ఒక్క మహా కుంభమేళాతో యూపీ సర్కార్‌కు అన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుందా?

ఒక్క మహా కుంభమేళాతో యూపీ సర్కార్‌కు అన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుందా?
x
Highlights

UP govt earnings from Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా నిర్వహణ కోసం యూపీ సర్కారు రూ, 7 వేల కోట్లు వెచ్చిస్తోంది. అయితే, పెట్టిన ఖర్చు కంటే భారీగా యూపీ సర్కారు ఖజానాకు ఆదాయం రానుందని తెలుస్తోంది.

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 40-45 కోట్లకు పైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఇది అమెరికా, కెనడా జనాభా కంటే ఎక్కువ.

ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్‌లో ఇవాళ తొలి పుణ్య స్నానాలతో ప్రారంభమైంది. తొలి రోజు జరిగే పుణ్య స్నానాల్లో సుమారు 50 లక్షల మంది భక్తులు పాల్గొంటారని యూపీ సర్కారు అంచనాలు చెబుతున్నాయి. గంగ, యుమన, సరస్వతి నదులు కలిసే ప్రయాగ్ రాజ్‌నే మహా కుంభమేళాకు వేదికగా ఎంచుకోవడం మొదటి నుండి ఒక ఆనవాయితీగా వస్తోంది.

మహా కుంభమేళా నిర్వహణ కోసం యూపీ సర్కారు రూ, 7 వేల కోట్లు వెచ్చిస్తోంది. అయితే, పెట్టిన ఖర్చు కంటే భారీగా యూపీ సర్కారు ఖజానాకు ఆదాయం రానుందని తెలుస్తోంది. మహా కుంభమేళా పూర్తయ్యేనాటికి యూపీ సర్కారు ఖజానాకు 2 లక్షల కోట్లు వస్తాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది వినగానే ఏ రకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలేస్తున్నారనే సందేహం రావచ్చు. అయితే, అందుకు కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వద్ద ఓ లెక్క సిద్ధంగా ఉంది.

మహా కుంభమేళాకు కనీసం 40 కోట్ల మంది వస్తారనేది ఒక ప్రాథమిక అంచనాగా ఉంది. అలా వచ్చిన భక్తులు ఒక్కొక్కరు కనీసం రూ. 5,000 చొప్పున ఖర్చు చేసినా, రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం ఎటూ పోదని వారు అంచనా వేస్తున్నారు. 2019 లో అర్ధ కుంభమేళా జరిగింది. అర్ధకుంభమేళా అంటే ఆరేళ్లకొకసారి జరిగే కుంభమేళా. ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి 24 కోట్ల మంది భక్తులు వచ్చారు. దాంతో యూపీ సర్కారు ఖజానాకు 1.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆ లెక్క ప్రకారం చూస్తే, ఈసారి యూపీ ఖజానాకు 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే, ప్రముఖ వార్తా సంస్థ ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ వెల్లడించిన ఒక కథనం ప్రకారం మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి ఎంత లేదన్నా రూ. 10 వేలు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఆ లెక్క ప్రకారం చూస్తే మొత్తం ఆదాయం 4 లక్షల కోట్లకు చేరుతుందని అక్కడి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ప్రపంచం నలుమూలల ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులు ఖర్చుపెట్టిన ప్రతీ రూపాయి యూపీ సర్కారు ఖజానాకే ఎందుకు వెళ్తుందనే డౌట్ కూడా వస్తోంది.

ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న ఈ 45 రోజులలో ఎప్పుడు, ఏ రకంగా చూసినా కనీసం 50 లక్షల నుండి కోటి మంది భక్తులకు వసతి సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదత్యనాథ్ తెలిపారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తులు కొనుగోలు చేసే ప్యాకేజ్డ్ ఫుడ్, వాటర్, జ్యూస్, బిస్కిట్స్, మీల్స్ అన్నీ కలిపి సుమారు రూ. 20,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆల్ ఇండియా ట్రేడర్స్ కన్ఫెడరేషన్ అంచనా వేస్తోంది. అంతేకాదు... దీపాలు, దీపాల నూనే, అగర్‌బత్తీలు లాంటి పూజా సామాగ్రికి కూడా మరో రూ. 20,000 కోట్లు మార్కెట్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. అంటే మహా కుంభమేళా ప్రభుత్వానికే కాదు... అక్కడ వ్యాపారం చేసుకునే వారికి కూడా పంట పండిస్తుందన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories