ఐదో రోజుకు చేరుకున్న రైతుల ఆందోళన

ఐదో రోజుకు చేరుకున్న రైతుల ఆందోళన
x
Highlights

* ఢిల్లీ శివారులో కొనసాగుతోన్న నిరసనలు * వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ * బురారీ గ్రౌండ్‌కు వెళ్లాలని రైతులను కోరిన పోలీసులు * గ్రౌండ్‌కు వెళ్లేది లేదంటున్న రైతులు

అసలే ఢిల్లీ.. ఆ పై చలి కాలం. అదీ కూడా ఎముకలు కొరికే చలి. ఉదయం పది అయితే గానీ బయటకు వెళ్లలేనంత చలి. కానీ, అవేవీ వారిని అడ్డుకోలేదు. ఏమాత్రం లెక్క చేయలేదు. వారిదీ ఒక్కటే నినాదం. సమస్యల సాధన కోసం దేశ రాజధానిలో రైతన్నలు నడుం కట్టారు. బాష్పవాయువు, జలఫిరంగులు, కందకాలు వారిని అడ్డుకోలేదు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలని ఆందోళన కొనసాగిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళన ఐదో రోజుకు చేరుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘ, టిక్రి దగ్గర ఆందోళన చేస్తున్న రైతులు అక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించి కుర్చున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. బురారీ గ్రౌండ్‌కు వెళ్లాలని రైతులను పోలీసులు కోరారు. గ్రౌండ్‌ కు వెళ్లేది లేదంటూ అక్కడే ఆందోళనకు దిగారు రైతులు.

మరోవైపు చర్చలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో కొన్ని షరతులను కూడా కేంద్రం విధించడంతో. అన్నదాతలు మండిపడుతున్నారు. షరతులతో రైతులను అవమానిస్తున్నరన్నారు. సరిహద్దుల నుంచే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, హస్తినకు వెళ్లే ఐదు ప్రధాన మార్గాలను మూసివేస్తామని హెచ్చరించారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ టైర్లను తగులబెట్టారు. చలో ఢిల్లీ నిరసనల కోసం జంతర్‌మంతర్ మైదానాన్ని కేంద్రం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కేటాయించిన బురారీలోని సంత్ నిరంకారీ మైదానంలో శాంతియుత నిరసనలు చేపట్టాలని, ఉద్యమకారులు మైదానానికి చేరుకోగానే ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది.

మరోవైపు.. ఆదివారం మన్‌కీ బాత్‌ లో మోడీ మాట్లాడిన తీరుపై రైతు సంఘాల నేతలు భగ్గుమన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు కొత్త అవకాశాలను కల్పిస్తాయని మోడీ చెప్పారు. వేలాది రైతులు చలిని సైతం లెక్క చేయకుండా నిరసనలు చేస్తుంటే. దానిపై స్పందించకుండా. వారికి నష్టం కలిగించేలా ఉన్న చట్టాలను ప్రధాని వెనుకేసుకురావడాన్ని రైతులు విమర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories