Delhi Liquor Scam: శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు కస్టడీ పొడిగింపు

Court Extended of ED Custody to the two Accused
x

Delhi Liquor Scam: శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు కస్టడీ పొడిగింపు

Highlights

Delhi Liquor Scam: మరో 4 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు ఈడీ కస్టడీ మరో నాలుగు రోజులు పొడిగించారు. ఈ మేరకు ఈడీ అధికారులకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను మరో వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈడి కస్టడీ పొడిగింపుపై శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి ఈడీ అభ్యంతరం తెలిపింది. బినోయ్ బాబు విచారణలో వెల్లడైన విషయాల ఆధారంగా కొన్ని సోదాలు నిర్వహించామని కోర్టుకు వివరణ ఇచ్చింది. కొన్ని డిజిటల్ ఆధారాలు సేకరించామని కోర్టుకు తెలిపింది. సేకరించిన ఆధారాల ద్వారా తదుపరి విచారణ కోసం శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

దర్యాప్తునకు శరత్ చంద్రారెడ్డి సహకరించడం లేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో అరుణ్ పిళ్లై, రాజ్‎కుమార్ ని ప్రశ్నించ బోతున్నామని మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. PMLA సెక్షన్ 50 ప్రకారం ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి స్టేట్‎మెంట్ రికార్డు చేశారని.. దర్యాప్తు పేరుతో రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని శరత్ చంద్రారెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. బినోయ్ బాబు మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడని... 12 సార్లు స్టేట్‎మెంట్ రికార్డు చేశారని.. కస్టడీ నుంచి మినహాయింపు ఇవ్వాలని బినోయ్ బాబు తరపు న్యాయవాది కోరారు. ఇరువురి వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి MK నాగ్‎పాల్ .. ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నందున శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

రేపు అరుణ్ పిళ్లై, బుచ్చిబాబును ప్రశ్నించబోతున్నామని... సోమవారం రాజ్ కుమార్ విచారణకు హాజరుకానున్నారని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టైన సమీర్ మహేంద్రు జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 26 వరకు కోర్టు పొడిగించింది. తిహార్ జైలులో రెండు రోజుల పాటు సమీర్ మహేంద్రును ఈడీ అధికారులు ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories