Delhi: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన ఎఫెక్ట్.. 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్

Delhi Coaching Center Incident Effect 13 Coaching Centers Seized
x

Delhi: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన ఎఫెక్ట్.. 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్

Highlights

Delhi: విద్యార్థులు మృతి చెందిన ఘటనపై మున్సిపాలిటీ చర్యలు

Delhi: ఢిల్లీలో సివిల్స్‌ శిక్షణ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ సివిల్స్ శిక్షణా కేంద్రం బేస్‌మేంట్‌లోకి వరద నీరు చేరడంతో అందులో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం కురిసిన వర్షానికి పశ్చిమ ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌ భవనం బేస్‌మెంట్ మొత్తం నీటి మునిగింది. అందులో విద్యార్థులు చిక్కుకున్నట్టు అగ్నిమాపక విభాగానికి రాత్రి 7గంటలా 20 నిమిషాలకు సమాచారం రావడంతో వారు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో నీటిని బయటకు పంపారు. అయితే, అప్పటికే నష్టం జరిగిపోయింది.

తొలుత ఇద్దరు యువతులు మృతదేహాలు లభ్యం కాగా.. శనివారం అర్ధరాత్రి తర్వాత ఓ యువకుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి పంపినట్టు సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఎం హర్షవర్దన్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ మంత్రి అతిషి.. అధికారులను నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీని వెనుక కుట్రకోణం, ఎవరైనా ఉన్నట్టు తేలితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.


ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై ఎంపీ స్వాతిమాలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఘటనా స్థలానికి వెళ్లి... విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించాలని భావించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. పలువురు విద్యార్థులు స్వాతిమాలివాల్‌ రాకపై మండిపడ్డారు. ఈ అంశానికి రాజకీయ రంగు పులుమొద్దని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. కాగా.. కొందరు విద్యార్థుల మద్దతుతో ఆమె అక్కడ బైఠాయించడంతో.. మిగతా విద్యార్థులు స్వాతిమాలివాల్‌ ‘గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. దాంతో అక్కడ గందరగోళం పరిస్థితి నెలకొంది. ఈ మరణాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినవి కావని, ఇది 'హత్యే'గానే భావించాలని స్వాతి మాలివాల్ అన్నారు. బాధ్యులైన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు.

మరో వైపు ఘటన తర్వాత ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేశారు. కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే స్థానిక కౌన్సిలరుకు తెలియజేశామన్నారు. వెంటనే స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌‌లు సంతాపం తెలిపారు. తాన్యా సోని కుటుంబ స్వస్థలం బిహార్‌లోని ఔరంగాబాద్‌ కాగా.. ఆమె తండ్రి విజయ్‌కుమార్‌ మంచిర్యాలలో సింగరేణి డీజీఎంగా పనిచేస్తున్నారు.


ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం, సురక్షితం కాని నిర్మాణాలకు సామాన్యులు మూల్యం చెల్లించుకుంటున్నారని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కోచింగ్‌ సెంటర్‌ ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం, అధికార యంత్రాంగాల నేరపూరిత నిర్లక్ష్యంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే విమర్శించారు. గత వారం పటేల్‌ నగర్‌లోనూ వర్షపునీటి కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ సివిల్స్‌ విద్యార్థి మృతిచెందినట్లు ఆయన గుర్తు చేశారు.

ఇది హృదయ విదారకమైన దుర్ఘటన అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్పందించారు. వర్షపునీటి సమస్యను స్థానికులు రాజేందర్‌నగర్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌ దృష్టికి రెండుసార్లు తీసుకువెళ్లినా ఆయన స్పందించలేదని, ముగ్గురు విద్యార్థుల మృతికి కేజ్రీవాల్‌ ప్రభుత్వమే కారణమని న్యూ దిల్లీ ఎంపీ బాంసురీ స్వరాజ్‌ ధ్వజమెత్తారు.

ఈ దుర్ఘటనపై పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆ సమయంలో కోచింగ్‌ సెంటర్‌ భవనం ముందు భారీగా చేరిన వరదనీటిలో నుంచి ఓ ఫోర్‌ వీలర్‌ వాహనం వేగంగా దూసుకుపోయిందని, బలంగా తాకిన నీటి అలల ధాటికి గేటు విరిగి వరదనీరు సెల్లార్‌లోకి ప్రవహించినట్లు ఓ వీడియో కథనం వెల్లడించింది. స్టడీ సర్కిల్‌ యజమాని అభిషేక్‌ గుప్తా, కోఆర్డినేటర్‌ దేశ్‌పాల్‌ సింగ్‌లను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై హత్యానేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ ఎం.హర్షవర్ధన్‌ వెల్లడించారు.

ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్‌ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందన్నారు. ప్రమాద సమయంలో 18 మందికి పైగా విద్యార్థులు అందులో ఉన్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తామని, సెల్లార్‌ నుంచి రాకపోకలకు ఉన్న సింగిల్‌ బయోమెట్రిక్‌ ద్వారం భారీగా వచ్చిన వర్షపునీటి కారణంగా ఆ సమయంలో పనిచేయలేదని వస్తున్న వార్తలపై విచారణ చేస్తామని తెలిపారు. ఆ సెల్లార్‌లో మురుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ కూడా లేదన్నారు. ఈ దుర్ఘటన తమను కలచివేసిందని, విచారణలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని రావూస్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.


మృతుల్లో ఒకరైన తాన్యా సోనిది మంచిర్యాల జిల్లా నస్పూర్‌. వీరి స్వస్థలం బీహార్‌. తాన్యా తండ్రి విజయ్‌కుమార్‌.. సీసీసీ నస్పూర్‌ బంగ్లాస్‌ ప్రాంతంలో నివాసముంటూ శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఎస్‌ఆర్‌పీ-1 గని మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. చదువులో చురుగ్గా ఉండే తాన్యాను డిగ్రీ పూర్తయిన వెంటనే సివిల్‌ సర్వీస్‌ చదివించడానికి ఢిల్లీకి పంపించారు. కాగా, తాన్యా కుటుంబం ఆమె చెల్లిని లక్నోలోని కళాశాలలో దించడానికి శనివారం సాయంత్రమే బయలుదేరింది. రైలులో నాగ్‌పూర్‌ వద్ద ఉండగా విజయ్‌కుమార్‌కు కూతురు మరణవార్త తెలిసింది. తాన్యా సోని మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు.

తమ కుమార్తె తాన్యా సోనీకి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సివిల్‌ సర్వెంటుగా సేవలు అందించాలనేది చిన్ననాటి కలగా ఆమె తండ్రి విజయ్‌కుమార్‌ తెలిపారు. దిల్లీలోనే రాజనీతిశాస్త్రంలో బీఏ పట్టా పొందిన తాన్యా నెల రోజుల కిందటే సివిల్స్‌ శిక్షణలో చేరిందన్నారు. తమ కుటుంబం రైలులో లఖ్‌నవూ వెళుతుండగా ఈ దుర్వార్త అందిందని... నాగ్‌పుర్‌లో రైలు దిగి విమానంలో దిల్లీకి చేరుకున్నామన్నారు. తాన్యా మృతదేహంతో ఇపుడు తమ స్వరాష్ట్రమైన బిహార్‌కు బయలుదేరామని విజయ్‌కుమార్‌ కన్నీటి పర్యంతమైయ్యారు.

ఈ ఘటనకు స్టడీ సర్కిల్‌ యాజమాన్యంతో పాటు అధికార యంత్రాంగమే కారణమని ఆరోపిస్తున్న వివిధ కోచింగ్‌ సెంటర్లకు చెందిన విద్యార్థులు ఘటన జరిగిన రావుస్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ముందు ఆందోళనకు దిగారు. నగరవ్యాప్తంగా ఉన్న అన్ని కోచింగ్‌ సెంటర్లలోనూ భద్రతా ఉల్లంఘనలు ఉన్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఘటన జరిగిన ప్రాంతంలో వరదనీరు నిలుస్తుండటంపై వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న కోచింగ్‌ సెంటర్లు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories