీకాలు మార్కెటింగ్‌తో భారీ ఎత్తున లాభాలు వస్తాయన్న నమ్మకంతో ఇక్కడి కంపెనీలతో అగ్రదేశాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. టీకాల తయారీలో దేశీయ ఫార్మా కంపెనీల పేరు ప్రతిష్టలు కూడా ఇందుకు కలిసివస్తున్నాయి.

అగ్రదేశాల ఫార్మా కంపెనీలకు భారతదేశం ఒక బంగారు బాతులా కనిపిస్తోంది. వ్యాక్సిన్‌ కంపెనీలన్నీ భారత్‌కు క్యూ కడుతున్నాయి. ఇక్కడి నియమ నిబంధనల ప్రకారం ప్రయోగాలు చేస్తున్నాయి విజృంభిస్తున్న కరోనాకు రోజులు దగ్గరపడ్డాయా? సంవత్సరాంతానికి టీకా వచ్చేస్తుందా..?

దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య లక్షకు దగ్గరవుతోంది. మొత్తం కేసులు 53 లక్షలు దాటేశాయి. మనదేశంలో రికవరీ రేటు 78.86 శాతం ఉండగా మరణాల రేటు 1.62 శాతంగా నమోదైంది. ఈ రెండు అంకెలే కొంచెం ఊరటనిస్తున్నాయి. ఒక వైపున కేసులు పెరుగుతున్న దశలోనే దేశంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేశారు. మరోవైపు వ్యాక్సిన్‌ ప్రయోగాలు కూడా ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వసంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌తో సహా అనేక ప్రయివేటు ఫార్మా కంపెనీలు టీకా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్‌ దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు భారత్‌లోని కంపెనీలతో టీకా సరఫరా, ఉత్పత్తి, క్లినికల్‌ ట్రయిల్స్‌ కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ రెండుదశల క్లినికల్‌ ట్రయిల్స్‌ పూర్తి చేసుకుంది.

కరోనా వ్యాక్సిన్ల తయారీలో భారత్‌దే కీలక పాత్ర అంటూ మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి. అన్ని రకాల టీకాలను భారత్‌ ఎంతో పేరు పొందిందని చెప్పారాయన. ప్రపంచంలో అత్యధిక వ్యాక్సిన్లను తయారు చేసేది భారత కంపెనీలేనని తెలిపారు, ప్రస్తుత దశలో కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ సహకారం ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు బిల్‌గేట్స్‌. ఒకవైపున టీకా తయారీలో భారత్‌ ముమ్మరంగా పాలుపంచుకుంటుండగా టీకాలు రెడీ కాగానే ప్రపంచ దేశాలకు సరఫరా చేయడానికి కూడా అంతే ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

సంపన్న దేశాలు టీకాలను సొంత నిధులతో సమకూర్చుకుంటున్నాయి. పేద దేశాలకు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే యునిసెఫ్‌ ఆధ్వర్యంలో టీకాల పంపిణీ జరుగుతుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కాపాడే 200 కోట్ల టీకాలను యునిసెఫ్‌ పేద దేశాల పిల్లలకు పంపిణీ చేస్తోంది. పేద దేశాల్లో టీకాల పంపిణీకి ఈ నెల 18న సంపన్న దేశాలు యునిసెఫ్‌తో ఒప్పందం చేసుకోబోతున్నాయి. క్లినికల్‌ ట్రయిల్స్‌ పూర్తి చేసి వందల కోట్ల డోసుల టీకాలను ఉత్పత్తి చేయడం ఒక పెను సవాల్‌..కాగా ఈ టీకాలను ప్రపంచమంతా రవాణా చేసి ప్రజలకు అందించడం మరో బృహత్తర కార్యక్రమం. బహుశా టీకాల పంపిణీ 21 శతాబ్దపు అద్బుతంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.

టీకా ఎప్పుడొస్తుందా ప్రపంచమంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు రష్యా ఒక్కటే టీకాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తొలి టీకాను తన కుమార్తెకే ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. రెండు దశల ప్రయోగాలు మాత్రమే పూర్తయిన టీకాను ప్రజలకు విడుదల చేయడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ, పలుదేశాల శాస్త్రవేత్తలు అసంత్రుప్తి వెలిబుచ్చారు. అయినప్పటికీ రష్యా వెనకడుగు వేయలేదు. అంతేగాకుండా మూడో దశ ప్రయోగాల కోసం, టీకాల సరఫరా కోసం మనదేశంలోని రెడ్డి ల్యాబ్స్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. రష్యా టీకాను విశ్వసించవచ్చని భారత్‌ భావిస్తోంది. రష్యన్‌ ప్రభత్వం ఆధ్వర్యంలోని కంపెనీయే వ్యాక్సిన్‌ను అభివ్రుద్ధి చేసింది. ప్రభుత్వానికి చెందిన డైరెక్ట్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ సంస్థే రెడ్డీ ల్యాబ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తమ టీకా అత్యంత సురక్షితమైనదని రష్యా చెబుతోంది. దీంతో భారత ప్రభుత్వం కూడా నేరుగా రష్యా ప్రభుత్వంతో దీనిపై చర్చలు జరపబోతోంది.

ప్రపంచంలో అందరికంటే ముందుగా రష్యా టీకా వచ్చేస్తోందని అమెరికా కంపెనీలకు కంగారు మొదలైంది. అదే సమయంలో నవంబర్‌ మూడున జరిగే అధ్యక్ష ఎన్నికలలోగా టీకా తయారు కావాలని అధ్యక్షుడు ట్రంప్‌ గట్టిగా కోరుకుంటున్నారు. టీకాతో అయినా ఎన్నికల్లో గట్టెక్కవచ్చని ఆయన భావిస్తున్నారు. ప్రచారంలో ప్రతి చోటా టీకా గురించే అగుడుతుండటంతో ట్రంప్‌ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరులందరికీ ప్రభుత్వమే టీకాను ఉచితంగా వేస్తుందని ప్రకటించారాయన. ఒకవేళ ఎన్నికల నాటికి వ్యాక్సిన్‌ రాకపోయినా ఉచితంతో అయినా ప్రజలు మళ్ళీ ఓటేస్తారని ఆయన ఆశిస్తున్నారు. జనవరి నాటికి దేశ ప్రజలందరికి ఉచితంగా టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ అమెరికా హెల్త్ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌, రక్షణ శాఖలు సంయుక్తంగా డాక్యుమెంట్లను విడుదల చేశాయి. మొత్తానికి టీకా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కరోనా అంతం ఎప్పుడవుతుందా అని మానవాళి ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో రష్యా టీకా..భారత ఫార్మా కంపెనీలు ప్రపంచానికి ఆశాదీపాలుగా కనిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories