పంతం నెగ్గించుకున్న రైతులు.. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం

పంతం నెగ్గించుకున్న రైతులు.. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
x
Highlights

పంజాబ్, హర్యానా రైతులు ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకున్నారు. తమ పట్టుదలతో కేంద్రం దిగొచ్చేలా చేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా హర్యానా, పంజాబ్ రైతాంగం...

పంజాబ్, హర్యానా రైతులు ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకున్నారు. తమ పట్టుదలతో కేంద్రం దిగొచ్చేలా చేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా హర్యానా, పంజాబ్ రైతాంగం చేపట్టిన ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం తలవంచింది. ఛలో ఢిల్లీ పిలుపుతో కేంద్రాన్ని వణికించిన రైతులు దేశ రాజధానిలో నిరసనలు తెలపాలన్న తమ పంతాన్ని నెగ్గించుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ రైతాంగం ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. ఛలో ఢిల్లీ పిలుపుతో రెండు రాష్ట్రాల్లోని రైతులు పెద్దఎత్తున ఢిల్లీ వైపు కదం తొక్కారు. ట్రాక్టర్లతో ఢిల్లీ నలుమూలలను చుట్టుముట్టారు. అయితే, రైతులను ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అణచివేసింది కేంద్రం. హైవేలను దిగ్బంధించి బారికేడ్లు, ముళ్ల కంచెలతో రైతులను అడ్డుకుంది. దేశ రాజధానిలోకి రైతులు అడుగుపెట్టకుండా ఢిల్లీ సరిహద్దుల్ని సైతం మూసివేసింది. అయినా, రైతులు వెనక్కి తగ్గకపోవడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించి వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో, ఢిల్లీ సరిహద్దులు రణరంగాన్ని తలపించాయి. ఓవైపు పోలీసు బందోబస్తు మరోవైపు రైతు నిరసనలతో ఢిల్లీ సరిహద్దులు దద్దరిల్లిపోయాయి. బారికేడ్లను, ముళ్ల కంచెలను సైతం దాటుకుని ఢిల్లీ వైపు రైతులు కదం తొక్కడంతో ఢిల్లీ-హర్యానా, ఢిల్లీ-పంజాబ్ బోర్డర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

నిన్నటి నుంచి ఏకధాటిగా రైతులు తమ ఆందోళనలు కొనసాగించడంతో కేంద్రం ప్రభుత్వం దిగొచ్చింది. ఢిల్లీలో నిరసనలు తెలిపేందుకు రైతులకు కేంద్రం అనుమతిచ్చింది. పోలీస్ పహారాలో మధ్య ఢిల్లీలోకి రైతులను అనుమతించిన కేంద్రం నిరంకారీ గ్రౌండ్స్‌లో ధర్నా చేసుకోవచ్చని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories