Top 6 News @ 6pm: గన్‌మెన్‌లు లేకుండా పోదాం.. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్.. మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News @ 6pm: గన్‌మెన్‌లు లేకుండా పోదాం.. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్.. మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

1) Harish Rao: గన్‌మెన్‌లు లేకుండా పోదాం.. నేనే కారు నడుపుతా.. తెలంగాణలో మూసీపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు...

1) Harish Rao: గన్‌మెన్‌లు లేకుండా పోదాం.. నేనే కారు నడుపుతా..

తెలంగాణలో మూసీపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చతికలపడి, మూసీని ముందు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అటకెక్కాయని, ప్రజల దృష్టికి మరల్చేందుకే మూసీని తెరపైకి తెస్తున్నారంటూ మాట్లాడారు హరీష్‌రావు. సీఎం పదవి స్థాయిని దిగజార్చే విధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల వద్దకు వెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించారు. గన్మెన్ లు లేకుండా పోదాం అని సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు. నేను కార్ నడుపుకుంటూ వస్తాను.. నా పక్కన కూర్చో.. ఇద్దరం కలిసి వెళ్దామని హరీష్ రావు సవాల్ విసిరారు. అంతకంటే ముందు మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి అక్కడి నుంచి మల్లన్నసాగర్, ఆర్ అండ్ ఆర్ కాలనీ, రంగనాయకసాగర్ కట్ట వద్దకు వెళ్దామన్నారు.

2) KTR Tweet: తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది

KTR Tweet: తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. పాలన చేతికాక పనికిమాలిన మాటలు... పాగల్ పనులు చేస్తున్నారని విమర్శించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్... తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తున్నారని ఆక్షేపించారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందనుకునే వారు తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు.

3) Munawar Zama: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో విగ్రహం ధ్వంసం: మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమాపై కేసు

సికింద్రాబాద్ మోండా మార్కెట్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం కేసులో మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు రెంజిమెంటల్ బజార్ లోని మెట్రో పోలీస్ హోటల్ కు చెందిన అబ్దుల్ బషీర్ అహ్మద్, రెహమాన్ లపై పోలీసులు కేసు పెట్టారు.మత విద్వేషాలకు కారణమైందని మెట్రో పోలీస్ హోటల్ ను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 14న ఈ హోటల్ లో బస చేసిన సలీం అనే వ్యక్తి ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) Allagadda High-Tension: ఏవీ సుబ్బారెడ్డికి భూమా వార్నింగ్: ఆళ్లగడ్డలో టెన్షన్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ వీడి వెళ్లాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఆళ్ళగడ్డకు రావొద్దని తనను ఆపడానికి భూమా అఖిలప్రియకు ఏం హక్కుందని ఏవీ సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నారు. తాను ఆళ్ళగడ్డను వీడేదిలేదని ఆయన చెబుతున్నారు. దీంతో ఆళ్లగడ్డలో భారీగా పోలీసులు మోహరించారు. భూమా నాగిరెడ్డి బతికున్నసమయంలో ఏవీ సుబ్బారెడ్డి ఆయనకు కుడిభుజంగా ఉన్నారు. భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత కొంతకాలం ఏవీ సుబ్బారెడ్డికి , భూమా అఖిలప్రియ కుటుంబానికి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) Rain Alert: ఏపీకి మరో ముప్పు.. వచ్చేవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడం..భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీని వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరం దాటిందని..ముప్పు వీడిందని భావిస్తున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అక్టోబర్ 22న మరో అల్పపీడనం ఏర్పాడు అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల్లో వాతావరణంలో మార్పులు రానున్నాయి.

నేడు శుక్రవారం కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోకి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

6) Yahya Sinwar: యాహ్వా సిన్వార్ చనిపోయాడు.. ఇజ్రాయెల్ డ్రోన్ కెమెరా తీసిన చివరి క్షణాల వీడియో వైరల్

Yahya Sinwar Last Moments video: హమాస్ ఉగ్రవాద సంస్థ అధినేత యాహ్వా సిన్వార్ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యాహ్వా సిన్వార్ ఆఖరి క్షణాలకు సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాహ్వా సిన్వార్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. డ్రోన్ కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన ఆ వీడియోను పరిశీలిస్తే.. ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలమైన భవనంలో దుమ్ముదూళిపారిన సోఫాలపై ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. డ్రోన్ తనవైపే వస్తుండటాన్ని గమనించిన ఆ వ్యక్తి.. తన చేతిలో ఉన్న కర్రను దానివైపు విసరడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అతడే యహ్యా సిన్వర్ అని ఇజ్రాయెల్ ప్రకటించింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories