మూడు, నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌

మూడు, నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌
x
Highlights

కరోనా మహమ్మారికి రోజులు దగ్గర పడ్డాయా? త్వరలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతోందా? ప్రధాని మోడీ మూడు నగరాల వ్యాక్సిన్‌ టూర్‌ ప్రజల్లో ఆశలు రేపుతోంది....

కరోనా మహమ్మారికి రోజులు దగ్గర పడ్డాయా? త్వరలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతోందా? ప్రధాని మోడీ మూడు నగరాల వ్యాక్సిన్‌ టూర్‌ ప్రజల్లో ఆశలు రేపుతోంది. మూడు కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ల పురోగతిని ప్రధాని సమీక్షించారు.

కరోనా రెండో దశ ఉధృతంగా వ్యాపిస్తోంది. అదే సమయంలో మహమ్మారి విరుగుడు కోసం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో మూడు లేదా నాలుగు నెలల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌లో మూడు కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి మూడో దశలోకి ప్రవేశించాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ను సొంతంగా తయారు చేస్తున్నఅతి తక్కువ దేశాల సరసన ఇండియా చేరింది. అంతేగాకుండా ప్రపంచంలో ఎవరు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినా భారీ ఎత్తున దాని తయారు చేయాలంటే భారత్‌ సహాయం తీసుకోవాల్సిందే. ఏటా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డోస్‌ల టీకాలను భారత కంపెనీలు ఉత్పత్తి చేసి ఆయా దేశాలకు పంపిస్తున్నాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కరోనా టీకాల తయారీలో కూడా ఈ సంస్థ ముందంజలోనే ఉంది.

దేశంలో సీరం ఇనిస్టిట్యూట్‌తో సహా మరో రెండు కంపెనీలైన జైడస్‌, భారత్‌ బయోటెక్‌ కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయబోతున్నాయి. మూడు కంపెనీలు మూడో దశ క్లినికల్‌ ట్రయిల్స్‌ను నిర్వహిస్తున్నాయి. జైడస్‌, భారత్‌ బయోటెక్‌ కంపెనీలు సొంతంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి మానవ ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు ఏటా పది కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగియున్నాయి. ఇక సుదీర్ఘ చరిత్ర ఉన్న పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ మాత్రం ఏటా వంద కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయగల శక్తి గలిగి ఉంది. బ్రిటిష్‌ కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సంయుక్తంగా డవలప్‌ చేసిన వ్యాక్సిన్‌ను సీరం తయారు చేస్తోంది. మనదేశంలో ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయిల్స్‌ కూడా సీరం నిర్వహిస్తోంది. ఇదే కాకుండా రష్యా, అమెరికా కంపెనీలు అభివృద్ధి చేసిన టీకాలు ఉత్పత్తి చేయడానికి కూడా ఒప్పందాలు చేసుకుంటోంది సీరం ఇనిస్టిట్యూట్‌.

అమెరికా, రష్యా, బ్రిటన్‌ తదితర దేశాల్లో తయారయ్యే వ్యాక్సిన్‌ డోస్‌లు ప్రపంచ దేశాలకు ఏమూలకు సరిపోవు. అన్ని దేశాలకు ముఖ్యంగా పేద దేశాలకు వ్యాక్సిన్‌ను తక్కువ ధరకు అందించాలంటే ఇండియన్‌ కంపెనీలు రంగంలోకి దిగాల్సిందే. అందుకే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న వివిధ దేశాల్లోని అనేక కంపెనీలు ఇండియాలోని ఫార్మా కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు భారత ఫార్మా కంపెనీలే కరోనా మహమ్మారి పీచమణిచే వ్యాక్సిన్‌ తయారు చేయగల ఆశాదీపాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలో జనాభా పరంగా రెండో పెద్ద దేశమైన భారత్‌కు కూడా భారీ ఎత్తున టీకాలు అవసరం. అందుకే ఇప్పటికే మూడో దశ ట్రయిల్స్‌ ప్రారంభించబోతున్న మూడు కంపెనీలను భారత ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. టీకాల తయారీ, సరఫరా సన్నద్ధత గురించి ఆరా తీయడానికి స్వయంగా రంగంలోకి దిగారు.

సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైడస్‌ ప్లాంట్‌ను ముందుగా సందర్శించారు ప్రధాని మోడీ. తర్వాత అక్కడి నుంచే నేరుగా హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ ప్లాంట్‌కు వచ్చారు. కంపెనీ ప్రతినిధులు, సీనియర్‎‌ శాస్త్రవేత్తలతో సమావేశమై చర్చించారు. టీకా ట్రయల్స్‌ ఫలితాలపై సమీక్షించారు. అలాగే ఉత్పత్తి తర్వాత రవాణా, నిల్వ తదితర అన్ని సాంకేతిక అంశాలపైనా ప్రధాని సమీక్షించారు. అటు అహ్మదాబాద్‌లోను ఇటు హైదరాబాద్‌లోనూ కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకుని సొంత సాంకేతికతతో టీకాను అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు. హైదరాబాద్‌ నుంచి పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు వెళ్ళారాయన. దేశంలోనే అతి పెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారు అయిన సీరం సంస్థ ప్రపంచంలోని అనేక దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించబోతోంది.

రష్యాకు చెందిన స్పుత్నిక్‌ V టీకాల తయారీకి హైదరాబాద్‌కే చెందిన రెడ్డి ల్యాబ్స్‌...హెటిరోతోను ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక్కడ తయారు చేసినవాటిలో భారత్‌కు కూడా సరఫరా చేయడానికి స్పుత్నిక్‌ నిర్ణయించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories