Corona: జనారణ్యాల్లో కార్చిచ్చులా విజృంభిస్తోన్న కరోనా

Coronavirus Cases Expanding in India
x

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ముమ్మరం

Corona: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తోంది. అవును.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు కోటిన్నర దాటాయి. 445 రోజుల్లో.. రోజుకు సగటున 33వేల 847 చొప్పున మొత్తం కోటి 50లక్షల 61వేల 919 కేసులకు చేరింది. చెప్పాలంటే కేసుల సంఖ్య తొలి 25లక్షలకు చేరుకోవడానికి 198 రోజులు పట్టగా చివరి 25 లక్షలు 15 రోజుల్లోనే వచ్చాయి. సోమవారం దేశంలో 2లక్షల 73వేల 810 మందికి వైరస్‌ సోకింది. ఒక్కరోజులోనే 1619 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉండగా.. అడవులను దహించి వేసే కార్చిచ్చులా కరోనా వైరస్‌ జనారణ్యాల్లో విజృంభిస్తోంది. దీంతో మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను ముమ్మరం చేశాయి. ఆసుపత్రుల్లో బెడ్స్‌ పెంచడం, ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర మందులను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఢిల్లీ ప్రభుత్వం ఆరు రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించగా.. రాజస్థాన్‌ సర్కారు 15 రోజులు ప్రజలే స్వీయ ఆంక్షలతో కోవిడ్‌పై పోరుకు సహకరించాలని పిలుపునిచ్చింది. కేరళలో ఇవాళ్టి నుండి రాత్రిపూట కర్ఫ్యూ అమలుకానుంది.

ఢిల్లీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఒక్కరోజులోనే అక్కడ 25వేల మంది కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో లాక్‌డౌన్‌ విధించక తప్పడంలేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. అయితే ఎవరూ ఢిల్లీ వదిలిపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక లాక్‌డౌన్‌ ప్రకటనతో నిత్యావసరాల కోసం జనాలు దుకాణాలకు పరుగులు తీయగా.. మందుబాబులు వైన్స్‌ షాపుల ఎదుట బారులు తీరారు. మరోవైపు.. ఎయిమ్స్‌లో ఈనెల 22 నుంచి ఓపీ సేవలను నిలిపివేయనున్నారు.

అటు లాక్‌డౌన్‌లో విధించే ఆంక్షలను 15 రోజుల పాటు ప్రజలే క్రమశిక్షణతో స్వయంగా పాటించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం విజ్నప్తి చేసింది. మే 3వ తేదీ ఉదయం 5గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ఆరాష్ట్ర సీఎం అశోక్‌ గహ్లోత్‌ తెలియజేశారు. ఇక రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తృతి అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు.

ఇక పంజాబ్‌లో రాత్రి కర్ఫ్యూ మరో గంట పాటు పొడిగించడంతోపాటు బార్లు, మాల్స్‌, థియేటర్లుతోపాటు కోచింగ్‌ సెంటర్లు, జిమ్‌ సెంటర్లు ఈనెల 30వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు... ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్‌, వారణాసితోపాటు కాన్పుర్‌, గోరఖ్‌పుర్‌లతో ఈనెల 26వరకు లాక్‌డౌన్‌ విధించాలని ఆరాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాగా దీన్ని అమలు చేయడానికి తాము సిద్ధంగా లేమని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్‌లో అవసరమైన ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌, కోవిడ్‌పై పోరుకు అవసరమైన ఇతర వనరులను సమకూర్చుతామని ఆరాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ ఛౌహాన్‌కు ప్రధాని మోదీ హామి ఇచ్చారు. అదేవిధంగా అర్హూలైన లబ్ధిదారులందరికీ వచ్చే మూడు నెలలపాటు రేషన్‌ సరకులను ఉచితంగా అందించనున్నట్లు మధ్యప్రదేశ్‌ సీఎం ప్రకటించారు.

మధ్యప్రదేశ్‌లో వచ్చే 3 నెలలు రేషన్‌ సరకులను ఉచితం..

మొత్తానికి కోవిడ్‌ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో అమలు చేస్తున్న ఆంక్షల వల్ల ఇబ్బందులకు గురయ్యే పేదలు, ఇతర బలహీన వర్గాల వారికి యద్ధ ప్రాతిపదికన 5వేల 476కోట్ల ప్యాకేజీ అమలు చేయనున్నట్లు ఆరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories