కేరళ సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న ‘#MeToo ఫీవర్... జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌లో ఏముంది?

Hema Committee report paves way for #MeToo movement in Mollywood
x

కేరళ సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న ‘#MeToo ఫీవర్... జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌లో ఏముంది?

Highlights

ఇప్పటికే, ఈ మీటూ ఆరోపణల్లో చాలా మంది పేర్లు వినిపించాయి. సినీ ప్రముఖులపై వస్తున్న ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు.

కేరళ సినీ పరిశ్రమను ప్రస్తుతం మీటూ ఫీవర్ వణికిస్తోంది. ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా అక్కడి సినీ ప్రముఖులు ఈ మీటూ ఫీవర్ బారినపడుతున్నారు. మలయాళం హీరోయిన్స్ చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల్లో తమ పేరు ఎక్కడ వినిపిస్తుందోనని సినీ రంగంలోని నటులు, ఇతర ప్రముఖులు హడలిపోతున్నారు.

ఇప్పటికే, ఈ మీటూ ఆరోపణల్లో చాలా మంది పేర్లు వినిపించాయి. సినీ ప్రముఖులపై వస్తున్న ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనే కాదు, అసోసియేషన్ సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. తమ అసోసియేషన్‌ సభ్యులు కొంతమందిపై ఆరోపణలు వచ్చినందున, ఇంకా ఈ అసోసియేషన్ బాడీ కొనసాగడంలో అర్థం లేదని నైతిక బాధ్యత వహిస్తూ అందరం రాజీనామా చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.

మీటూ ఉద్యమం ఎలా మొదలైంది?

మీటూ అంటే,,, నేను కూడా బాధితురాలినే అని చెప్పడం. ఇండస్ట్రీలోని ఈ రకమైన లైంగిక వేధింపులకు తాను కూడా మినహాయింపు కాదని ఎవరైనా మహిళ బహిరంగంగా ప్రకటించడానికి ముందుకు వస్తే, అది సోషల్ మీడియాలో మీటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతుంది.

ఒక మహిళను లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించడం, బ్యాడ్ టచ్‌కు పాల్పడడం, బ్లాక్ మెయిల్ చేయడం వంటివన్నీ లైంగిక వేధింపుల కిందకే వస్తాయి. ఈ వేధింపులకు గురైన మహిళలు ఇప్పుడు కేరళ సినీ ఇండస్ట్రీ నుంచి మీటూ అంటూ ముందుకు వస్తున్నారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు బయటకు రావడంతో ఇప్పుడు రాష్ట్రంలో ఇదొక సంచలనంగా మారిపోయింది.

హేమ కమిటీ రిపోర్ట్‌లో ఏముంది?

కేరళ సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్స్, జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్ కే హేమ కమిటీ విచారణ చేపట్టి ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే, ఇంతకాలం కోర్టు కేసులతో ఈ నివేదిక గోప్యంగా ఉండిపోయింది. కోర్టు కేసులు దాటుకుని వారం రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. ఈ నివేదికలోని అంశాలు, సినిమా పెద్దల అరాచకాలు చూశాక మళయాళం సినీ పరిశ్రమలో పనిచేస్తోన్న హీరోయిన్స్, ఇతర ఆర్టిస్టులు మరోసారి తమ గళం విప్పుతున్నారు.

పరిశ్రమలో ప్రముఖులుగా చెలామణి అవుతున్న కొంతమంది తమని ఎలా వేధిస్తున్నారు అనే విషయాలను పూసగుచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. హీరోయిన్స్ సంచలన ఆరోపణలతో నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు హడలిపోతున్నారు. అలా మీటూ ఉద్యమం మరోసారి ఉగ్రరూపం దాల్చిన ప్రస్తుత నేపథ్యంలో.. ఇంతకాలం తిక్కతిక్క వేషాలు వేసిన వాళ్లంతా ఎప్పుడు, ఎవరి నోట తమ పేరు బయటికొస్తుందా అని బిక్కుబిక్కుమంటున్నారు.

మలయాళం సినీ పరిశ్రమలో సిద్ధిఖి, బాబూరాజ్, జయసూర్య, ఇడవేలు, మణియన్‌పిల్ల రాజు, నటనారంగం నుండి రాజకీయాల్లోకి వెళ్లి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎం ముఖేష్ లాంటి కొంతమంది పేరున్న సినీ ప్రముఖుల పేర్లు ఇప్పుడు ఈ మీటూ ఆరోపణల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా ఇంకా పెద్దదే ఉంది.

అవకాశం కావాలంటే అడిగింది ఇవ్వాలి...

సినిమాల్లో అవకాశాలు ఇస్తామని కొందరు.. ఫలానా సినిమాలో పాత్ర గురించి మాట్లాడాలని ఇంకొందరు.. ఇలా ఏవేవో మాయమాటలు చెప్పి తారల్ని తమ హోటల్ గదులకు, బెడ్ రూమ్స్‌కి పిలుపించుకుని వారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా బాధితుల ఆరోపణలు చెబుతున్నాయి.

మీనూ మునీర్ అనే నటి మరో అడుగు ముందుకేసి ఏకంగా నలుగురు ప్రముఖుల పేర్లు బయటపెట్టారు. ఆ నలుగురూ తనని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వేధించారనేది ఆయా ఘటనలతో సహా చెప్పుకొచ్చారు. చివరకు మళయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం కోసం వెళ్తే కూడా తనపై లైంగిక దాడులకు పాల్పడ్డారని చెప్పుకుని బోరుమన్నారు. కేవలం వాళ్లు పెట్టే నరకం భరించలేకే తాను మళయాళం సినీ పరిశ్రమని విడిచిపెట్టి చెన్నైకి వెళ్లిపోయానని మీనూ మునీర్ ఆరోపించారు.

సినిమాలో పాత్ర కావాలంటే పడక గదికి రావాలి...

తమని సంతృప్తి పరిస్తేనే సినిమాల్లో ఆ ఒక్క ఛాన్స్ ఇస్తామని డైరెక్టుగానే అడుగుతున్న వాళ్ల సంఖ్య మరీ ఎక్కువైపోయిందని మలయాళం హీరోయిన్స్, జూనియర్ ఆర్టిస్టులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారి డిమాండ్లకు అంగీకరించకపోతే.. తమకు సినిమాల్లో అవకాశాలు రాకుండా చేయడం, లేదంటే చేస్తున్న సినిమాల్లో ఇబ్బందులు సృష్టించడం వంటివి చేస్తూ నరకం చూపిస్తున్నారని మండిపడుతున్నారు.

అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబూరాజ్ ఏం చేశారంటే...

ఉదాహరణకు మళయాళంలో పేరున్న, అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అయిన బాబూరాజ్ గురించి ఒక జూనియర్ ఆర్టిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ జూనియర్ ఆర్టిస్ట్ చెప్పిన వివరాల ప్రకారం.. " ఒక సినిమా ప్రాజెక్ట్ విషయమై మాట్లాడేందుకు ఎర్నాకులం జిల్లాలోని అలువలో ఉన్న తన నివాసానికి రావాల్సిందిగా బాబూరాజ్ ఫోన్ చేశాడు. స్క్రీన్ రైటర్స్, డైరెక్టర్స్ కూడా తన పాత్ర గురించి మాట్లాడేందుకు అక్కడికే వస్తున్నారని చెప్పాడు.

బాబూరాజ్ మాటలు నమ్మి నేను అతడి ఇంటికి వెళ్లాను. వెళ్లగానే నేను రెస్ట్ తీసుకునేందుకు ఓ గది చూపించాడు. కొద్దిసేపటి తరువాత డిన్నర్‌కి రమ్మని పిలిచాడు. ఆ తరువాత మళ్లీ తన గదిలో తాను లాక్ చేసుకుని ఉన్నాను. ఆ తరువాత అతడే వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీయడంతోనే తోసుకుంటూ లోపలికి వచ్చి వెంటనే లోపలి నుండి లాక్ చేశాడు. తాను వద్దని వారిస్తున్నా వినిపించుకోకుండా తన మీదపడి అత్యాచారానికి పాల్పడ్డాడు " అంటూ ఆనాటి రాత్రి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకుని ఆ నటి ఆరోపించింది.

ఈ జూనియర్ ఆర్టిస్ట్ చేసిన ఆరోపణలపై మళయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ జనరల్ సెక్రటరీగా ఉన్న బాబూరాజ్ స్పందించాడు. తనపై వచ్చి ఆరోపణలను ఖండించిన బాబూరాజ్.. తాను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాకూండా ఉండేందుకు ఇది పడని వాళ్లు చేస్తోన్న కుట్ర అని కొట్టిపారేశాడు. తాను సదరు జూనియర్ ఆర్టిస్టుపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించాడు.

ఇలా వరుస ఆరోపణలతో నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీ మీడియా ముందుకు వస్తుండటంతో ప్రస్తుతం మళయాళం సినీ పరిశ్రమలో అంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

టాలీవుడ్‌లోనూ అదే తంతు...

ఈ మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు మన తెలుగు సినీ పరిశ్రమలోనూ గతంలో తెర ముందుకు వచ్చాయి. హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత హార్వే వైన్ స్టైన్ మీద 2017లో తీవ్ర స్థాయిలో లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు, బాలీవుడ్‌లో కూడా ఆ ప్రకంపనలు కనిపించాయి. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి, మీడియా రంగం నుంచి కొంతమంది మహిళలు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ప్రముఖుల మీద ఆరోపణలు చేశారు. నానా పటేకర్, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్.. వంటి వారు అప్పట్లో ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో తెలుగు పరిశ్రమలో కూడా కొందరు ఆర్టిస్టులు మీడియా ముఖంగా ఆరోపణలు చేశారు.

సినీ పరిశ్రమ ఒక్కటే కాదు... ఇతర రంగాల్లో కూడా

మీటూ వివాదాలు కేవలం సినీ పరిశ్రమతోనే ఆగిపోలేదు. పాత్రికేయ వృత్తిలో, రాజకీయాల్లోనూ పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అలాగే కార్పొరేట్ ప్రపంచంలోనూ కొంతమంది బాసులు తమ కింది స్థాయి ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుని ఉద్యోగాలు ఊడగొట్టుకున్న కేసులు కూడా ఉన్నాయి.

అయితే, దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలానే నమోదైనప్పటికీ, విచారణ జరిగి.. దోషులను నిర్ధారించిన దాఖలాలు చాలా అరుదు. దీనిపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. " మహిళలను వేధించే వారిపై కేసులు పెట్టి ఏళ్ల తరబడి బాధితులు కోర్టుల చుట్టూ తిరిగే ఘటనలే అధికంగా కనిపిస్తున్నాయి. దానికంటే ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని సామాజికంగా బహిష్కరించడమే సరైన శిక్ష" అని అన్నారు.

మగవాళ్ళు తమ గౌరవం తాము కాపాడుకుంటూ మహిళలను కూడా గౌరవించడం నేర్చుకుంటే పరిశ్రమలో నాగరిక వాతావరణం నెలకొంటుందని అప్పట్లో తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం మీటూ ఉద్యమం మలయాళ సినీ ప్రముఖులకు నిద్ర కరువయ్యేలా చేస్తోంది. జస్టిస్ హేమ రిపోర్ట్ మరో సారి సినీ పరిశ్రమలోని తప్పుల కుప్పను కదిలించింది. ఈసారైనా బాధితులకు న్యాయం జరుగుతుందని, సినీ పరిశ్రమ కల్చర్ లో మార్పు వస్తుందని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories