Ayodhya: అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమ వివరాలు వెల్లడి

Details of Ayodhya Pran Pratishtha Program Revealed
x

Ayodhya: అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమ వివరాలు వెల్లడి

Highlights

Ayodhya: ఈనెల 22న అభిజిత్ లగ్నంలో విగ్రహ ప్రతిష్ట

Ayodhya: భరత భూమి పులకించే రోజు రానే వచ్చింది. కోదండ రామయ్య కొలువుదీరే సమయం అసన్నమైంది. వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత తను పుట్టిన సొంత గడ్డపై ఆశీనులు కాబోతున్నారు ఆ ఆనంద రాముడు. బాల రాముడి రూపంలో భక్తకోటికి దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. ప్రపంచ నలుమూలల ఉన్న కోట్లాది హిందువులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నఆ ఆధ్యా్త్మిక ఘట్టం మరికొన్ని గంటల్లో మన కళ్ల ముందు సాక్షాత్కారం కాబోతోంది. అయోధ్యలో మహాద్బుతంగా రూపుదిద్దుకున్న రామ మందిర్ ప్రారంభోత్సవ క్రతువు కన్నుల పండుగగా జరగబోతోంది. 22వరకు విగ్రహ ప్రాణప్రతిష్ట ఘట్టం న భూతో న భవిష్యత్ అన్నట్టుగా జరగబోతుంది. అయోధ్య వేద పండితుల నేతృత్వంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతిష్టాపన క్రతువులో ముఖ్యమైన ద్వాదశాధివాసాలు నిర్వహించనున్నారు .

అయోధ్య ప్రాణప్రతిష్ట క్రతువులు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. నిర్వహించే కార్యక్రమ వివరాలు వెల్లడించింది శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌. ఈనెల 22న అభిజిత్ లగ్నంలో.. అంటే మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం ముగియనుంది.

ఈనెల 18న గర్భగుడిలోకి రామ్‌లల్లా విగ్రహాన్ని తీసుకురానున్నారు. కర్ణాటక శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించిన విగ్రహాన్ని రామ మందిరంలో ప్రతిష్టించనున్నారు. రామ మందిర పరిసరాల్లో ప్రాయశ్చిత్త పూజలతో రేపు ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈనెల 17న రామ్‌లల్లా విగ్రహం పరిసర ప్రవేశం చేయనుంది. ఈనెల 18న సాయంత్రం తీర్థపూజ, జలయాత్ర, గంధాధివాసం నిర్వహిస్తారు.

ఈనెల 19న ఉదయం ఔషదాధివాసం, కేసరాధివాసం, ఘృతాధివాసం.. సాయంత్రం ధాన్యాధివాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈనెల 20న ఉదయం శర్కరాధివాసం, ఫలాధివాసం.. సాయంత్రం పుష్పాధివాసం కార్యక్రమాలు జరుగుతాయి. 21న ఉదయం మధ్యాధివాసం, సాయంత్రం శయ్యాధివాసం నిర్వహించడంతో అధివాస కార్యక్రమాలు పూర్తవుతాయి.

వారం రోజుల పాటు నిర్వహించే ప్రాణప్రతిష్ట క్రతువులో 121 మంది అర్చకుల బృందం పాల్గొంటుంది. కాశీ పండితులైన లక్ష్మీకాంత్ దీక్షిత్‌ ఈ అర్చక బృందానికి నాయకత్వం వహించనున్నారు. అర్చకుల సమన్వయకర్త గణేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈనెల 22న అయోధ్యలో జరిగే రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధాని మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ‌‌ మోహన్ భగవత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం ఆదిత్యనాథ్ హాజరవుతారు. వీరితో పాటు 150 మంది సాధువులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories