కంగారు పెట్టిస్తోన్న కొత్త స్ట్రెయిన్.. విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు

కంగారు పెట్టిస్తోన్న కొత్త స్ట్రెయిన్.. విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు
x
Highlights

ఇండియాలో 20కి పెరిగిన బాధితుల సంఖ్య ఇంటర్నేషనల్ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం పొడిగింపు

కొత్త స్ట్రెయిన్ కంగారు పెట్టిస్తోంది. ఇప్పటికి 20 అయ్యాయ్ కేసులు మనదగ్గర ! అసలే వ్యాప్తి ఎక్కువ.. ఎటు పోయి దేనికి దారితీస్తుందోనన్న కంగారు జనాల్లో కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టి పెట్టుకొని అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

డ్రైరన్ పూర్తయింది. ఆస్ట్రాజెనికా టీకాకు యూకే ఓకే చెప్పింది. ఇంకేముంది కళ్లు మూసుకొని బాధను, వ్యథను ఇంకొన్ని రోజులు ఓర్చుకుంటే చాలు గట్టెక్కుతామని అనుకునేలోపే.. కోవిడ్ కొత్త స్ట్రెయిన్ మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. యూకేతో పాటు అమెరికా, సౌతాఫ్రికా, భారత్‌తో పాటు పలు దేశాల్లో కొత్త మ్యుటేషన్ కలకలం రేపుతోంది. సాధారణ వైరస్ కంటే 70శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంతో.. మళ్లీ ఏం జరగబోతుందన్న టెన్షన్ ప్రతీ ఒక్కరిని వెంటాడుతోంది. మనదగ్గర కేసులు అంతకంతకు పెరుగుతున్నాయ్. ఇప్పటివరకు 20మందిలో మ్యుటేటెడ్ వేరియంట్ గుర్తించారు.

ఎన్సీడీసీ ఢిల్లీలో 8మంది, బెంగళూరు ల్యాబులో 7, సీసీఎంబీలో 2... ఎన్ఐబీజీ కల్యాణి, ఎన్ఐవీ పుణె, ఐజీఐబీలో ఒక్కొక్క కేసు వెలుగుచూశాయ్. దీంతో ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. కొత్త వైరస్ స్ర్పెడ్ అవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన అందరికీ జీనోమ్ సీక్వెన్సింగ్ కంపల్సరీ అని తేల్చిచెప్పింది. ఇక అటు జనవరి 31వరకు అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై నిషేధం విధిస్తూ కేంద్ర పౌర విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక విమానాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గో ప్లేన్స్‌కు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త స్ట్రెయిన్ సృష్టిస్తున్న కంగారు అంతా ఇంతా కాదు ! యూకే నుంచి వచ్చిన వారందరిని గుర్తిస్తున్న అధికారులు.. పరీక్షలు చేయిస్తున్నారు. ఇక్కడ అడుగుపెట్టాక వాళ్లంతా ఎవరెవరిని కలిశారో అంతా లెక్క తీసి.. క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయ్. ఐతే కొత్త వైరస్ వ్యాపించిందనడానికి ఆధారాలు లేవని అధికారులు చెప్తున్నారు. కొత్త వైరస్ వ్యాప్తి ఎక్కువే కానీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.

ఐతే ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాగా.. కొత్త స్ట్రెయిన్ మీద అవి పనిచేస్తాయా లేదా అనుమానాలకు నిపుణులు ఫుల్ స్టాప్ పెట్టారు. పనిచేయవు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. ఐతే రానున్న నెలరోజుల పాటు జనాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని అంటున్నారు. జాగ్రత్తలు జాన్ తా నై అన్నారో ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories