హస్తిన గుండెల్లో గుబులు..ఇంతకీ ఫిబ్రవరి ఆరున ఏం జరగబోతోంది?
ఫిబ్రవరి 6. నార్మల్‌గానైతే నెలలో ఒకరోజు. కానీ ఈసారి ఈ తేదీకి ఓ స్పెషాలిటీ ఉంది. అదే చక్కాజామ్. హస్తిన గుండెల్లో నిప్పులు రాజేస్తున్న అన్నదాతలు......
ఫిబ్రవరి 6. నార్మల్‌గానైతే నెలలో ఒకరోజు. కానీ ఈసారి ఈ తేదీకి ఓ స్పెషాలిటీ ఉంది. అదే చక్కాజామ్. హస్తిన గుండెల్లో నిప్పులు రాజేస్తున్న అన్నదాతలు... ఫిబ్రవరి 6న దేశాన్ని అష్టదిగ్బంధనం చేస్తామంటున్నారు. సరిహద్దుల్లో శత్రుమూకల నుంచి ఎలా రక్షించుకుంటామో... తమను అలా అణచి వేయాలని చూస్తున్నారంటూ రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. గణతంత్రం రోజున ప్రజ్వరిల్లిన ఆందోళనను మించిన ఆందోళన చక్కాజామ్ క్రియేట్ చేయబోతోందా? వందలు, వేలు, లక్షలుగా రైతాంగం మూకుమ్మడిగా దాడి చేయబోతోందా? ఫిబ్రవరి 6న దేశంలో మరీ ముఖ్యంగా ఢిల్లీలో అసలేం జరగబోతోంది?
ఫిబ్రవరి 6, చక్కాజామ్..హస్తిన గుండెల్లో గుబులు..పాలకుల వెన్నులో వణుకు.. అష్టదిగ్బంధనం తప్పదా? జనవరి 26న కంటే ఎక్కువా? అసలేంటీ చక్కాజామ్? మొన్న రిపబ్లిక్ డే రోజు, దేశ రాజధానిలో ఏం జరిగిందో, ప్రపంచమంతా చూసింది. రైతుల ఆందోళన అలజడి రేపింది. లాఠీలు విరిగాయి. కర్షకుల వీపులు పగిలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. నిరసనాగ్ని ఎగసిపడింది. ఎర్రకోటపై కర్షక జెండా ఎగిరింది. పోలీసుల వైఫల్యమంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
సేమ్ సీన్ ఫిబ్రవరి 6న రిపీట్ అవుతుందంటున్నారు రైతులు. నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన....కొత్త వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా కొనసాగుతున్న అన్నదాతల నిరసనోద్యమంలో తామేంటో చూపిస్తామంటున్నారు. దీంతో ఫిబ్రవరి 6... చక్కాజామ్‌ను అడ్డుకునేందుకు, రైతు ఉద్యమకారులను నిలువరించేందుకు ఢిల్లీ సరిహద్దులో మేకులు, పెద్ద ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు రహదారి మధ్యలో కాంక్రీట్పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులను అమర్చారు. అడుగేస్తే చాలు....మేకు దిగబడిపోతుంది. అక్కడితో ఆగలేదు పోలీసులు....మూడో ప్రపంచ యుద్ధానికి సన్నద్దమైన సైనికుల్లా....తమ చేతివేళ్లకు రక్షణగా ఓ స్టీల్ కవచాన్ని, మరో చేతికి డాలును పోలిన తొడుగును ధరించారు.
అసలెందుకీ పకడ్బందీ రక్షణ వ్యూహం? ఇంతకీ ఫిబ్రవరి ఆరున ఏం జరగబోతోంది? జనవరి 26ను తలపిస్తుందా? దద్దరిల్లేది ఢిల్లీయా... దేశమా? ఫిబ్రవరి 6 ప్రకంపనలు ఎలా ఉంటాయ్? అన్నదాతల నిరసనాగ్ని ఎగసిపడుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ను బంద్ చేయడం, రైతులపై అధికారుల వేధింపులకు నిరసనగా ఈ నెల 6వ తేదీన చక్కా జామ్ చేపడతామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలను మూడు గంటలపాటు అంటే, మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు అడ్డుకుంటామన్నారు. అంతేకాదు, రైతులు ఢిల్లీలోకి దూసుకొస్తారని అనుమానిస్తున్న పోలీసులు, సింఘు వద్ద హైవేపై బారికేడ్లు, ఇనుప కంచెలు, సిమెంట్ నిర్మాణాలు చేస్తోంది. అందుకే ఫిబ్రవరి 6న అలజడి రేపుతోంది.
చక్కాజామ్ అంటే రాస్తారోకో, రహదారుల దిగ్భంధం..ఫిబ్రవరి 6వ తేదీన జరగబోతోంది ఇదే!! మధ్యాహ్నం 12 నుంచి మూడు దాకా బైఠాయింపు. ఢిల్లీ లోపలకి దూసుకొస్తారా... దడ పుట్టిస్తారా? ఇంతకీ ఫిబ్రవరి 6 టెన్షన్ ఏంటసలు? కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి జరిగిన కేటాయింపులతో తమకు సంబంధం లేదని, తాము కోరుకుంటున్నది సాగు చట్టాల రద్దేనంటున్నారు రైతు నేతలు. ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో బడ్జెట్ విషయాల గురించి తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదని, తాము ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఉద్యమాన్ని నిరంకుశంగా అణచి వేయాలని అనుకుంటున్న ప్రభుత్వ తీరుకు నిరసన తెలపడమే కాకుండా, కేంద్రం దిగివచ్చేలా ఈనెల 6న చక్కాజామ్‌కు పిలుపునిచ్చామన్నారు రైతు నేతలు.
ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జనవరి 26న ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో, చక్కాజామ్‌ను కట్టడి చేసేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసనలు కొనసాగుతున్న సింఘు వద్ద హైవేపై రెండు వరుసల సిమెంట్ బారియర్ల మధ్యన ఇనుపరాడ్లను అమర్చి, కాంక్రీట్‌తో నింపుతున్నారు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు బారికేడ్లను నిర్మించారు. వీటితోపాటు ఆందోళనకారులు హద్దులు దాటి రాకుండా ముళ్లకంచెను కూడా ఏర్పాటు చేశారు.
ఇలా ఫిబ్రవరి 6 ఉద్రిక్తత పెంచుతోంది. గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ఆందోళనలో హింస చోటుచేసుకోవడంతో, రాస్తారోకోను ఎలాగైనా నిలువరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు చక్కా జామ్‌ను విజయవంతం చేసేందుకు, దేశవ్యాప్తంగా రైతులు సిద్దమవుతున్నారు. సింఘు రహదారిని దాటుకుని, రైతులు మరింత ముందుకుపోతే ఢిల్లీ రణరంగమేనని భావిస్తున్న పోలీసులు, ఎలాగైనా వారిని అక్కడే అడ్డుకోవాలని కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి చక్కా బంద్....టెన్షన్ క్రియేట్ చేస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire