5 States Election: మినీ సంగ్రామానికి సర్వం సిద్ధం

Elections Will be Starting Soon in Tamilnadu Bengal And Assam
x

Representational Image

Highlights

5 States Election: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నేడు పోలింగ్ * కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్

5 States Election: దేశంలో మినీసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్ జరగనుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌, అసోంలలో ఎన్నికల పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. బెంగాల్‌, అసోంలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని మలప్పురం లోక్‌సభ నియోజకవర్గాలకూ నేడు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.

తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం ఆరు కోట్ల 62 లక్షల 70 వేల మంది ఓటర్లు ఉండగా 88 వేల 937 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు లక్షా 58వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్‌ బూత్‌ చొప్పున ఏర్పాటు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో కమల్‌హాసన్‌, దినకరన్‌ నేతృత్వంలోని కూటములు ఎంత మేర ప్రభావం చూపుతోందోనన్న ఆసక్తి నెలకొంది.

మరోవైపు, కేరళలో 140 స్థానాలకు కూడా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 957మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌తో పాటు బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. కేరళలో మొత్తం 2 కోట్ల 74 లక్షల మంది ఓటర్లు ఇవాల తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ 1980 నుంచి ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటములను అక్కడి జనం ప్రత్యామ్నాయంగా ఎన్నుకుంటూ వస్తున్నారు. అయితే మరోసారి సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కే అధికారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే నలభై ఏళ్ల రికార్డు బ్రేక్ అయినట్లే.

బెంగాల్‌లో మూడో దశ ఎన్నికలు 31 స్థానాల్లో జరగనున్నాయి. ఆయా స్థానాల్లో 205మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే జరిగిన రెండు దశల పోలింగ్‌లో అక్కడక్కడా ఘర్షణలు తలెత్తడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 618 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. 10 వేల 871 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 78 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2016లో ఈ 31 స్థానాల్లో 30 స్థానాలు టీఎంసీ గెలుచుకుంది.

అస్సాంలో ఇవాళ జరిగే మూడో దశ పోలింగ్‌తో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఆఖరి దశలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా 337మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో దశలో 79 లక్షల 19 వేల 641 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పుదుచ్చేరిలో 30 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 10 లక్షల 4 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories