TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు

Expulsion Against TMC MP Mahua Moitra
x

TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు

Highlights

TMC MP Expulsion: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారని.. మహువాపై ఆరోపణలు

TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. మహువా మొయిత్రా లోక్ సభ సభ‌్యత్వం రద్దు అయ్యింది. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారని మహువాపై ఆరోపణలు వెల్లువెత్తడంతో విచారణ జరిపి ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికతో లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌ నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ జరిపి ఓటింగ్‌ నిర్వహించారు. ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించడంతో మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

మహువాపై వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమెను బహిష్కరించాలని డిమాంండ్‌ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీర్మానాన్ని పెట్టారు. అయితే, ఈ తీర్మానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయమివ్వాలని, నివేదికపై ఓటింగ్‌కు ముందు సభలో చర్చ జరపాలని టీఎంసీ సహా పలువురు విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు.

ఈ క్రమంలోనే నివేదికపై కొంతసేపు చర్చించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతినిచ్చారు. దీంతో సభలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. అయితే, ఈ చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహువా కోరగా.. సభాపతి అందుకు నిరాకరించారు. అనంతరం మూజువాణీ ఓటింగ్‌ ద్వారా.. ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించింది. అనంతరం మహువాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌.. సభను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. ఓటింగ్‌ సమయంలో విపక్షాలు వాకౌట్‌ చేశాయి.

తన బహిష్కరణను మహువా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎథిక్స్‌ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించింది. మమ్మల్ని అణగదొక్కేందుకు ఈ కమిటీని ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలను నమ్మి తనను దోషిగా నిర్ధారించారని మహువా ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మా ఇంటికి సీబీఐని పంపించి నన్ను వేధిస్తారేమో’’ అని మహువా మండిపడ్డారు.

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, ఆమె పార్లమెంట్ లాగిన్‌ వివరాలను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది జై అనంత్‌ దెహద్రాయ్‌ ను కమిటీ విచారించింది. అనంతరం 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్‌ కమిటీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది. దీంతో స్పీకర్‌.. ఆమెపై వేటు వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories