Free ration Distribution: రేపట్నుంచి ఉచిత రేషన్ సరుకులు

Free ration Distribution: రేపట్నుంచి ఉచిత రేషన్ సరుకులు
x
Highlights

Free ration Distribution: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్ సరుకులు రేపట్నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

Free ration in Andhra Pradesh: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్ సరుకులు రేపట్నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రేషన్ ఇతర సరుకులు డిపోలకు చేరాయి. అయితే వీటిని నిర్ణీత ధరకు అమ్మకం చేయాలని తొలుత భావించినా, కేంద్ర ప్రకటనతో ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పేదలకు ఈ నెల కూడా రేషన్‌ ఉచితంగానే అందనుంది.

లాక్‌డౌన్‌ సమయంలో పేద కుటుంబాలకు ఉచిత రేషన్‌ ఇవ్వాలన్న ప్రధాని మోదీ ప్రకటనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల నుంచి నగదుకే సరుకులు ఇవ్వాలని తొలుత భావించినప్పటికీ ఇప్పుడు వెనక్కి తగ్గింది. బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇచ్చినా, పంచదార నగదుకే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఒక్కో కార్డుకు అరకిలో పంచదార రూ.పది చొప్పున ఇస్తున్నారు. ఈ నెల నుంచి పెంచిన ధరల ప్రకారం కార్డుదారులు రూ.17 చెల్లించాల్సి ఉంటుంది. కందిపప్పు ధర కూడా పెంచినా ఈ నెల వరకు ఉచితంగానే ఇవ్వనున్నారు.

ఇదిలా ఉండగా, ఇప్పటికే ఆరు విడతలు ఉచితంగా ఇవ్వడంతో రాష్ట్రంలో బియ్యం కొరత ఏర్పడిందని, అందువల్ల కేంద్రం తన నిల్వల నుంచి రాష్ర్టానికి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. శుక్రవారం అన్ని రాష్ర్టాల పౌరసరఫరాల అధికారులతో కేంద్రం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో ఉచిత పంపిణీపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

పేదలకు ఉపశమనం

కరోనా కష్టకాలంలో ఉపాధి లేక పేదలు అవస్థలు పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పుపై కిలోకు రూ.27, పంచదారపై కిలోకు రూ.14 చొప్పున ధరలు పెంచింది. మరో మూడురోజుల్లో రేషన్‌ పంపిణీ చేయాల్సి ఉండగా, ఉచిత రేషన్‌పై ప్రధాని ప్రకటన పేదలకు ఉపశమనం కలిగించింది. అయితే ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఆర్థిక భారంగా మారింది. ఉచితంగా సరుకులు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.2వేల కోట్ల భారం పడుతోంది. 'అందరికీ ఉచితం' అని కేంద్రం చెప్పినా రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం పరిధిలో ఉన్న 60శాతం కార్డులకే కేంద్ర రాయితీ వర్తిస్తుంది. మిగిలిన 40శాతం కార్డులకు రాష్ట్రమే పూర్తిగా రాయితీ భరించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories