మొన్నటి దాకా ఫ్రెండ్లీ ఇప్పుడెందకిలా? లాక్ డౌన్ సమయంలో పోలీసుల గందరగోళం!

మొన్నటి దాకా ఫ్రెండ్లీ ఇప్పుడెందకిలా? లాక్ డౌన్ సమయంలో పోలీసుల గందరగోళం!
x
Highlights

ఈ రోజు మనం మాట్లాడుకుందాం దేశంలో లాక్ డౌన్ సందర్భంగా కొంతమంది పోలీస్ అధికారులు ప్రదర్శిస్తున్న శాడిజం గురించి. మొన్నటి వరకూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న...

ఈ రోజు మనం మాట్లాడుకుందాం దేశంలో లాక్ డౌన్ సందర్భంగా కొంతమంది పోలీస్ అధికారులు ప్రదర్శిస్తున్న శాడిజం గురించి. మొన్నటి వరకూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న వారు ఇప్పుడు లాఠీ రుచి చూపిస్తు్న్నారు. అందులోనూ ఎన్నో వెరైటీలు. ఇదంతా కరోనా వైరస్ ఎఫెక్ట్ మాత్రమేనా ? లేదంటే ఒక్కసారిగా వారి నిజస్వరూపం బయటపడుతోందా ? ఇంతకూ వారు చేస్తున్నదేంటి ? కరోనా వైరస్ బారి నుంచి దేశాన్ని కాపాడుతున్నారా ? తమ అధికారదర్పం ప్రదర్శిస్తున్నారా ? ఇంతకూ చట్టం ఏమంటోంది ? సాధారణ ప్రజలేమనుకుంటున్నారు ? వీటన్నింటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.

ఒకటి కాదు...రెండు కాదు....సోషల్ మీడియాలో వందలాది వీడియోలు వైరల్ గా మారిపోయాయి. ప్రతీ వీడియోలోనూ విభిన్న దృశ్యాలు ఉన్నప్పటికీ మొత్తం మీద కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు సాధారణ ప్రజలను చితకబాదడం. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలన్నదే ఇప్పుడు ప్రధానంగా మారింది.

యావత్ దేశంలోనూ ఇటీవలి కాలం దాకా ఫ్రెండ్లీ పోలీసింగ్ బాగానే పెరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే సాధారణ ప్రజలకు పోలీసులంటే అనవసర భయం పోయేలా చేశారు. ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లేలా చేశారు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ కు జనం జంకుతూ వెళ్ళేవారు. ఆ తరువాత పరిస్థితి మారిపోయింది. ఫిర్యాదు చేసే వారికి పోలీస్ స్టేషన్లలో రాచమర్యాదలూ లభించాయి. అలాంటిది కరోనా వైరస్ పుణ్యమా అంటూ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జనం రోడ్ల మీద కనిపిస్తే చాలు కొందరు పోలీసులు విరుచుకుపడుతున్నారు. అందరు పోలీసులూ అలాగే చేస్తున్నారని చెప్పలేం. కానీ కొందరు పోలీసుల అతి మిగిలిన వారికీ ఇబ్బందులు తెస్తోంది.

ఢిల్లీలో ప్రధాని మొదలుకొని గల్లీలో కౌన్సిలర్ దాకా పట్నం లో మేయర్ నుంచి గ్రామాల్లో సర్పంచుల దాకా అందరిదీ ఒకే మాట. ఓ 21 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రావద్దని. నిజం చెప్పాలంటే 21 రోజుల పాటు నిరవధిక కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి. అలాంటిది ప్రభుత్వం మాత్రం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పలు ప్రాంతాల్లో రాత్రిపూట మాత్రమే కర్ఫ్యూ అమలు చేస్తోంది. పగటి పూట కొన్ని నిబంధనలతో అత్యవసర పనులపై బయటకు వచ్చే వారిని అనుమతిస్తున్నారు. కొందరు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన వెసలుబాటును దుర్వినియోగం చేస్తున్నారు. చిన్నపాటి అవసరాలకూ కొందరు రోడ్డెక్కుతున్నారు. జులాయిలుగా మరికొందరు రోడ్లపైకి వస్తున్నారు. ఈ రెండు రకాల వారు తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే గాకుండా ఇతరుల ప్రాణాలకూ ముప్పు కలిగేలా చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కొందరు పోలీసులు అతిగా ప్రవర్తించడం కూడా వివాదాస్పదంగా మారుతోంది.

అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వారిని పోలీసులు కొడుతున్న దృశ్యాలు మొదట్లో దేశభక్తిని చాటిచెప్పేవిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రజల దృష్టిలో పోలీసులు హీరోలే అయ్యారు. కొడితే కొట్టారులే ఆ మాత్రం కఠినంగా ఉండకుంటే ఎలా అనే సమర్థనలూ వచ్చాయి. రానురానూ ఇలా వైరల్ అయ్యే వీడియోల సంఖ్య పెరిగింది. దాంతో ప్రజల దృష్టిలో పోలీసులపై ఉన్న సదభిప్రాయం మారిపోతోంది. చితకబాదడం కాకుండా మరేం చేయలేరా అనే ప్రశ్నలు రావడం మొదలైంది.

నా పేరు సీతయ్య ఎవరి మాట వినను అనే ఎస్ ఐ ఒకరైతే నేను గబ్బర్ సింగ్ అనే సీఐ మరొకరు. యావత్ దేశంలోనూ ఇదే పరిస్థితి. కొందరు పోలీసులు గుంజిళ్ళతో సరిపుచ్చారు. మరి కొందరు మాత్రం గుంపులుగా మీదపడుతూ చితకబాదారు. ఇంకొందరు వాహనాల టైర్లలో గాలి తీసేశారు. మరికొందరు వాహనాలను కూడా తుక్కుతుక్కుగా చితక్కొట్టారు. నిలబెట్టి కొట్టేవారు కొందరైతే ఉరికిస్తూ కొట్టేవారు మరికొందరు. బైకుల మీద వెళ్లేవారు, ఆటోలను, వ్యాన్లను నడిపేవారు, చిరు వ్యాపారులు, ఆడుకునేందుకు బయటకు వచ్చిన వారు పోలీస్ కోటింగ్ కు గురయ్యారు. కొడుతున్న సమయంలో పోలీసుల హావభావాలు చూస్తేంటే ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించినట్లుగా ఉంటోంది. శత్రువులపై యుద్ధం చేస్తున్నట్లుగా కసిదీరా కొడుతున్నారు.

మొత్తం పోలీస్ వ్యవస్థ ఇలానే ఉంటుందని చెప్పలేం. పూర్తిగా పోలీసులను తప్పుపట్టే పరిస్థితి కూడా లేదు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడ్డ వారిని ఆదుకున్న పోలీసులూ ఉన్నారు. మరో వైపున తమను అడ్డుకుంటున్నారన్న నెపంతో పోలీసులపైనే వాహనదారులు దాడులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగా కొంతమంది పోలీసుల అతి మొత్తం పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకువచ్చేదిగా మారింది. కాస్తంత శృతి మించితే సర్దుకుపోవచ్చు. అంతేతప్ప అధికారదర్పం ప్రదర్శించేందుకు, తమ ఫ్రస్టేషన్ వెళ్లగక్కేందుకో బడితపూజలు చేస్తే మాత్రం ప్రజల్లో చెడ్డపేరు రావడం ఖాయం. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఉల్లంఘనలపై కేసులు నమోదు చేస్తున్నారు. వారికి జైలు శిక్షలు కూడా పడుతున్నాయి. నేరం జరిగినప్పుడు వారిని సంస్కరించే విధంగా శిక్ష ఉండాలి. ఈ విషయాన్ని కొందరు పోలీసులు విస్మరిస్తున్నారు. నేరానికి పాల్పడిన వారిని తామే శిక్షించాలని ఉబలాటపడుతున్నారు. చివరకు అది సమాజంలో పోలీసులపై దురభిప్రాయం ఏర్పడేందుకు కారణమవుతోంది.

చితకబాదే అంశంలో మొత్తం తప్పు అంతా కూడా పోలీసులదే అని అనలేం. వివిధ రకాలుగా ప్రచారం చేసినా ఇళ్లలోనే ఉండిపోయేందుకు కొందరు ఇష్టపడడం లేదు. ఆ కొందరి కారణంగా మరెన్నో లక్షల మందికి కరోనా వైరస్ సోకే అవకాశం కూడా ఉంది. దాన్ని అడ్డుకోకుంటే లాక్ డౌన్ ఫెయిలైంది అనే మాట వస్తుంది. ఆ విమర్శ మొదట పడేది పోలీసుల పైనే. ఎవరో చేసిన తప్పులకు తాము మాట పడడం పోలీసులకు ఇష్టం లేనట్లుగా ఉంది. అందుకే మాటలతో వినని వారికి లాఠీలతో బుద్ధి చెబుతున్నారు. కరోనా వైరస్ గురించి నిపుణులు చెబుతున్న మాటలు వింటుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కోట్లాది మందికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మృతుల సంఖ్య లక్ష వరకూ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి మాటలు వింటుంటే మాత్రం పోలీసులు చేస్తున్నది సరైందే అని కూడా అనిపిస్తుంటుంది. మరో వైపున అతిగా చితకబాదిన పోలీసులను సస్పండ్ చేసిన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

కొన్ని సందర్భాల్లో ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడుతుంటారు. కోట్లాది మంది వైరస్ బారిన పడి లక్షలాది మంది మరణించే పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. అలాంటప్పుడు పోలీసుల బాదుడు కార్యక్రమం సరైందే అనిపిస్తోంది. అదే సమయంలో సమాజం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కొందరి అతి మొత్తం పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావడం ఖాయం అనిపిస్తుంది. ఏమైతేనేం అటు ప్రజలు, ఇటు పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం ఇది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories