12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్ వచ్చేసిందా?
World’s Biggest Gold Coin: 12 కేజీల బరువు, వందల ఏళ్ల చరిత్ర, అన్నింటికీమించి 40 ఏళ్ల అంతుచిక్కని మిస్సింగ్ మిస్టరీ.
World's Biggest Gold Coin: 12 కేజీల బరువు, వందల ఏళ్ల చరిత్ర, అన్నింటికీమించి 40 ఏళ్ల అంతుచిక్కని మిస్సింగ్ మిస్టరీ. అలాంటి వరల్డ్ బిగ్గెస్ట్ గోల్డ్ కాయిన్ కోసం భారత్ మళ్లీ అన్వేషణ మొదలు పెట్టింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న మన వారసత్వ సంపదను మళ్లీ మాతృభూమికి రప్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకూ, నిజాంల బిగ్గెస్ట్ గోల్డ్ కాయిన్ ఎక్కడుంది..? ఈ చారిత్రాత్మక నాణెం కోసం సీబీఐ ఎలాంటి అన్వేషణ చేయబోతోంది..? కోహినూర్ సహా చారిత్రక సంపద దేశం దాటి ఎలా వెళ్లిపోయింది..? వారసత్వ సంపదను తిరిగి రప్పించడంలో మోడీ సర్కార్ ట్రాక్ రికార్డ్ ఏం చెబుతోంది..?
ఓ గోల్డ్ కాయిన్ మహా అయితే ఎంత బరువుంటుంది..? మ్యాగ్జిమమ్ గ్రాముల్లోనే. కాకపోతే ఈ గోల్డ్ కాయిన్ మాత్రం అలాంటిది కాదు. కిలోల కొద్దీ వెయిట్, అంతకుమించిన చరిత్ర, ఇంకాస్త ఉత్కంఠ రేపే మిస్టరీతో గ్లోబల్ అటెన్షన్‌కు వేదికయింది. భారత వారసత్వ సంపదల్లో కోహినూర్ తర్వాతి స్థానం ఈ గోల్డ్ కాయిన్‌కు ఇవ్వచ్చనే చర్చ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. ఇందుకు కారణం వందల ఏళ్ల హిస్టరీతో పాటు, అక్షరాలా 12 కేజీల బరువుతో అద్భుతానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండడమే. అయితే, సరిగ్గా 40 ఏళ్ల క్రితం వరల్డ్ మోస్ట్ బిగ్గెస్ట్ గోల్డ్ కాయిన్ కనిపించకుండా పోయింది. దీంతో ఆరోజు నుంచీ ఈ హిస్టారికల్ కాయిన్ మిస్సింగ్ సీక్రెట్స్‌పై చర్చ జరుగుతూనే ఉంది. ఈ చారిత్రాత్మక నాణెన్ని దేశం దాటించేశారా..? లేక ఇండియాలోనే ఉందా..? ఉంటే ఆ నాణెం ఎవరి దగ్గరుంది..? ఒకవేళ దేశం దాటి వెళ్లిపోతే కోహినూర్‌లా మిగిలిపోతుందా..? తాజాగా సీబీఐ ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతికేందుకు సిద్ధమైంది.
బిగ్గెస్ట్ గోల్డ్ కాయిన్ అన్వేషణలో సీబీఐ సక్సెస్ అవుతుందో లేదో అన్నది పక్కన పెడితే.. దీని వెనుక చరిత్ర మాత్రం చాలా ఆసక్తికరమైంది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ 17వ శతాబ్దంలో రెండు భారీ గోల్డ్ కాయిన్స్ చేయించారు. అందులో ఒక కాయిన్ ఇరాన్ రాజు అంబాసిడర్ యాద్గర్ అలీకి కానుకగా ఇవ్వగా మరొకటి నిజాం నవాబులకు ఇచ్చారు. ఈ కాయిన్ బరువు 11 కేజీల 935.8 గ్రాములు ఉండేది. ఆ తర్వాత ఈ బంగారు నాణేన్ని చివరి నిజాం నవాబ్ మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన మనుమడైన ముఖర్రం ఝాకు ఇచ్చారు. కాలక్రమంలో డబ్బు అవసరాల కోసం ముఖర్రం 1987లో స్విస్ బ్యాంకులో భారీ గోల్డ్ కాయిన్‌ను వేలం వేయడానికి ప్రయత్నించారు. 1987 నవంబర్ 9న పారీస్ కేంద్రంగా నడిచే ఇండోస్విస్ బ్యాంక్, జెనీవా బ్రాంచ్‌లో అప్పట్లోనే 9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు.
మరోవైపు గోల్డ్ కాయిన్‌తో పాటు మరో బంగారు నాణేన్ని కూడా బ్యాంకుకు ఇచ్చారు. ఈ క్రమంలో బ్యాంకు ఈ రెండు కాయిన్స్‌ను వేలం వేయడానికి సమయాన్ని నిర్ణయించింది. కాగా, విలువ కట్టలేని ఈ కాయిన్ జాతీయ సంపద కావడంతో ఉప్పందుకున్న అప్పటి సీబీఐ అప్పటికప్పుడు పారీస్ వెళ్లి కాయిన్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంది. కానీ వారికి అక్కడ ఆ కాయిన్ దొరకలేదు. అనంతర కాలంలో మౌలానా ఆజాద్ హిందూ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ హిస్టోరియన్ ప్రొఫెసర్ సల్మా అహ్మద్ ఈ భారీ కాయిన్ గురించి అనేక పరిశోధనలు చేశారు. దాని చరిత్ర, వారసత్వంపై లోతుగా ఇన్వెస్టిగేట్ చేశారు. జెనీవాలోని హోటల్ మొగలో ఆక్షనీర్ హబ్స్‌బరో ఫెల్డ్‌మాన్ ఈ గోల్డ్ కాయిన్‌ను బ్యాంకు తరపున వేలం వేయడానికి ప్రయత్నించినట్లు ఆమె కనుగొన్నారు. అయితే సీబీఐ వస్తుందని తెలుసుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ఆమె చెప్తున్నారు.
ఆ తర్వాత సీబీఐ అధికారులే చరిత్రకారుల అవతారం ఎత్తారు. విలువ కట్టలేని ఆ అరుదైన నాణెం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ శాంతను సేస్ తాను రాసిన పుస్తకంలో చక్రవర్తి జహంగీర్ తయారు చేసిన రెండు భారీ బంగారు నాణేల గురించి ప్రస్తావించారు. అది ఎలా నిజాం నవాబుల దగ్గరకు చేరి ఆ తర్వాత కాలంలో ఎలా మాయమైపోయిందో రాసుకొచ్చారు. సీబీఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలోని సూపరింటెండెంట్ ర్యాంకు అధికారి 1987లోనే నాణాన్ని వేలం వేయడానికి ప్రయత్నించిన ఘటనపై యాంటీక్ అండ్ ఆర్ట్ ట్రెజరర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. స్విస్ బ్యాంకు వేలానికి ముఖర్రం స్వయంగా ఆ కాయిన్స్ ఇచ్చినట్లు కనుగొన్నారు. అప్పట్లోనే ఆ కాయిన్ విలువ 16 మిలియన్ డాలర్లుగా తేల్చారు. వేలాన్నయితే ఆపగలిగారు కానీ, కాయిన్‌ని మాత్రం కనుగొనలేకపోయారు. అప్పట్లో సీబీఐలో పని చేసిన అధికారులందరూ రిటైర్ అయిపోయారు. కాగా, 40 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ ఆ కాయిన్ గుర్తొచ్చింది. అది ఎక్కడ ఉందో కనుగొనాలని సీబీఐకి ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పుడు సీబీఐ మరోసారి ఆ కాయిన్‌ను అన్వేషించే పనిలో పడింది.
సీబీఐ ఇన్నేళ్ల అణ్వేషణలో నిజాం గోల్డ్ కాయిన్ విదేశాల్లోనేది తేలిపోయింది. అయితే, ఎక్కడ ఉంది అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. దీంతో మన కోహినూర్ డైమండ్ మాదిరిగానే ఈ చారిత్రక సంపద కూడా భారత్ వచ్చే అవకాశం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి కోహినూర్ డైమండ్ భారత వారసత్వ సంపదే అని యావత్ ప్రపంచానికీ తెలిసినా బ్రిటన్ నుంచి రప్పించడంలో భారత్ ప్రభుత్వ ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఫలించలేదు. స్వాతంత్ర్యానికి ముందే బ్రిటిష్ పాలకులు ఇండియా నుంచి కోహినూర్‌ను తరలించుకుపోయారు. కాలక్రమంలో బ్రిటన్ రాణి విక్టోరియా కిరీటంలో పొదిగించుకున్నారు. ఆ తర్వాత బ్రిటన్ రాజకుటుంబంలో పెద్ద కోడలికి కానుకగా ఇస్తూ వచ్చారు. 1947లో ఒకసారి, 1953లో మరోసారి కోహినూర్‌ను తిరిగిచ్చేయాల్సిందిగా భారత్ కోరినా బ్రిటన్ స్పందించలేదు. ఆపై 2000 సంవత్సరంలో పలువురు ఎంపీలు ఈ అద్భుత వజ్రం కోసం క్లెయిమ్ చేశారు. ఆ సమయంలోనూ బ్రిటన్ అధికారులు దీన్ని తిరిగిచ్చేది లేదన్నారు. అవిభాజ్య భారతావని నుంచి తరలివెళ్లిన కోహినూర్ ఒకవేళ తిరిగి భారత్ చేరితే, దీనిలో భాగం ఇవ్వాలని పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల నుంచి డిమాండ్‌లు సైతం వచ్చాయి.
ప్రస్తుతం కోహినూర్ డైమండ్ బ్రిటన్ మ్యూజియంలో వేలాది అపురూప కళాఖండాలు, విలువైన వజ్రాల మధ్య ఇప్పటికీ చూపరులను ఆకర్షిస్తోంది. తాము వివిధ దేశాల నుంచి తెచ్చిన విలువైన వస్తువులను తిరిగి ఆ దేశాలకే ఇచ్చేస్తే, తమ మ్యూజియంలో ఒక్క వస్తువు కూడా ఉండదన్నది బ్రిటన్ ప్రభుత్వం వాదన. దాదాపు ఏడు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కోహినూర్ వజ్రం విషయంలో భారత్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బ్రిటన్ తదితర దేశాలు తామే యజమానులుగా చెప్పుకుంటున్నాయి. కోహినూర్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటి లెక్కకుమించిన భారత వారసత్వ సంపదలు వజ్ర వైఢూర్యాలు, విలువైన లోహ విగ్రహాలు, శిల్పాలు ఎన్నో స్మగ్లర్ల చేతిలోపడి దేశం దాటి వెళ్లిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ సర్కార్ వీటన్నింటినీ తిరిగి మాతృభూమికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
నిజానికి 2014లో మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత వారసత్వ సంపదను తిరిగి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకూ 41 వారసత్వ కళాఖండాలను దేశానికి తీసుకొచ్చినట్టు ఇటీవలే ప్రకటించింది. దేశం నుంచి విదేశాలకు దోచుకెళ్లిన విలువైన సంపదలో 75శాతం తమ హయాంలోనే తిరిగి తీసుకొచ్చామని బీజేపీ చెబుతోంది. కాంగ్రెస్ 25ఏళ్ల పాలనలో 10కంటే తక్కువే విలువైన వస్తువులు తెప్పించిందన్నది బీజేపీ వాదన. తాజాగా నిజాం బిగ్గెస్ట్ గోల్డ్ కాయిన్ సైతం వెనక్కి తీసుకురావాలని నిర్ణయించుకుంది. దీంతో మరోసారి సీబీఐ రంగంలోకి దిగి అన్వేషణ ప్రారంభించింది. అయితే, ఇందులో సీబీఐ విజయం సాధిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే 1987 తర్వాత ఈ గోల్డ్ కాయిన్ గురించి చర్చే తప్ప ఎక్కడ ఉందనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. వేలం జరిగే సమయంలో సీబీఐ ఎంట్రీ ఇవ్వడంతో గోల్డ్ కాయిన్ అంశాన్ని తెరమరుగు చేసేశారు. మరోసారి ఎక్కడుందో తెలియని గోల్డ్ కాయిన్‌ను కదిపితే తప్ప దాని ఉనికి తెలిసే అవకాశమే లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా.. సీబీఐ నజర్‌తో మరోసారి నిజాం గోల్డ్ కాయిన్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఒక్కమాటలో మన చారిత్రక సంపదను తిరిగి తేవడంలో సీబీఐ సక్సెస్ అవుతుందేమో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire