Tamil Nadu Train Accident : ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలుని ఎలా ఢీకొట్టింది? 75 కిమీ వేగంతో లూప్ లైన్‌లోకి ఎందుకెళ్లింది?

Tamil Nadu Train Accident : ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలుని ఎలా ఢీకొట్టింది? 75 కిమీ వేగంతో లూప్ లైన్‌లోకి ఎందుకెళ్లింది?
x
Highlights

Tamil Nadu Train Accident: మైసూర్-దర్భంగ బాగమతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటన రైల్వే అధికారులకు ఒకరకంగా మిస్టరీగా మారింది. చెన్నై నుండి...

Tamil Nadu Train Accident: మైసూర్-దర్భంగ బాగమతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటన రైల్వే అధికారులకు ఒకరకంగా మిస్టరీగా మారింది. చెన్నై నుండి బయలుదేరిన రైలు కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ స్పందిస్తూ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఆ వివరాలు వెల్లడించారు. ఆర్ఎన్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం కవరైపెట్టై రైల్వే స్టేషన్ వద్ద ఈ రైలుకు హాల్ట్ లేదు. అందుకే ఈ రైలు అక్కడ ఆగకుండా మెయిన్ ట్రాక్‌పై వెళ్లాల్సి ఉంది. అందుకు అనుగుణంగానే గ్రీన్ సిగ్నల్ కూడా పడింది. కానీ ఎందుకో ఉన్నట్లుండి ఆ రైలు మెయిన్ ట్రాక్ నుండి గంటకు 75 కిమీ వేగంతో వెళ్తూ లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. ఆ సమయంలో అదే లూప్ లైన్‌పై స్టేషనరీ వస్తుసామాగ్రి లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు ఆగి ఉంది. మైసూర్-దర్భంగ బాగమతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అదే వేగంతో వెళ్లి వెనకనుండి గూడ్స్ ట్రైన్‌ని ఢీకొట్టింది.

శుక్రవారం రాత్రి ౮.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 12 రైలు బోగీలు పట్టాలు తప్పాయి. 19 మందికి గాయాలయ్యాయి. ఇంతకీ ఈ రైలు ప్రమాదం ఎలా జరిగింది అనేదే అక్కడి రైలు అధికారులకు అర్థం కాని ప్రశ్న. మెయిన్ ట్రాక్‌లో వెళ్లాల్సిన రైలుని లూప్ లైన్‌లోకి పోనిచ్చిన లోకో పైలట్‌దే తప్పిదం అనే మాట వినిపిస్తోంది. అక్కడే పొరపాటు జరిగినట్లుగా చెబుతున్నప్పటికీ.. అక్కడి వరకు అన్ని సిగ్నల్స్ సరిగ్గానే అనుసరిస్తూ వచ్చిన లోకో పైలట్ అక్కడెందుకు పొరపాటు చేస్తాడు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.

మరో రైల్వే అధికారి స్పందిస్తూ మైసూర్-దర్భంగ బాగమతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మెయిన్ ట్రాక్ లోంచి లూప్ లైన్‌లోకి వెళ్లడానికి ముందుగా రైలు ఒక పెద్ద కుదుపునకు గురైందని చెప్పారు. అలా భారీ జెర్క్‌కి గురైన తరువాతే రైలు మెయిన్ ట్రాక్‌లో వెళ్లకుండా ఉన్నట్లుండి లూప్ లైన్‌లోకి వెళ్లి గూడ్స్ రైలుని ఢీకొందని తెలిపారు.

రైల్వే అధికారి చెప్పిన ఈ వెర్షన్ ప్రకారమే ఆలోచిస్తే.. ఒకవేళ రైలు కుదుపునకు గురవడం వల్లే మెయిన్ లైన్‌లోంచి లూప్ లైన్‌లోకి వెళ్లినట్లయితే.. రైలు గమనాన్ని ప్రభావితం చేసేంత పెద్ద జెర్క్ ఏమై ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని సందేహాలకు సమాధానం రావాలంటే రైల్వే శాఖ అధికారులు చేపట్టనున్న ఉన్నత స్థాయి విచారణ పూర్తయితేనే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.

రంగంలోకి దిగిన NIA

తమిళనాడు రైలు ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తుండటంతో అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఈ ప్రమాదం వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానంతోనే ఎన్ఐఏ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో రైలు పట్టాలపై కుట్ర కోణాలు వెలుగుచూస్తుండటంతో తమిళనాడు రైలు ప్రమాదం వెనుక అలాంటి కోణం ఏదైనా ఉందా అని నిగ్గుతేల్చే పనిలో ఎన్ఐఏ అధికారులు నిమగ్నమయ్యారు.

చెన్నై - గూడురు సెక్షన్‌లో జరిగిన ఈ ప్రమాదం వల్ల చెన్నై - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - విజయవాడ జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. అలాగే విజయవాడ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రైస్ రైలుని రద్దు చేశారు. అదే సమయంలో ఎంకొన్ని రైళ్ల రూట్ డైవర్ట్ చేశారు. మైసూర్-దర్భంగ బాగమతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అలాగే, త్వరితగతిన పనులు పూర్తి చేసి ఆ రైలు మార్గంలో రాకపోకలు పునరుద్ధరించాలని స్పష్టంచేశారు.

చెన్నై ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెన్నై ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి వారికి సకాలంలో సరైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉదయనిధి స్టాలిన్ వారికి భరోసా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories