TOP 6 News @ 6PM: రైతు భరోసా విడుదలపై రేవంత్ రెడ్డి క్లారిటీ.. అప్పుల ఆరోపణలపై హరీష్ రావు కౌంటర్

TOP 6 News @ 6PM: రైతు భరోసా విడుదలపై రేవంత్ రెడ్డి క్లారిటీ.. అప్పుల ఆరోపణలపై హరీష్ రావు కౌంటర్
x
Highlights

1) Kakinada Port: కాకినాడ పోర్టు నుండి స్మగ్లింగ్.. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రెస్‌మీట్ AP Minister Nadendla Manohar press meet about PDS rice...

1) Kakinada Port: కాకినాడ పోర్టు నుండి స్మగ్లింగ్.. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రెస్‌మీట్

AP Minister Nadendla Manohar press meet about PDS rice smuggling at Kakinada Port: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ఐదేళ్లుగా ఒక స్మగ్లింగ్ మాఫియా దేశ భద్రతను కూడా లెక్క చేయకుండా తమ సొంత ప్రయోజనాల కోసం ఏం చేశారో అది కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగిందన్నారు.

ఏపీలో కోటి 48 లక్షల రేషన్ కార్డు హోల్డర్స్ కోసం సుమారు రూ. 12,800 కోట్ల వెచ్చించి మరీ బియ్యం, ఆహార ధాన్యాలు అందిస్తున్నాం. కానీ ఆ రేషన్ బియ్యాన్ని గత ఐదేళ్లుగా విదేశాలకు ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నాక తెనాలిలో పౌరసరఫరాల శాఖ గిడ్డంగుల్లో తనిఖీలు చేపట్టాం. అందులో అనేక అవకతవకలు గుర్తించాం. జూన్ 28న కాకినాడలో 13 గోడౌన్లలో తనిఖీలు జరిపాం. 51,427 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అందులో 25,386 మెట్రిక్ టన్నుల బియ్యం పౌర సరఫరాల శాఖ పంపిణి చేసే రేషన్ బియ్యమేనని గుర్తించడం జరిగిందన్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా ఈ పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ జరుగుతోందని మంత్రి తెలిపారు.

2) ఫేంజల్ తుపాన్ ప్రభావంతో దంచికొడుతున్న భారీ వర్షాలు

Cyclone Fengal News Updates: బంగాళాఖాతంలో అలజడి సృష్టించిన ఫేంజల్ తుపాను శనివారం అర్ధరాత్రి దాటాక తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటింది. అయినప్పటికీ తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఈ తుపాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మిగతా చోట్ల కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాపై ఫేంజల్ తుపాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. శనివారం రాత్రి నుండి జిల్లాలోని అనేక చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఇందుకూరుపేట, విడవలూరు,కొడవలూరు, ముత్తుకూరు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక చోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు విరిగి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. తిరుమల కొండలపై రిజర్వాయర్లు నిండు కుండలను తలపిస్తున్నాయి.

3) CM Revanth Reddy: రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

CM Revanth Reddy press meet: తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించిన రైతుల పండగలో పాల్గొన్న రైతులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులు ఇచ్చిన ఆశీర్వాదం తమ ప్రభుత్వాన్ని నడిపేందుకు గొప్ప శక్తిగా, ఇంధనంగా భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల మద్దతుతో రాబోయే 9 ఏళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందన్నారు. ముఖ్యంగా కొన్ని వాస్తవాలను చర్చించుకుని, ఆ వాస్తవాల ఆధారంగా భవిష్యత్ కార్యచరణ రూపొందించుకుంటే రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఒక మంచి పరిపాలన అందించడం సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ రైతు భరోసా ఆపే ప్రసక్తే లేదని అన్నారు. సంక్రాంతి తరువాత రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేయడం జరుగుతుందని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

జూన్ 2, 204 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో , 69 వేల కోట్ల రూపాయల అప్పులతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అందివ్వడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. గత పదేళ్లలో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్నీ కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ. 6500 కోట్లు వడ్డీ కడుతోందని అన్నారు.

4) రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు

ఏడాది కాంగ్రెస్ పాలన తెలంగాణ అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై చేసిన విమర్శలకు హరీష్ రావు వెంటనే ఎక్స్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, నీ (రేవంత్ రెడ్డి) రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదన్నారు. "వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ప్రతిపక్షం మీదకు నెపం వేస్తున్నావు" అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు.

ఏడు లక్షల కోట్ల అప్పు అని ఏడాది కాలం నుంచి చెప్పిన అబద్దం మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అబద్దాలు ప్రచారం చేస్తే గోబెల్స్ ప్రచారం అంటారు. గోబెల్స్‌ను మించిన రేబెల్స్ ప్రచారం నీది అని రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం అప్పులు దాచిపెట్టిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అట్ల దాచే అవకాశమే ఉండదు రేవంత్ రెడ్డి. అప్పులు బహిరంగ రహస్యమే. గణాంకాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉంటాయి. ప్రతీ ఏటా అసెంబ్లీలో ప్రవేశపెట్టే కాగ్ నివేదికల్లో ఉంటాయి. ఆనాడు సీఎల్పీ లీడర్‌గా ఉన్న భట్టి విక్రమార్కకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంతో, ఆదాయం ఎంతో తెలియదా అని హరీష్ రావు ప్రశ్నించారు.

5) మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే నిర్ణయంపై ఏక్‌నాథ్ షిండే తాజా ప్రకటన

మహారాష్ట్రకు కాబోయే కొత్త సీఎం ఎవరనే విషయంలో రేపు బీజేపి శాసన సభా పక్షం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం. ఇందులో నేను చెప్పాల్సిన విషయం స్పష్టంగా చెప్పేశాను. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంతిమ నిర్ణయం తీసుకుంటారు. రేపు బీజేపి శాసన సభా పక్షం సమావేశం జరగనుంది. అందులో వారే నిర్ణయం తీసుకుంటారు అని షిండే తెలిపారు. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని షిండే అభిప్రాయపడ్డారు.

6) భారత్‌కు వ్యతిరేకంగా కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదికి బెయిల్

కెనడాలోని ఒంటారియోలో అక్టోబర్ 28న ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దల్లా అరెస్ట్ అయ్యారు. ఆయన్ని తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం కెనడా ఎదుట ఎక్స్ ట్రాడిషన్ రిక్వెస్ట్ పెట్టుకుంది. అయినప్పటికీ తాజాగా కెనడా కోర్టు అర్ష్ దల్లాకు బెయిల్ మంజూరు చేసింది. 30 వేల డాలర్ల షూరిటీతో ఆయనకు బెయిల్ మంజూరైంది. 2025 ఫిబ్రవరి 24న జరిగే తదుపరి వాయిదా విచారణకు అర్ష్ దల్లా మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. భారత్ లో అర్ష్ దల్లాపై 50 కి పైగాకేసులున్నాయి. గతేడాది జనవరిలోనే ఆయనను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో అర్ష్ దల్లా కూడా ఒకరు.

Show Full Article
Print Article
Next Story
More Stories