ఉత్కంఠ రేపుతున్న మధ్య ప్రదేశ్ పాలిటిక్స్!

ఉత్కంఠ రేపుతున్న మధ్య ప్రదేశ్ పాలిటిక్స్!
x
Highlights

టెన్షన్.. ఎప్పుడూ లేని టెన్షన్. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? సర్కార్ మారుతుందా? శివరాజ్ సింగ్ చౌహాన్ ఉంటాడా.. దిగి పోతాడా? కమల్ నాధ్ మళ్ళీ చక్రం తిప్పుతాడా? సీన్ ఎలా ఉండబోతోంది.

టెన్షన్.. ఎప్పుడూ లేని టెన్షన్. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? సర్కార్ మారుతుందా? శివరాజ్ సింగ్ చౌహాన్ ఉంటాడా.. దిగి పోతాడా? కమల్ నాధ్ మళ్ళీ చక్రం తిప్పుతాడా? సీన్ ఎలా ఉండబోతోంది. చిత్రం ఎలా మారబోతోంది? ఇదే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో జోరుగా సాగుతున్న చర్చలు.

ఎంత మోడీ మానియా వున్నా .. అక్కడ మాత్రం కాంగ్రెస్ దూసుకు వచ్చింది. అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజారిటీకి.. కొద్ది దూరంలో ఆగిపోయినా స్వతంత్రుల అండతో గట్టెక్కింది. కమల్ నాధ్ సారధ్యంలో పాలనా పగ్గాలు చేపట్టింది. అయితే పట్టుమని పది నెలలు కూడా కాక ముందే ముసలం మొదలైంది. అధికారం కోసం కీచులాటలు తారాస్ధాయికి చేరాయి. జ్యోతిరాదిత్య రూపంలో వచ్చిన గండంతో చివరికి ఒక్కసారిగా కమల్ నాధ్ సర్కార్ కుప్ప కూలి పోయింది. కాలం కాషాయ నేతలకు కలిసొచ్చింది. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఆయారాం - గయారాం అంటూ గోడలు దూకిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాధ్ సర్కార్ మైనారిటీలో పడిపోయింది. ఆ పరిణామాలన్నింటి వెనుక చకచకా పావులు కదిపి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. సీఎం పీఠంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ను కూర్చోబెట్టింది. 25 మంది శాసన సభ్యుల రాజీనామాలతో ఉప ఎన్నికలొచ్చాయి. అయితే మూడు నియోజకవర్గాలకు ఇతర కారణాలతో ఉప ఎన్నికలు నిర్వహించారు. దీంతో మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. అక్కడ ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. మళ్ళీ పీఠం కదులుతుందా?.. శివరాజ్ సింగ్ చౌహన్ సర్కార్ కు ముప్పొచ్చి పడుతుందా? కాంగ్రెస్ మళ్ళీ చక్రం తిప్పుతుందా? మధ్యప్రదేశ్ లో పొలిటికల్ సీన్ ఎలా మారబోతోంది? ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

కమల్ నాధ్... కాంగ్రెస్ లో పాత తరం నేత. గాంధీలకు వీర విధేయునిగా పేరు. మొత్తం 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 116 స్ధానాల్లో విజయం సాధించాల్సి ఉంది. అయితే .. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం 114 స్ధానాలు రాగా.. బిజేపికి 109 సీట్లు దక్కాయి, దీంతో ఇద్దరికీ సరైన మెజారిటీ లేదు. కానీ.. ఇక్కడే కమల్ నాధ్ తన తెలివికి పదును పెట్టాడు. స్వతంత్రుల అండతో అధికారాన్ని ఏర్పాటు చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా .. కాంగ్రెస్ పార్టీ కమల్ నాధ్ నే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. తన చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్టించాడు. ఆ తర్వాత చింద్వారా స్ధానం నుండి విజయం సాధించినా .. సీఎం పదవి మాత్రం మూణ్ణాళ్ళ ముచ్చటే అయ్యింది.

కమల్ నాధ్ పట్ల అధిష్టానం చూపిన ప్రేమను యువ నాయకత్వం జీర్ణించుకోలేక పోయింది. గ్వాలియర్ సంస్ధానం వారసుడు, కాంగ్రెస్ లో మంచి పట్టున్న నేతగా ఎదిగిన జ్యోతిరాదిత్య సింధియా వల్ల అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతూ వచ్చాయి. ముఖ్యమంత్రి పీఠంపై అనేక ఆశలు పెట్టుకున్న సింధియా .. ఆ పదవి కమల్ నాధ్ కు దక్కేసరికి తట్టుకోలేక పోయాడు. అంతే .. తనదైన రీతిలో పావులు కదిపాడు. 17 మంది శాసన సభ్యులతో రిసార్ట్స్ రాజకీయాలకు తెరలేపాడు. ఒక్కసారిగా 17 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆరుగురు మంత్రులు కూడా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్ నాధ్ కు చుక్కలు కనిపించాయి. మెజారిటీ కోల్పోవడంతో పదవి కూడా పోయింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అంతా జ్యోతిరాదిత్య అనుయాయులుగా ముద్ర పడ్డ వారే. ఇలా మొత్తం 25 మంది రాజీనామాలే చేయడం.. వారందిరినీ బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో ఉన్న బలంతో బిజేపీ అధికారంలోకి వచ్చింది.

ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగిన 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రాజీనామా చేసి .. బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇచ్చి ఆ పార్టీ పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు వీరంతా గెలిస్తే ఓకే. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి ఉండదు. కానీ కాంగ్రెస్ గెలిస్తే .. పరిస్ధితి ఏంటి ? తిరిగి కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుందా? కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా 27 నియోజకవర్గాల్లో గెలవాల్సిందే. అదే బిజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం 10 స్ధానాల్లో విజయం సాధిస్తే చాలు. దీనిబట్టి చూస్తే ఇక మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కార్ కు వచ్చే ముప్పేమీ లేదని భావించాలి. కేవలం 10 స్ధానాలను దక్కించుకోవడం బీజేపీకి పెద్ద కష్టం కూడా కాదు. మరి ఫలితాలు ఎలా ఉండబోతాయో.. ఓటర్ల నాడి ఎలా వుందో వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories