Corona: మహారాష్ట్రలో ఆగని కరోనా ఉధృతి

Coronavirus Cases Hiking In Maharashtra
x

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: రోజూ 60వేలకు చేరువలో కొత్త కేసులు * శనివారం రాష్ట్రంలో 55వేలకు పైగా పాజిటివ్ కేసులు

Corona: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు. రోజురోజుకీ నమోదవుతున్న కొత్త కేసులు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో రోజువారీగా వెలుగుచూస్తున్న మొత్తం కేసుల్లో సగానికి పైగా ఇక్కడ నుంచే వస్తున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు సీఎం ఉద్దవ్‌ ఠాక్రే. కోవడ్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మినీ లాక్‌డౌన్, వీకెండ్‌ లాక్‌డౌన్‌ ప్రభావం అంతగా చూపడంలేదని అందుకే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు ఉద్దవ్ ఠాక్రే.

మినీ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన అనంతరం కూడా రోజు రోజుకి కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య అయిదు లక్షలు దాటింది. ఈ సంఖ్య ప్రపంచంలోనే ఏడవ స్థానంలో ఉండగా మరోవైపు ప్రతి రోజు కరోనా రోగుల సంఖ్య 60 వేల చేరువలో నమోదవుతోంది. నిన్న మహారాష్ట్రలో 55 వేల 411 కేసులు నమోదయ్యాయి. 309 మంది మృత్యువాత పడ్డారు. ఏప్రిల్‌ 15వ తేదీ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలున్నాయన్నారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. ముందుగా ఎనిమిది రోజుల లాక్‌డౌన్‌ విధించి ఆ తర్వాత ఆంక్షలను సడలిస్తామని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీంతో నెల రోజుల్లో పరిస్థితిని నియంత్రణలోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు.

అయితే సీఎం ఉద్దవ్ నిర్ణయాన్ని విపక్ష బీజేపీ వ్యతిరేకించింది. లాక్‌డౌన్ వల్ల ప్రజల్లో కోపోద్రిక్తతలు పెరుగుతాయని ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు. అటు మిత్రపక్షమైన ఎన్సీపీ నేత శరత్ పవార్ కూడా లాక్‌డౌన్‌ను వ్యతిరేకించారు. మరోవైపు రెండు వారాల లాక్‌డౌన్‌ విధిస్తేనే కరోనా కంట్రోల్‌లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌పై సందిగ్ధత నెలకొనగా.. రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories