దేశంలో విద్యుత్ సంక్షోభం.. నాలుగు రోజుల తర్వాత పరిస్తితి ఏంటి..?

India to Face Power outages Owing to Coal Shortage Crisis
x

దేశంలో విద్యుత్ సంక్షోభం.. నాలుగు రోజుల తర్వాత పరిస్తితి ఏంటి..?

Highlights

Coal Shortage: భారత్‌లో విద్యుత్ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

Coal Shortage: భారత్‌లో విద్యుత్ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. బొగ్గు కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రాజుకుంటుంది. బొగ్గు కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే అదేం లేదంటూ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటులో 70శాతం బొగ్గు ఆధారితమే. దేశవ్యాప్తంగా 135 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఉండగా వాటిలో సగానికి పైగా ప్లాంట్లలో బొగ్గు నిల్వలు దాదాపు అడుగంటి పోయాయి. అక్టోబర్ లోనూ వర్షాలు దంచికొడుతుండటంతో బొగ్గు ఉత్పత్తికి అదనపు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ దశలో రాష్ట్రాల పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా తయారైంది.

బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో కొరత తీవ్రమవుతోంది. అయితే కేంద్రం మాత్రం దేశంలో బొగ్గు కొరత లేదని చెబుతోంది. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు చెబుతోంది. తాజాగా యూపీలో 14 ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు, పంజాబ్‌లో మూడు, కేరళలో నాలుగు, మహారాష్ట్రలో 13 ధర్మల్ పవర్ ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో కర్నాటక, పంజాబ్ ముఖ్యమంత్రులు బొగ్గు సరఫరా పెంచాలని తాజాగా కేంద్రాన్ని అభ్యర్దించారు.

దేశంలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయని పైకి చెబుతున్నా వాటిని సరఫరా చేసే విషయంలో తలెత్తిన ఇబ్బందులతో విద్యుత్ ప్లాంట్లు మూతపడుతున్నాయి. దీంతో కేంద్రం మాటలకూ, చేతలకూ పొంతన లేకుండా పోతోంది. బొగ్గు నిల్వల తాజా పరిస్ధితిపై కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. పలు రాష్ట్రాలో రెండు రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని వార్తలు వస్తున్న నేపథ్యంలో సరఫరా పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విభాగాలతో పాటు పలు రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కేంద్రం చర్యలతో ఇవాళ, రేపట్లో పరిస్ధితి కాస్త మెరుగుపడ వచ్చని తెలుస్తోంది. అయినా ఇప్పటికే మూతపడిన విద్యుత్ ప్లాంట్లను తెరిపించడం కూడా కష్టమేనని తెలుస్తోంది. దీంతో మరిన్ని ప్లాంట్లు మూతపడకుండా కేంద్రం తాజా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.

గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాలు బ్లాకవుట్ ఆందోళనలు లేవనెత్తాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలకు బొగ్గు సరఫరా జరిగేలా చూడాలని కోరారు. ఈ బొగ్గు కొరత కారణంగా బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రోజుకు 14 గంటలపాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. అటు పంజాబ్‌‌లోని బొగ్గు నిల్వలు కొన్ని రోజుల్లో అయిపోతాయని ముఖ్యమంత్రి చన్నీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని సమీక్షించింన చన్నీ థర్మల్ ప్లాంట్లలో తగినంత బొగ్గు లేని కారణంగా పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు.

బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖాస్త్రాన్ని సంధించారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి విద్యుత్ సంక్షోభంపై జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు. మరోవైపు విద్యుత్, బొగ్గు కొరతపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని, బొగ్గు కొరత కూడా ఏర్పడిందని చెప్పారు. విద్యుత్ కొనుగోలు రేట్లు కూడా పెరిగాయని, కొనుగోలు చేయడానికి బొగ్గే దొరకడం లేదని అన్నారు.

మరోవైపు బొగ్గు కొరతపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పందించారు. దేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడడంతో విద్యుత్‌ సంక్షోభం ఎదుర్కోబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. విద్యుత్‌ సంక్షోభంపై అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని స్పష్టం చేశారు. కేవలం గెయిల్, డిస్కం సంస్థల మధ్య సమాచార లోపం వల్లే ఇలాంటివి ఏర్పడినట్లు తెలిపారు. విపక్షాలే వదంతులు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

విద్యుత్ సంక్షోభానికి బొగ్గు కొరత కాదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఎకానమీ పునరుద్ధరణతో పెరిగిన ఎలక్ట్రిసిటీ డిమాండ్, బొగ్గు గనుల ప్రాంతాల్లో భారీ వర్షాలు, బొగ్గు దిగుమతి ధరలు పెరగడంతోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బొగ్గు కంపెనీలు భారీ రుణాల్లో ఉండటం వంటి కారణాల వల్లే పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం 20 వరకు థర్మల్ పవర్ ప్లాంట్ల మూతపడటంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories