G20 Summit: ఢిల్లీలో జరిగిన జీ 20 ఫస్ట్ డే సమ్మిట్

G20 First Day Summit Held In Delhi
x

G20 Summit: ఢిల్లీలో జరిగిన జీ 20 ఫస్ట్ డే సమ్మిట్

Highlights

G20 Summit: డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరేలా కృషి చేసిన బృందం

G20 Summit: దేశ రాజధాని ఢిల్లీలో అట్టహాసంగా జీ-20 సదస్సు మొదటి రోజు సమావేశం జరిగింది. 20 దేశాల నాయకులకు ప్రధాని మోడీ స్వాగతం పలికి ఆహ్వానించారు. ఆయా దేశాల నేతలకు మోడీ ఘన స్వాగతం పలికారు. భారత మండపంలోని స్వాగత వేదిక వద్ద ఒడిషాకు చెందిన కోణార్క్‌ చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోణార్క్‌ చక్రం భ్రమణ చలనం, సమయంతో పాటు నిరంతర మార్పులను దేశాధినేతలు ఆసక్తిగా తిలకించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని కిషిదా, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, దక్షిణాప్రికా అధ్యక్షుడు రామపోసా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా 20 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. జీ-20 సదస్సును ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. సదస్సు ప్రారంభానికి ముందు మొరాకో భూకంపం విచారం వ్యక్తం చేశారు ప్రధాని. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. భారత్ మొరాకొ దేశానికి అండగా ఉంటుందని తెలిపారు.

తన ప్రసంగం సందర్భంగా జీ 20 దేశాలు ఐక్యంగా పని చేయాలని ప్రధాని మోడీ కోరారు. పాత సవాళ్లు మన నుంచి కొత్త సమాధానాలు కోరుతున్నాయన్న ప్రధాని.. అందుకోసం హ్యూమన్‌ సెంట్రిక్‌ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొవిడ్‌ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందన్న ప్రధాని... యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందన్నారు. ఈ అపనమ్మకాన్ని జయించేందుకు.. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రం మార్గదర్శిగా ఉంటుందన్నారు.

ఇక జీ20లో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. నేడు భారత్‌ మండపంలో జరిగిన వన్‌ ఎర్త్‌ సెషన్‌ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.

భారత్‌ ప్రతిపాదించిన ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వాన్ని సభ్యదేశాలన్నీ అంగీకరించడం కీలక పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. 55కు పైగా దేశాలు, సుమారు 130 కోట్ల జనాభా కలిగిన ఏయూ ఇందులో చేరడంతో జీ20 కూటమి ప్రపంచానికి మరింత దగ్గరైనట్లైంది. ఈ ప్రాంతంలో 2050 నాటికి జనాభా రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. జీ20 కూటమిలో ఇప్పటి వరకు ఏయూ నుంచి కేవలం ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే సభ్యదేశంగా ఉంది. కానీ, ఇప్పుడు భారత్‌ చొరవ, సభ్యదేశాల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌ శాశ్వత సభ్యత్వాన్ని పొందడం, శక్తిమంతమైన జీ20లో చేరడం వల్ల అటు ఆఫ్రికా యూనియన్‌కు, ఇటు కూటమికి పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి.

అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోడీ ద్వైపాక్షి చర్చలు జరిపారు. భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు ఇరువురు సంయుక్తంగా ప్రకటించారు. దాదాపు 50 నిమిషాలకు పైగా జరిగిన ఈ భేటీలో ఇరువురు అగ్రనేతలు కీలకమైన అంశాలపై చర్చించి పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు ఖరారు చేశారు. తరువాత బ్రిటన్‌, జపాన్‌ ప్రధానులతో మోడీ ద్వైపాక్షి చర్చలు జరిపారు. జీ20 సదస్సు సైడ్‌లైన్స్‌లో భాగంగా ప్రధాని మోడీ అగ్రదేశాధినేతలతో భేటీలు కొనసాగిస్తున్నారు.

నేడు తొలి సెషన్‌ వన్‌ఎర్త్‌లో భాగంగా జరిగిన చర్చలు నిర్మాణాత్మంగా జరిగాయి. ఇక ఈ సెషన్‌ సైడలైన్స్‌లో భాగంగా ప్రధాని మోడీ, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వ్యాపార బంధం బలోపేతం, భారత్‌లో పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి అంశాలపై మాట్లాడుకొన్నారు. సుసంపన్న, సుస్థిర ప్రపంచం కోసం కలిసి భవిష్యత్తులో కూడా పని చేయడం కొనసాగించాలని నిర్ణయించారు. భారత్‌తో కీలకమైన వాణిజ్య ఒప్పందంపై గత కొన్నేళ్లుగా బ్రిటన్‌ చర్చలు జరుపుతోంది. ఇక జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాతో కూడా ప్రధాని ద్వేపాక్షిక చర్చలను జరిపారు. ఈ సందర్భంగా వాణిజ్యం ఇతర రంగాల్లో సహకరించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

అంతేకాదు... జీ20 సదస్సులో మరో కీలక పరిణామం చోటు చేసుకొంది. సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం పొందింది. సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని భారత్‌ సాధించింది. ప్రధాని మోడీ ఈ అంశాన్ని జీ20 వేదికగా వెల్లడించారు. డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరేలా కృషి చేసిన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనక పని చేసిన జీ20 షేర్పా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌లో జరుగుతున్న జీ20 సదస్సులో తీర్మానం రూపొందించడంలో ప్రధాన అడ్డంకిగా నిలిచిన అంశం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం. తాజాగా భారత్‌ దౌత్య బృందం ఈ అడ్డంకిని అధిగమించి డిక్లరేషన్‌కు మార్గం సుగమం చేసింది. అన్ని దేశాలు ఆమోదించే అంశాలను ప్రస్తావిస్తూ డిక్లరేషన్‌ను ఓకే చేయించారు. దాదాపు 37 పేజీలతో రూపొందించిన ఈ తీర్మానంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నాలుగు సార్లు ప్రస్తావించారు. ముఖ్యంగా అణు బెదిరింపులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్న అంశంపై అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories