Corona: దేశంలో విజృంభిస్తున్న కరోనా

Expanding the Coronavirus In India
x

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: చాపకింద నీరులా కరోనా సెకండ్‌వేవ్‌ * గతంతో పోలిస్తే వేగంగా వైరస్‌ వ్యాప్తి

Corona: తోక ముడిచినట్లే కనిపించిన కరోనా మళ్లీ కొమ్ము విసురుతోంది.. వెనక్కి తగ్గినట్లే తగ్గి మెరుపు వేగంతో విరుచుకుపడుతోంది.. మహారాష్ట్రలో మొదలైన సెకండ్‌ వేవ్‌ దేశమంతా కమ్ముకుంటోంది.. పంజాబ్‌లో పడగ విప్పింది ఛత్తీస్‌గఢ్‌ను వణికిస్తోంది. కర్ణాటకను కుదిపేసేలా ఉంది.. తమిళనాడును బెంబేలెత్తిస్తోంది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రతాపం చూపుతోంది. దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులో లక్షకుపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తగ్గినట్లే తగ్గుతూ కొత్త కోరలు తొడుక్కుంటున్న మహమ్మారి, యావత్‌ మానవాళికే పెనుసవాలు విసురుతోంది. ఈ స్థాయిలో వైరస్‌ ప్రకోపం అమెరికా తరవాత ఇండియాలోనే ఉంది. దేశంలో కరోనా మహమ్మారి గతంలో కంటే మరింత తీవ్రతతో వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని సెకండ్‌ వేవ్‌ కట్టడిలో ప్రజా భాగస్వామ్యమే ముఖ్యమని తెలిపింది. దేశంలో మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీ్‌సగఢ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని, జనాభా, విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలైన ఛత్తీ్‌సగఢ్‌, పంజాబ్‌లలో మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. కేసులు అధికంగా నమోదవుతూ, మరణాలు అధికంగా ఉన్న కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రకు 50 అత్యున్నత బృందాలను పంపినట్లు అధికారులు వివరించారు.

మహారాష్ట్ర, పంజాబ్‌, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌లలో సింహభాగం కేసులు వెలుగు చూస్తున్నా- మిగిలిన రాష్ట్రాల్లోనూ ఆందోళనకర స్థితిగతులే నెలకొన్నాయి. లాక్‌డౌన్లకన్నా విస్తృత పరీక్షలు, టీకాలు, మాస్కులు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రతలకే నిపుణులు ఓటేస్తున్నారు. కొవిడ్‌ వ్యాప్తికి ఎక్కడికక్కడ తూట్లు పొడిచేలా ప్రభుత్వాల కార్యాచరణ మరింతగా పదును పెట్టాలని సూచిస్తున్నారు. కరోనా రెక్కలు విరిచేందుకు నిరుడు విధించిన లాక్‌డౌన్‌ వల్ల అన్నిరంగాలు చతికిలపడి దేశ అర్థిక వ్యవస్థ కుదేలైంది. అసంఖ్యాక శ్రమజీవుల బతుకులు తలకిందులయ్యాయి. అందుకే మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టకుండా ఉండాలంటే రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే పరిస్థితులు చేయిదాటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories