Lockdown: ఇకనైనా మేల్కోండి.. లాక్‌డౌన్‌ పెట్టండి- ఐఎంఏ

Indian Medical Association Demands Nationwide Lockdown
x

Lockdown: ఇకనైనా మేల్కోండి.. లాక్‌డౌన్‌ పెట్టండి- ఐఎంఏ

Highlights

Lockdown: దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలనే డిమాండ్‌ ఎక్కువవుతోంది.

Lockdown: దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలనే డిమాండ్‌ ఎక్కువవుతోంది. కోవిడ్ క‌ట్టడికి ఒక ప‌క్కా ప్రణాళిక‌ను అమ‌లు చేయాల‌ని ప్రతిపక్షాలు, వైద్య నిపుణలు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లినా కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు సిద్దంగా లేదు. లాక్‌డౌన్‌పై కేంద్రం ససేమీరా అంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీరును తప్పుబడుతూ ఐఎంఏ ఘాటుగా స్పందించింది.

దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఘాటుగా స్పందించింది. కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపింది. రాత్రిపూట కర్ఫ్యూల వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ అస్తవ్యస్తంగా ఉందని, 18 ఏళ్లకు పైబడినవారికి ఎక్కడైనా వ్యాక్సిన్ అందుతోందా? అని నిలదీసింది. తమ అసోసియేషన్‌ నుంచి కేంద్రానికి ఇచ్చిన సలహాలు, సూచనలు పలుమార్లు బుట్టదాఖలు అయ్యాయని ఆవేదన వ్యక్తంచేసింది.

కరోనా కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పెట్టాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడంతో పాటు కొవిడ్‌ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న మెడికల్‌ సిబ్బందికి కొంతమేర స్వస్థత చేకూరుతుందని అభిప్రాయపడింది. కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికైనా మేల్కోవాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు ఘాటు లేఖ రాసింది. రాష్ట్రాలు అమలు చేస్తున్న 10-15 రోజుల లాక్‌డౌన్‌ కాకుండా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అవసరమని వెల్లడించింది. ఆర్థికం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని అభిప్రాయపడింది.

ఇప్పటికే భారత్​లో కరోనా విజృంభణపై ఆందోళన వ్యక్తం చేస్తూ పరిస్థితిని అదుపు చేయడం కోసం దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను విధించే అవకాశాన్ని పరిశీలించాలని అమెరికా వైద్య నిపుణుడు, వైట్‌హౌజ్ చీఫ్ మెడిక‌ల్ అడ్వైజ‌ర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సూచించారు. దానితో పాటు భారీస్థాయిలో వ్యాక్సినేషన్​ చేపట్టాలని, కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు నిర్మించాలని వెల్లడించారు. సెకండ్ వేవ్ ప్రభావం పెరుగుతుండ‌డంతో ప్రధాని మోడీకి అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే లాక్‌డౌన్‌పై కేంద్రం ససేమీరా అంటుంది. ప్రజల ప్రాణాల కంటే ఆర్ధిక ప్రయోజనాలే ముఖ్యమని అభిప్రాయపడుతోంది. అయితే కేంద్రం వడివడిగా నిర్ణయాలు తీసుకొని కరోనా నరమేధాన్ని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories