శశికళ రీ ఎంట్రీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది..? అన్నాడీఎంకే పాలకులలో వణుకు మొదలైందా?
*ఒకటి కాదు రెండు నాలుగేళ్ల కారాగారవాసం *ఎన్నో అనుమానాలు... ఇంకెన్నో విమర్శలు *శశికళ రీ ఎంట్రీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దివంగత జయలలిత ఆప్తురాలు శశికళ విడుదలతో రంజుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో శశికళ తీసుకోబోయే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ ముఖ్య పాత్ర పోషిస్తారని, ఎన్నికల్లో పోటీ చేస్తారంటున్న చిన్నమ్మకు చిక్కులు కూడా తప్పవేమోనన్న అనుమానాలు ఉన్నాయి. శశికళ ఎంట్రీపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు పెట్టొచ్చన్న ఊహాగానాల మధ్య రాజకీయాలు మరోసారి ఆధిపత్య పోరు వైపు పయనించనున్నాయి. ఇంతకీ చిన్నమ్మ రీ ఎంట్రీ ప్రభావం తమిళనాట ఎలా ఉండబోతోంది? జయ సమాధిని మూసివేసేందుకు ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది?
ఒకటి కాదు రెండు కాదు నాలుగేళ్ల కారాగారవాసం..ఎన్నో అనుమానాలు... ఇంకెన్నో విమర్శలు శశికళ రీ ఎంట్రీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?..సమాధి సాక్షిగా చేసిన శపథం నెరవేర్చుకుంటుందా? తమిళ గడ్డపై మారుతున్న రాజకీయాలు ఏం చెబుతున్నాయి? రెండాకుల రాజకీయం ఏ మలుపు తీసుకోబోతోంది?
అప్పుడెప్పుడో జయలలిత సమాధి వద్ద నేలపై పిడిగుద్దులు గుద్దింది చిన్నమ్మ. బాబోయ్ ఇంకేం లేదు తమిళనాడు మళ్లీ తన గుప్పిట తెచ్చుకుంటుంది అన్నాడీఎంకేకు అధినేత్రికి అవతరిస్తుంది రాజకీయాలను తాను శాసిస్తుందని అనుకున్నారంతా. కానీ అప్పుడు శశి బిగించిన పిడికిలి విడిచిపెటింది. సీను రివర్సయింది. విధి వక్రించింది. అంతే శశికళ రాజకీయానికి అప్పట్లో తెర పడింది. తరువాత ఆర్థిక నేరాల అభియోగంపై జైలు పాలైంది.
తాజాగా శశికళ రీఎంట్రీకి సంబంధించి యాక్షన్ ప్లాన్ బెంగళూరులోని ఓ ఫాం హౌస్ వేదికగా సిద్ధమైంది. టీటీవీ దినకరన్ చిన్నమ్మతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. క్వారెంటైన్ కూడా ముగియడంతో ఈనెల 7వ తేదీన తమిళనాట అడుగుపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె అనుయాయుల్లో ఉత్సాహం, అన్నాడీఎంకేలో ఉత్కంఠ మొదలైంది. ఆమె చెన్నైకి చేరింది మొదలు అన్నాడీఎంకేలో రోజుకో నాటకం మొదలవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అటు- శశికళ చెన్నై రానున్న సందర్భంగా రాష్ట్ర సరిహద్దు నుంచి చెన్నై వరకు పూలవర్షంతో నేతలు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేపట్టారు. శశికళ చెన్నైలోకి అడుగుపెట్టగానే నేరుగా మెరీనాతీరానికి వెళ్లి జయ సమాధి వద్ద అంజలి ఘటించాలనుకున్నారు. ఆ మేరకు దినకరన్ బృందం ఏర్పాట్లు కూడా చేపట్టింది. కానీ ఇక్కడే ప్రభుత్వం ఒక ట్విస్టు పెట్టింది? ఏంటది?
మెరీనాలోని జయ స్మారకమందిరాన్ని 15 రోజుల పాటు మూతవేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత నెల 27న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన జయ సమాధిని సందర్శకుల దర్శనం కోసం అనుమతిస్తున్నారు. ఆ మేరకు రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు వస్తున్నారు. కానీ శశికళ చెన్నైకి వస్తున్నట్టు తెలియగానే జయ సమాధికి మరమ్మతుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు మూసివేయడం విస్మయానికి గురిచేస్తోంది.
నిజానికి గత నెల 27వ తేదీనే శశికళ చెన్నై రావాలి. అదేరోజు సీఎం జయ సమాధిని ప్రారంభిస్తున్నందున ఆ రోజు శశికళకు అనుమతి వుంటుందా లేదా అన్నది అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ ఆమె కరోనా బారిన పడడంతో ఈ చర్చలకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది. అయితే శశికళ రాక నేపథ్యంలో జయ సమాధి సందర్శన నిలిపేస్తున్నట్టు ప్రకటన వెలువడడంతో అన్నాడీఎంకే నేతలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్టుగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. శశికళ శపథాన్ని అడ్డుకునేందుకే అన్నాడీఎంకే ప్రభుత్వం జయ సమాధి ప్రాంతాన్ని 15 రోజులపాటు మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్న ప్రచారం నడుస్తోంది. అక్రమార్జన కేసులో జైలు శిక్ష అనుభవించి చెన్నైకి తిరిగివస్తున్న చిన్నమ్మ జయ సమాధి వద్ద మరోమారు శపథం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలియగానే అన్నాడీఎంకే పాలకులలో వణకు మొదలైందన్న టాక్ నడుస్తోంది.
అయితే జయ సమాధి మూసివేతపై చిన్నమ్మ అనుచరులు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జయ సమాధిని ఇప్పుడు మూసివేసినా ఎల్లకాలం మూసివేయలేరుగా, అప్పుడైనా శశికళ అక్కడికెళ్లి అంజలి ఘటిస్తారుగా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మూసివేసిన జయ స్మారకమందిరాన్ని ఎప్పుడైనా తెరవాల్సిందేనని, అప్పుడే తాము జయకు నివాళులర్పిస్తామని చెబుతున్నారు. అయితే శశికళ రాకకు, జయ సమాధి మూసివేతకు ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు మంత్రి ఓఎస్ మణియన్ అన్నారు. నిజంగా జయ స్మారకమందిరం వద్ద పనులు జరుగుతున్నందునే సందర్శకులను అనుమతించడం లేదన్నారు. అన్నాడీఎంకే, ఎఎంఎంకే కలయికపై తమ పార్టీ అధిష్ఠానం చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఏమైనా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు శశికళ జైలు నుంచి విడుదలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చిన్నమ్మకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె వర్గీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక అన్నాడీఎంకేలో తిరిగి చేర్చుకోబోమని తమిళనాడు సీఎం పళనిస్వామి చెప్పడం ఎన్నికలు దగ్గర్లో ఉన్న వేళ.. మరి ఆమె మౌనంగా ఉంటారా..? లేదంటే కొత్త పార్టీని తెర మీదకు తెస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire