Gauri Lankesh: గౌరి లంకేష్ మర్డర్ కేసు నిందితుడికి పార్టీ పదవి.. ప్రతిపక్షాల గగ్గోలుతో వెనక్కి తగ్గిన సీఎం

Gauri Lankesh: గౌరి లంకేష్ మర్డర్ కేసు నిందితుడికి పార్టీ పదవి.. ప్రతిపక్షాల గగ్గోలుతో వెనక్కి తగ్గిన సీఎం
x
Highlights

Gauri Lankesh: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. గౌరి లంకేష్ మర్డర్ కేసులో నిందితుడిగా విచారణ...

Gauri Lankesh: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. గౌరి లంకేష్ మర్డర్ కేసులో నిందితుడిగా విచారణ ఎదుర్కుంటున్న శ్రీకాంత్ పంగార్కర్ ఈ సెప్టెంబర్ నెలలో బెయిల్ పై బయటికొచ్చారు. అక్టోబర్ 18న శివసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరడంతోనే పంగార్కర్ సొంత జిల్లా అయిన జల్నాలో శివసేన పార్టీ ఎన్నికల ప్రచారం బాధ్యతలను ఆయన చేతిలో పెట్టారు. శివసేన పార్టీ అధినేత, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి.

ప్రముఖ పాత్రికేయురాలి హత్య కేసులో ఇప్పటికీ విచారణ ఎదుర్కుంటూ నిన్నగాక మొన్న బెయిల్ పై బయటికొచ్చిన వ్యక్తికి పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రతిపక్షాలు నినదించాయి. నేరచరిత్ర ఉన్న వ్యక్తికి పార్టీ పదవులు ఇవ్వడం అంటే.. అది న్యాయాన్ని, న్యాయ స్థానాలను గౌరవించకపోవడమే అవుతుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ప్రతిపక్షాల నుండి వస్తోన్న ఆరోపణలు, విమర్శలు చూసి ఏక్ నాథ్ షిండే అప్రమత్తమయ్యారు. వెంటనే జల్నా జిల్లాలో శ్రీకాంత్ పంగార్కర్ కి అప్పగించిన శివసేన పార్టీ ఎన్నికల ప్రచారం బాధ్యతలను ఉపసంహరించుకుంది. ఈమేరకు తాజాగా శివసేన పార్టీ నుండి ఒక ప్రకటన కూడా వెలువడింది.

ఇంతకీ గౌరీ లంకేష్ మర్డర్‌కు, శ్రీకాంత్ పంగార్కర్‌కు ఏం సంబంధం?

2017 సెప్టెంబర్ 5న బెంగళూరులో తన ఇంటి ఎదుటే గౌరి లంకేష్ మర్డర్ జరిగింది. హత్యకు గురైన గౌరి లంకేష్ సీనియర్ జర్నలిస్ట్ కావడంతో అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 18 మంది హిందుత్వ వాదులు ఈ హత్యలో పాల్పంచుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అందులో అమోల్ కాలె ప్రధాన నిందితుడిగా బెంగళూరు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

ఇదే కేసులో మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన శ్రీకాంత్ పంగార్కర్‌ని కూడా బెంగళూరు పోలీసులు 2018 ఆగస్టులో అదుపులోకి తీసుకున్నారు. గౌరి లంకేష్ మర్డర్ జరగడానికి ముందు, ఆ తరువాత ఆ హత్యలో పాల్పంచుకున్న వారికి, ఆ హత్యతో సంబంధం ఉన్న వారు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి అనే విషయంలో శ్రీకాంత్ పంగార్కర్ వారికి న్యాయపరమైన సలహాలు ఇచ్చారనేది బెంగళూరు పోలీసుల వాదన. ఈ మేరకు పంగార్కర్ పై బెంగళూరు పోలీసులు చార్జ్ షీట్ నమోదు చేశారు.

గౌరి లంకేష్ మర్డర్ కేసులో అప్పటి నుండి పంగార్కర్ జైలులోనే ఉన్నారు. 2024 సెప్టెంబర్ నెలలోనే బెయిల్‌పై విడుదలై బయటికొచ్చారు. శ్రీకాంత్ పంగార్కర్ తండ్రి జల్నాలో బీజేపి నేత. 1996 నుండి పంగార్కర్ శివసేన పార్టీతో కలిసి పనిచేస్తున్నారు. ఆ తరువాత 2011 లో బీజేపి అనుబంధ సంస్థ అయినటువంటి హిందూ జనజాగృతి సమితిలో చేరారు. జల్నా అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ రాజకీయంగా మంచి పరిచయాలున్నాయి. అందుకే శివసేన పార్టీలో చేరడంతోనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆయనకు ఆ నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ ఎన్నికల ప్రచారం బాధ్యతలు అప్పగించారు. కానీ ప్రతిపక్షాల నుండి నిరసన వ్యక్తమవడంతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

ఇదే కేసులో శ్రీకాంత్ పంగార్కర్‌తో పాటే విచారణ ఎదుర్కుంటున్న పరశురామ్ వాఘ్మోరె, సహ నిందితుడు మనోహర్ యద్వె కూడా జైలు నుండి బెయిల్‌పై బయటికొచ్చారు. గౌరి లంకేష్‌ని షూట్ చేసి చంపిన నిందితుడిగా పరశురామ్ అభియోగాలు ఎదుర్కుంటున్నారు. పరశురామ్, మనోహర్ జైలు నుండి బయటికొచ్చిన అనంతరం అక్టోబర్ 11న విజయపురలో సంఘ్ పరివార్, శ్రీరామ్ సేన సంఘాల నేతలు వారికి సన్మానం చేసినట్లుగా ది న్యూస్ మినిట్ ప్రచురించిన ఒక కథనంలో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories