అయోధ్య చరిత్ర.. ములాయం హత్యాకాండ పట్ల ప్రజల్లో ఆగ్రహం.. రాజ్యాంగం తయారు చేస్తున్న సమయంలో రామ రాజ్యాన్ని ఆదర్శం
History of Ayodhya Ram Mandir: త్రేతా యుగంలో అయోధ్యలో జన్మించారు శ్రీరాముడు.
History of Ayodhya Ram Mandir: త్రేతా యుగంలో అయోధ్యలో జన్మించారు శ్రీరాముడు. కౌశల్య, దశరథ మహారాజుల జేష్ట కుమారుడు. శ్రీరామునికి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు సోదరులు. శ్రీరాముడు నవమి రోజున జన్మించాడు.. అందుకే ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్‌లలో పుట్టినరోజును అతని భక్తులు రామ నవమి గా ఘనంగా జరుపుకుంటారు. అయోధ్యలో జన్మించిన శ్రీరాముడు.. అయోధ్య పట్టణాన్నే రాజధానిగా చేసుకొని చాలాకాలం రాజ్యపాలన చేశాడు. రాముడి ఆదర్శ పాలనా కాలాన్ని శ్రీరామరాజ్యం అంటారు.. శ్రీరాముని అనంతరం ఆయన పెద్ద కుమారుడు కుశుడు రాజయ్యాడు. శ్రీరాముడి పరిపాలనాకాలం విశేషాలను తదనంతర కాలంలో ప్రచారం చేసి శ్రీరామరాజ్యాన్ని కొనసాగేలా సుపరిపాలన చేశారు. ఆ కాలంలోనే శ్రీరామచంద్రుడు జన్మించిన చోట భవ్యమైన శ్రీ రామమందిరం నిర్మాణం చేశారు. మందిరానికి 10 వేల ఎకరాల భూమిని కేటాయించారు.. ఇలా యుగాలు గడిచిపోయాయి.
ఇక మన కలియుగం ప్రారంభమైంది , రాచరికపు వింత పోకడలు , అనాగరిక రాక్షస జాతులు మళ్లీ పెచ్చరిల్లాయి, ధర్మదేనువు ఒకే పాదంపై నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రజలకు ప్రాణసంకటంగా పరిణమించింది. అయోధ్యలో శ్రీరామజన్మభూమి మందిరాన్ని బాబర్ అనే మంగోలియా నుండి వచ్చిన విదేశీ ముష్కరుడు తన సైన్యాధిపతి మీర్ భక్షి చేత ధ్వంసం చేయించాడు. ధార్మిక క్రతువులు, గోపూజలు నిర్వహించే మనదేశం గోమాతల రక్తంతో, సజ్జనుల హత్యలతో నెత్తుటి మడుగులయ్యాయి, ధర్మాన్ని బోధించే ఆలయాలు ధ్వంసమయ్యాయి. ప్రజలకు విద్యాబుద్ధులనందించే గురుకులాలు కాలి బూడిదయ్యాయి. స్త్రీ మూర్తులు అవమానాల పాలయ్యారు. అఖండ భారతాన్ని ముక్కలు చేశారు. 1528వ సంవత్సరం మంగోలియా నుండి వచ్చిన విదేశీ దురాక్రమణ దారుడైన బాబర్ ను ఎదిరించడం కోసం, అతన్ని మన దేశంనుండి తరిమేయడానికి, ధ్వంసమైన అయోధ్య శ్రీరామజన్మభూమి మందిర పునర్నిర్మాణం కోసం గొప్ప పోరాటమే జరిగింది. దేశంలోని అనేక ప్రాంతాల వారు వచ్చి పాల్గొన్న ఈ పోరాటం అనేక దశల్లో 76 సార్లు జరిగింది. ఈ పోరాటాలలో నాలుగు లక్షల మందికి పైగా బలిదానమై నేల కొరిగారు.
భారత రాజ్యాంగం కూడా శ్రీరాముడితో ముడి పడి ఏర్పడింది. స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి నూతన రాజ్యాంగం తయారు చేస్తున్న సమయంలో రామ రాజ్యాన్ని ఆదర్శంగా తీసుకున్నారు., రావణ వధ తర్వాత శ్రీలంక నుండి పుష్పక విమానంలో బయలుదేరి అయోధ్యకు వస్తున్న సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడి పురాణకాల సన్నివేశాన్ని చక్కగా చిత్రించి.. రాజ్యాంగంలోని మూడవ అధ్యాయంలో మౌలిక హక్కుల గురించి ప్రస్తావించిన చోట ఈ చిత్రాన్ని ముద్రించారు. అంటే రామునికి మన దేశ రాజ్యాంగం ఇచ్చిన ప్రాధాన్యత ఎంతటిదో అర్థం అవుతోంది. వేరువేరు మతాలకు చెందిన, వేరువేరు భావాలు కలిగిన వ్యక్తులున్న రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఆమోదించి స్వీకరించింది. ఇలా మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు రాజ్యాంగబద్ధమైన మహా పురుషుడిగా భారతజాతి స్వీకరించింది.
ఇక రామజన్మభూమి విముక్తి పోరాటం విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ లో జరిగిన హిందూ సమ్మేళనంలో భారతదేశానికి రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించిన గుల్జారీలాల్ నందా పాల్గొన్న సభలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా ఉన్న దావూదయాళ్ ఖన్నాప్రవేశపెట్టిన శ్రీ రామజన్మభూమి మందిర విముక్తి తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే అయోధ్య విషయంలో కేంద్రంలోనూ.. ఉత్తరప్రదేశ్ లోనూ అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ పార్టీ పోకడ నచ్చని దావూదయాళ్ ఖన్నా పార్టీ సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేసారు, విశ్వహిందూ పరిషత్ తో కలిసి ధార్మిక స్థలాల విముక్తికోసం శ్రీరామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ప్రారంభించారు.. ఆ తర్వాత మహంత్ అవైద్యనాథ్ అధ్యక్షులుగా దావూదయాళ్ ఖన్నా కార్యదర్శిగా శ్రీరామజన్మభూమి న్యాస్ ప్రారంభించారు. అక్కడి నుండి ప్రారంభమైన చివరిదశ ఉద్యమానికి 1984 నుండి విశ్వహిందూ పరిషత్ నేతృత్వం వహించింది.
శ్రీరామజన్మభూమి పై ఉన్న వివాదాస్పద కట్టడాన్ని తీసివేసి భవ్యమందిరం కట్టాలని ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వంలోని హోమ్ మినిస్టర్ బూటాసింగ్ నేతృత్వంలో సామాజిక పెద్దల సమావేశం పేరుతో హిందూ, ముస్లిం పెద్దల సమావేశం ఏర్పాటు చేయగా సయ్యద్ షాబుద్దీన్ మాటలతో చర్చలు విఫలమయ్యాయి. రెండవసారి వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అలీమియా నవాదీ నేతృత్వంలో చర్చలు జరిగాయి. ముస్లిం సామాజిక నాయకులు, హిందూ సమాజంలోని సాధువులు మరి కొంతమంది ప్రముఖులతో కూడిన బృందంతో జరిగిన చర్చలో బాబర్ కట్టడం అడుగున మందిరానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటే ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించడానికి అభ్యంతరం లేదని షాబుద్దీన్ ప్రకటించాడు. ఆ ప్రకటనను మిగిలిన ముస్లిం ప్రతినిధులు వ్యతిరేకించారు. ఇలా హిందూ ముస్లింల సద్భావన కొనసాగడం కోసం జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి.
మూడోసారి 1990లో చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలో విశ్వహిందూ పరిషత్, బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల మధ్యన చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు పక్షాల వారు తమ సాక్ష్యాలను లిఖిత రూపంలో కేంద్ర హోంమంత్రికి ఇచ్చారు.. అంతే కాకుండా పరస్పరం అందజేసుకున్నారు. ఒకరు ఇచ్చిన విషయాలపై మరొకరు అభ్యంతరాలను, జవాబులను తెలియజేసుకుంటూ చర్చించవలసిన బాబ్రీ మసీద్ ఆక్షన్ కమిటీ ప్రతినిధులు జనవరి 10వ తేదీ 1991 నాటి సమావేశానికి గైర్హాజరు కాగా జనవరి 25 వ తేదీకి వాయిదా పడింది. ఈ సమావేశానికి కూడా బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ముస్లిం ప్రతినిధులు ఎవరు హాజరు కానందున మూడవసారి కూడా చర్చలు విఫలమయ్యాయి.
చర్చలకురాని ముస్లిం పెద్దల మొండివైఖరి గమనించి అంతకుముందే 1990లో మే 24వ తేదీ పవిత్ర హరిద్వార్ లో సాధు మహాత్ముల మార్గదర్శనంలో విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో అక్టోబర్ 30వ తేదీ దేవోత్థాన ఏకాదశి రోజు అయోధ్య శ్రీరామజన్మభూమి మందిరం నిర్మాణం కోసం కరసేవ చేయడానికి నిర్ణయం జరిగింది. ఈ సందేశాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లడానికి సెప్టెంబర్ ఒకటో తేదీ నాడు అయోధ్యలో అరణి మంథనం చేసి... అంటే చెక్కల రాపిడితో నిప్పును పుట్టించి వెలిగించిన శ్రీరామజ్యోతి దీపాలను లక్షలాది గ్రామాలకు తీసుకువెళ్లారు. 1990 అక్టోబర్ 18వ తేదీన జరిగిన దీపావళి పండుగ దీపాలన్నీ శ్రీరామజ్యోతులై వెలిగాయి, ఇంటింటికి జ్యోతులతోపాటు లక్షలాది మంది అయోధ్య రావలసిందిగా సందేశం కూడా చేరింది.
అయోధ్యకు తరలి వెళ్లేందుకు కరసేవకులు సిద్ధమయ్యారు. మరొకవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ ఎవరినీ ఉత్తరప్రదేశ్ లోకి అడుగుపెట్టనివ్వనని.. అయోధ్యలో పక్షి కూడా ఎగరకుండా చూస్తానని ప్రకటన చేశాడు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులను ఆపడానికి రోడ్లన్నింటిని మూసి వేశాడు, అనేక చోట్ల రోడ్లను త్రవ్వించాడు. అయోధ్యకి వెళ్లే రైళ్ళు, బస్సులను రద్దు చేశాడు. 22వ తేదీ నుండి అన్ని దారులపైన ప్రతి 100 మీటర్లకు ఒక బ్యారికేడ్ చొప్పున నిర్మించి నగరాన్ని దిగ్బంధనం చేయడంతో అయోధ్య నగరం మొత్తం పోలీస్ స్టేషన్ గా మారింది.
దేవోత్థాన ఏకాదశి అక్టోబర్ 30వ తేదీ రానే వచ్చింది. దేశం నలుమూలల నుండి అనేక ఆటంకాలు దాటి అయోధ్య వైపు అడుగులు వేశారు కరసేవకులు. స్థానిక ప్రజలు స్వాగతం పలికి, ఆదరించి భోజనం పెట్టి సద్దులు కట్టి పంపారు. అడవుల గుండా, పొలాలగట్ల వెంబడి ప్రయాణిస్తూ వచ్చిన కరసేవకులు వానర సైన్యం మాదిరిగా అనుకున్న తేదీన.. అనుకున్న సమయానికి సాకేత పురానికి చేరుకున్నారు. కరసేవ చేయడానికై అయోధ్య శ్రీరామజన్మభూమి మందిర స్థలం వైపు బయలుదేరారు. వారిని పోలీసు బలగాలు ఆపే ప్రయత్నం చేసినా జన్మభూమి స్థలానికి చేరుకున్నారు. చూస్తుండగనే గుమ్మటాల పైకెక్కి కాషాయ జెంఢాను ఎగురవేసి కరసేవ నిర్వహించారు.
కరసేవ చేయడానికి వచ్చినవారు అయోధ్య లోనే ఉండి అనుకున్న పని మొత్తం చేసి వెళ్లడం కోసం నిరీక్షిస్తున్నారు. మరుసటి రోజు నవంబర్ 1 వ తేదీ భజనలు కీర్తనలతో గడిచిపోయింది. కరసేవ చేయడంతో ముఖ్యమంత్రి ములాయం సింగ్ కోపోద్రిక్తుడయ్యాడు. పోలీసు బలగాలకు ఆజ్ఞలు జారీ చేశాడు.., రెండో తేదీ ఉదయం నుండే మరింత మంది సాయుధ పోలీసు బలగాలు చేరుకున్నాయి.. ఇవేవీ గమనించని రామభక్తులు భజనలు కీర్తనలతో సత్యాగ్రహం చేస్తూ వీధుల్లో కూర్చున్నారు. నిరాయుధులైన రామ భక్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. బెంగాల్ కలకత్తా నుండి వచ్చిన రామ్ కొఠారి, శరత్ కొఠారి సోదరులిద్దరినీ పట్టుకొని పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చి చంపారు.. పోలీసుల కాల్పుల్లో సాధువులు, సన్యాసులు, సామాన్య ప్రజలు ఎంతో మంది చనిపోయారు.., కొందరినైతే ఇసుక బస్తాలను కట్టి సరయూ నదిలో వేశారు, ఇళ్లల్లో దూరి హత్యలు చేశారు. పోలీసులు జరిపిన కాల్పులలో తూటాలు తగిలినవారి రక్తం అయోధ్య వీధుల్లో ధారలైంది.. ఆనాటి బలిదానమయిన కరసేవకుల అస్తికలను పూజించి యాత్రగా తీసుకెళ్లి నదులలో కలిపారు., ఈ అస్తికలశ యాత్రలలో కోట్లాది మంది రామభక్తులు పాల్గొన్నారు. ములాయం హత్యాకాండ పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది దేశం నలుమూలలా సత్యాగ్రహపు జ్వాలలు ఎగిశాయి.
1991 జనవరి 14వ తేదీ మాఘమేళ సందర్భంగా ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో బలిదానమైన కరసేవకుల అస్థికలను సంపూర్ణంగా నిమజ్జనం చేసి మందిర నిర్మాణం పట్ల నిబద్ధులమై ఉన్నామని మరిన్ని బలిదానాలు చేయడానికి కూడా సిద్ధమేనని లక్షలాదిగా సాధువులు, సన్యాసులు, ప్రజలు, ప్రతిజ్ఞలు తీసుకున్నారు.
1990లో జరిగిన కాల్పుల్లో వందలాది మంది చనిపోయినా రామభక్తులు వెనకడుగు వేయలేదు. రామజన్మభూమిలో రామాలయం కట్టి తీరాలన్న సంకల్పం చెక్కు చెదరలేదు. అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు మారాయి. కరసేవకులపై కాల్పలకు ప్రతిఫలంగా ములాయం సింగ్ ప్రభుత్వం ఓడిపోయింది. బీజేపీ ఆధ్వర్యంలో కళ్యాణ్ సింగ్ సీఎం అయ్యారు.
నిరాయుధులైన కరసేవకులను సత్యాగ్రహం చేస్తుండగా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన ములాయంసింగ్ ప్రభుత్వంపై ప్రజలకు ఏహ్యభావం కలిగింది. ఉత్తరప్రదేశ్లో పాలకులు మారారు. రామభక్తుడైన కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అయోధ్య దర్శనానికి వచ్చే భక్తుల అవసరానికి కథాకుంజ్ నిర్మాణం చేపట్టారు. కోర్టు కేసులోఉన్న వివాదాస్పదమైన స్థలం వదిలి గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 42 ఎకరాల భూమిని శ్రీరామజన్మభూమి న్యాస్ పేరిట పట్టా చేసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం పర్చుకుని రక్షణ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా హస్తగతం చేసుకున్న భూమిపై ముస్లింలు అభ్యంతరం తెలుపుతూ హైకోర్టుకు వెళ్లారు.
అక్టోబర్ 30వ తేదీ 1992 నాడు సాధుసంతులు ఢిల్లీలో ఐదవ ధర్మసంసద్ జరిపి పరిస్థితులను సమీక్షించారు. ఈ సమావేశంలోనే డిసెంబర్ 6 వ తేదీన రెండవ కరసేవకై దేశం నలుమూలల నుండి రామ భక్తులను అయోధ్యకు ఆహ్వానించారు. నవంబర్ 4వ తేదీ నాటికి వాదనలు విన్న హైకోర్టు త్వరలోనే తీర్పునిస్తుందనే విశ్వాసంతో కరసేవలో పాల్గొనడం కోసం లక్షలాది మంది భక్తులు డిసెంబర్ 1, 2వ తేదీ నాటికే అయోధ్య చేరుకున్నారు. హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 4వ తేదీనాడు హైకోర్టువారు తాము డిసెంబర్ 11వ తేదీన తీర్పు వినిపిస్తామని ప్రకటించారు. డిసెంబర్ ఆరవ తేదీ రానే వచ్చింది. మరోవైపు దేశంలో జరుగుతున్న పరిణామాలు.. ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు గమనించిన కరసేవకులు ఇక సహించలేకపోయారు, ఆవేశపూరితులై అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తిరగబడ్డారు. దేశం నలుమూలల నుండి అయోధ్యకు చేరుకున్న కరసేవకులు తమవెంట ఏ ఆయుధాలను తీసుకెళ్లక పోయినా కట్టడం చుట్టూ కంచెకొరకు ఏర్పాటుచేసిన ఇనుప గొట్టాలే ఆయుధాలుగా మార్చుకున్నారు., లక్షలాదిగా వచ్చిన కరసేవకులు మూడున్నర గంటలలోనే వివాదాస్పద కట్టడాన్ని నేలమట్టం చేశారు.
గుమ్మటాల క్రింద ఉన్న బాలరాముడి విగ్రహాన్ని ముందే బయటికి తీసుకు వచ్చిన కరసేవకులు శ్రీరామజన్మభూమి స్థలంలోనే వెనువెంటనే గుడ్డతో వెదురు బొంగులతో చిన్న టెంట్ వేసి, నాలుగు వైపులా ఇటుకలు, మట్టితో గోడలుకట్టి అప్పటికప్పుడు చిన్న మందిరాన్ని నిర్మించారు. బాలరాముడిని ప్రతిష్టించారు. పూజలు అర్చనలు చేశారు, భజనలు చేశారు, కానుకలు సమర్పించారు. కరసేవకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. భరత మాత నుదుటిపైన విదేశీ దురాక్రమణ దారుడి దాష్టీకానికి గుర్తుగా ఉన్న అవమాన చిహ్నాన్నిచెరిపివేశామని సంతోషం వ్యక్తం చేశారు. ఆరోజు బాబర్ కట్టడాన్ని తొలగిస్తున్న సమయంలోనే మరొక విశేషం బయటపడింది 1154 సంవత్సరం నాటి సంస్కృతంలో చెక్కిన శిలాశాసనం బయటపడింది. అమూల్యమైన ఈ శిలాశాసనంలో విష్ణుహరి యొక్క స్వర్ణ కలశముతో కూడుకున్న మందిరం యొక్క వర్ణన, అయోధ్య నగరం యొక్క వర్ణన, దశకంఠుడైన రావణాసురుని గర్వభంగపు వర్ణణ శాసనంపై చేక్కారు. దీనితో భవ్యమైన ప్రాచీన అయోధ్యా శ్రీరామ జన్మభూమి మందిరానికి సంబంధించిన ఆనవాళ్లు, అవసరమైన సాక్ష్యాలు దొరికినట్లయింది. అక్కడ దొరికిన సాక్ష్యాలు.. మోడీ సర్కార్ నడిపిన రాజనీతి.. అన్నీ వెరసి సుప్రీం కోర్టు తీర్పుతో రామమందిర నిర్మాణ కల సాకారమయ్యింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire