Indian Railways: కరోనా తో రైల్వే సంస్థకు భారీ నష్టం

Indian Railways Suffers Loss Worth Rs 38,017 Crore
x

Indian Railways(ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

Indian Railways: ప్రయాణికుల విభాగంలో రూ.38వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్టు భారతీయ రైల్వే వెల్లడించింది.

Indian Railways: ప్రపంచాన్నే ఒక కుదుపు కుదుపుతున్న కరోనా ప్రజల ప్రాణాలతోనే కాదు వ్యవస్థలన్నిటినీ ఆర్థికంగా నష్టాల బాట పట్టించింది. అలాంటి వాటిలో భారతీయ రైల్వే కూడా ఒకటి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల విభాగంలో రూ.38వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్టు భారతీయ రైల్వే వెల్లడించింది. కానీ, శ్రామిక్‌ రైళ్లు, సరుకు రవాణాతో వచ్చిన లాభాలతో ఆ నష్టాన్ని కొంతమేర పూడ్చుకున్నట్టు పేర్కొంది. దేశంలో లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రయాణికుల రైళ్లు పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. కొంతమేరకు మాత్రమే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

సరుకు రవాణాలో...

ఈ సమయంలో ప్రయాణికుల రైళ్ల నుంచి వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. అదే సమయంలో సరుకు రవాణాలో మాత్రం లాభాలతో దూసుకెళ్లింది. మార్చి 22 నాటికి రూ.1868 కోట్లను పొందగా, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది రెండు శాతం అధికమని రైల్వే పేర్కొంది. ఇక ప్రయాణికుల రైళ్లతో గతేడాది రూ.53,525కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం కేవలం రూ.15,507కోట్లు మాత్రమే పొందినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. అనగా దాదాపు 71.03శాతం ఆదాయం కోల్పోయినట్లయింది. దేశవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగిన వేళ, మే 1వ తేదీ నుంచి వలస కార్మికులను తరలించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు నడిపింది. ఇలా మే 1 నుంచి ఆగస్టు 30వరకు దాదాపు 63లక్షల మంది కార్మికులను తరలించినట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఇలా 23రాష్ట్రాల్లో 4000 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను నడిపినట్టు తెలిపింది. అదే సమయంలో సరుకు రవాణాలో నూతన పంథాను అవలంభించి ప్రత్యేక పార్శిల్‌ సర్వీసులను ప్రారంభించామని వెల్లడించింది.

సరుకు రవాణా...

పార్శిల్‌ సర్వీసులతో పాటు ఔషధాలు, పాలు, వెంటిలేటర్ల వంటి సరుకు రవాణా చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8634 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వేశాఖ వెల్లడించింది. వీటిలో 2402 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కాగా 5381 సబర్బన్‌, 851 పాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. కొవిడ్‌ కంటే ముందు దేశంలో నిత్యం 11వేల రైళ్లు నడుస్తుండగా ప్రస్తుతం 7377 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories