బెంగళూరు రేవ్ పార్టీ... పుల్ రిపోర్ట్...

Here are The Details of Bangalore Rave Party
x

బెంగళూరు రేవ్ పార్టీ... పుల్ రిపోర్ట్..

Highlights

Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ అంశం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.

Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ అంశం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. టాలీవుడ్ నటి హేమ సహా మరికొందరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారి పేర్లు ఈ కేసులో వెలుగు చూశాయి.రేవ్ పార్టీలో తొలుత తాను పాల్గొనలేదని హేమ వీడియోను రిలీజ్ చేసింది. కానీ, బెంగుళూరు పోలీసులు హేమ పేరును కూడ బయటపెట్టారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నారని బెంగుళూరు పోలీసులు ప్రకటించారు.

బర్త్ డే పేరుతో రేవ్ పార్టీ

మే 19న సాయంత్రం బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో రేవ్ పార్టీ ప్రారంభమైంది. ఈ విషయమై సమాచారం అందుకున్న బెంగుళూరు పోలీసులు పార్టీ జరుగుతున్న ఫామ్ హౌస్ పై దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన లంకపల్లి వాసు తన పుట్టిన రోజు సందర్భంగా బెంగుళూరులోని ఓ ఫామ్ హౌస్ లో ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ పార్టీలో పాల్గొన్న కొందరు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. పార్టీ జరిగిన ఫాంహౌస్ లో 15.45 గ్రాముల ఎండీఎంఏ బిళ్లలు, 6.2 గ్రాముల కొకైన్, ఆరు గ్రాముల హైడ్రో గంజాయితో పాటు సెల్ ఫోన్లు, కార్లు సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్నవారి నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. ఈ రిపోర్టును ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ నుండి రిపోర్టు ఈ నెల 23న బెంగుళూరు పోలీసులకు చేరింది. పార్టీకి హాజరైన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నారని ఈ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది.ఈ పార్టీకి హాజరైన వారిలో 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మంది బ్లడ్ శాంపిళ్లలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టుగా ఆ నివేదిక చెబుతుంది.

ఎవరీ లంకపల్లి వాసు?

విజయవాడకు చెందిన లంకపల్లి వాసు పేరు బెంగుళూరు రేవ్ పార్టీతో తెరపైకి వచ్చింది. విజయవాడ వాసులకే తెలిసిన వాసు పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైంది. బెజవాడ కొత్తపేట కొండపై వాసు పేరేంట్స్ ఉండేవారు. వాసుకు చిన్నతనంలోనే తండ్రి మరణించారు. వాసు తల్లి ఎల్ఐసీ ఏజంట్ గా పనిచేసి కుటుంబాన్ని పోషించింది. వాసుకు చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే పిచ్చి. అయితే ఈ పిచ్చితోనే వాసు క్రికెట్ బెట్టింగ్ పై పట్టుసాధించినట్టుగా ప్రచారం సాగుతుంది. విజయవాడకు చెందిన ఓ బుకీ ద్వారా బెట్టింగ్ గురించి ఆయన తెలుసుకున్నారు.ఆ తర్వాతి కాలంలో బెట్టింగ్ పై ఆయన పట్టు సాధించారని చెబుతుంటారు. విజయవాడ, చెన్నై, హైద్రాబాద్, బెంగుళూరు, తిరుపతి, కర్నూల్ ప్రాంతాల్లో కూడా వాసు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుంటాడని ఆరోపణలున్నాయి.ఈ బెట్టింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతో వాసు విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టుగా ప్రచారంలో ఉంది.

రేవ్ పార్టీలో లేనని హేమ బుకాయింపు

బెంగుళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమ పాల్గొన్నట్టుగా తొలుత ప్రచారం సాగింది.అయితే ఈ పార్టీలో తాను లేనని హేమ ప్రకటించారు.ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తాను హైద్రాబాద్ లోనే ఉన్నట్టుగా ఆమె ప్రకటించారు. అయితే బెంగుళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో హేమ ధరించిన డ్రెస్... హైద్రాబాద్ లోనే ఉన్నానని హేమ విడుదల చేసిన వీడియోలో ఒకే డ్రెస్ తో ఆమె కన్పించారు.ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపించారు. ఆ మరునాడే చికెన్ బిర్యానీ తయారు చేస్తున్న వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో ఆమె పోస్టు చేశారు. అదే సమయంలో బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నవారి వివరాలను పోలీసులు ప్రకటించారు. బెంగుళూరు రేవ్ పార్టీ కేసు గురించి కవర్ చేసుకొనేందుకు తంటాలు పడుతున్నారని హేమపై నెటిజన్లు సెటైర్లు వేశారు.సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.హేమ అసలు పేరు కృష్ణవేణి. బెంగుళూరు పోలీసులకు తనపేరు కృష్ణవేణిగా చెప్పింది హేమ. పోలీసుల విచారణలో హేమ, కృష్ణవేణి ఒక్కరేనని తేలింది. మరో వైపు రేవ్ పార్టీలో పాల్గొన్న 86 మంది బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ‌్లున్నట్టుగా బెంగుళూరు పోలీసులకు నివేదిక అందింది. ఈ నివేదికలో హేమ పేరు కూడా ఉంది.

బెంగుళూరు రేవ్ పార్టీలో మరికొందరు తెలుగువాళ్లు

బెంగుళూరు రేవ్ పార్టీలో హేమతో పాటు యువ నటి ఆశూ రాయ్ కూడా ఉన్నారు. బర్త్ డే పార్టీ కోసం బెంగుళూరుకు వెళ్లినట్టుగా ఆశూరాయ్ చెప్పారు. కానీ, ఫాం హౌస్ లో ఏం జరిగిందో తనకు తెలియదని ఆమె వీడియో విడుదల చేశారు. వాసు అన్నయ్య బర్త్ డే పార్టీ అని ఆహ్వానిస్తే తాను ఈ పార్టీకి హాజరైనట్టుగా ఆమె చెప్పారు. హేమ, ఆశూరాయ్ తో పాటు పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఈ రేవ్ పార్టీకి హాజరయ్యారు.ఈ పార్టీలో ఉన్నారని సినీ నటుడు శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ, యాంకర్ శ్యామలపై సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.అయితే ఈ ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురూ వివరణ ఇచ్చారు. ఈ మేరకు వీడియోలు విడుదల చేశారు.

బెంగుళూరు రేవ్ పార్టీలో ఏ1 వాసు

బెంగుళూరు రేవ్ పార్టీలో ఏ1గా లంకపల్లి వాసును చేర్చారు పోలీసులు. పార్టీని ఆర్గనైజ్ చేసిన అరుణ్ కుమార్ పేరును ఏ2 గా చేర్చారు.ఏ3 నాగబాబు,ఏ4 రణధీర్ బాబు,ఏ6 ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డి లను ఈ కేసులో చేర్చారు బెంగుళూరు పోలీసులు. వాసుకు ఫాం హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డి మధ్య స్నేహం ఉన్నందున బర్త్ డే పార్టీని ఇక్కడ నిర్వహించారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

బెంగుళూరు రేవ్ పార్టీపై టీడీపీ, వైసీపీ మధ్య విమర్శలు

బెంగుళూరు రేవ్ పార్టీలో ఓ కారుకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ తో ఉన్న కారును పోలీసులు గుర్తించారు.అయితే ఈ కారుతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. తన ఎమ్మెల్యే స్టిక్కర్ జీరాక్స్ ను ఉపయోగించారని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.బెంగుళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించారు. అవసరమైతే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నానని చెప్పారు. మరో వైపు బెంగుళూరు రేవ్ పార్టీలో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారు దొరకడంపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బెంగుళూరులో రేవ్ పార్టీ నిర్వహించిన ఫాంహౌస్ యజమాని గోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పారు. గతంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి నేర చరిత్ర ఉందని ఆయన ఆరోపణలు చేశారు.

బెంగుళూరు రేవ్ పార్టీలో ఐదుగురి అరెస్ట్

బెంగుళూరు రేవ్ పార్టీలో వాసు, అరుణ్ కుమార్ ,నాగబాబు, రణధీర్ బాబు, మహమ్మద్ అబుబాకర్ సిద్దిఖీ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు.పోలీసులు ఈ పార్టీపై దాడి చేసిన సమయంలో కొందరు ఫాంహౌస్ చెట్ల మధ్య డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా గుర్తించారు. పోలీసులను చూసిన కొందరు వాష్ రూమ్ ల్లో చెట్ల పొదల్లో డ్రగ్స్ ను విసిరేశారని పోలీసులు తెలిపారు.

రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజు రూ. 2 లక్షలు

బెంగుళూరు రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజు రూ. 2 లక్షలుగా నిర్ణయించారనే ప్రచారం కూడా సాగింది. రేవ్ పార్టీ నిర్వహించిన ఫాంహౌస్ వద్ద 15 లగ్జరీ కార్లను పోలీసులు గుర్తించారు. సన్ సెట్ టూ సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ పార్టీని నిర్వహించారు.ఈ పార్టీ పేరుతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. బెంగుళూరు నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర ప్రకటించారు. డ్రగ్స్ పార్టీలను ఎంకరైజ్ చేయబోమని ఆయన ప్రకటించారు.

గతంలో తెలంగాణ రాష్ట్రంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్ అధికారులు హడావుడి చేశారు. చివరికి ఈ కేసులో సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయారని ఆరు కేసును కోర్టు కొట్టివేసింది. అయితే బెంగుళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలను సమర్పిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories