Cyclone Michaung: దూసుకొస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌.. నేడు,రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rains Under The Influence Of Cyclone Michaung
x

Cyclone Michaung: దూసుకొస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌.. నేడు,రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Highlights

Cyclone Michaung: రేపు ఏపీలో తీరం దాటనుందని వాతావరణశాఖ వెల్లడి

Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుఫాన్‌ ఈ నెల 5న ఏపీలో తీరం దాటనున్నది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్‌గా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 5న ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపారు. ఈ సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. తుఫాన్‌ ప్రభావంతో ఒడిశా, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా రాష్ర్టాల అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు 54 రైళ్లను రద్దు చేసినట్టు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రకటించింది.

ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానుంది. ఆ తరువాత ఉత్తరంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తాకు సమాంతరంగా పయనించే క్రమంలో తీవ్ర తుఫాన్‌గా బలపడనుంది. ఈ క్రమంలో ఈ నెల ఐదో తేదీ ఉదయానికి ఒంగోలు-మచిలీపట్నం మధ్య చీరాల లేదా బాపట్లకు సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర తుఫాన్‌ తీరం దాటేటప్పుడు దక్షిణకోస్తాలో, ఉత్తరకోస్తాలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గాలుల తీవ్రత నేపథ్యంలో దక్షిణ కోస్తాలో తీవ్ర తుఫాన్‌ తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు మీటరు నుంచి మీటన్నర ఎత్తు వరకు ఎగిసిపడతాయని, దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతాయని హెచ్చరించింది.

కాగా, ఐదో తేదీన తుఫాన్‌ తీరం దాటిన తరువాత కోస్తా మీదుగా పయనించేటప్పుడు చాలాసేపు తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశించేటప్పుడు వాయుగుండంగా మారి తరువాత ఒడిశావైపుగా వెళుతుందని నిపుణులు అంచనావేశారు. కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నంబరు, కోస్తాలోని మిగిలిన రేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోంగా మారడంతో సముద్ర అలలు ఎగసిపడుతుండంతో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories