కొండెక్కి కూర్చున్న వంటనూనె ధరలు.. దేశంలో 22 మిలియన్ టన్నుల ఆయిల్ డిమాండ్.. ఉన్నది 7 మిలియన్ టన్నులు

Cooking Oil Prices Demand in India Increasing Day by Day | Breaking News
x

కొండెక్కి కూర్చున్న వంటనూనె ధరలు.. దేశంలో 22 మిలియన్ టన్నుల ఆయిల్ డిమాండ్.. ఉన్నది 7 మిలియన్ టన్నులు

Highlights

Cooking Oil Prices: ప్రతీ ఏటా 15 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటున్న కేంద్రం...

Cooking Oil Prices: ప్రస్తుతం వంటనూనె ధరలు ఆకాశాన్నంటాయి. మిగతా వంటనూనెల కంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలు అత్యధికంగా కొనుగోలు చేసేది పామాయిల్‌నే. దీంతో పామాయిల్‌కు మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. అటు రైతులు కూడా పామ్ సాగువైపే ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగవుతున్న పామాయిల్ పంటపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ...

వంటనూనెల ధరలు కొండెక్కి కూర్చోవడంతో పామాయిల్ పంటకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు అత్యధికంగా కొనుగోలు చేసేది పామాయిల్‌నే కాబట్టి..ఈ నూనెకు మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతుల దృష్టంతా ఇప్పుడు పామాయిల్ పంటపైనే ఉంది. వాస్తవానికి మన దేశానికి 22 మిలియన్ టన్నుల వంట నూనె డిమాండ్ ఉండగా దేశంలో 7 మిలియన్ టన్నుల ఆయిల్ తీయడానికి అవసరమైన నూనె గింజల పంటలను మాత్రమే పండిస్తున్నారు రైతులు. దీంతో ప్రతి ఏటా 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రతి ఏటా 70వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది.

ప్రస్తుతం దేశంలో 80 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. ఇంకా లక్షలాది ఎకరాల్లో పామ్‌ సాగును విస్తరించాల్సిన అవసరం ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. తెలంగాణలో 50 శాతం సబ్సిడీతో రైతులను ప్రోత్సహిస్తోంది కేంద్రం. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు 37వేల ఎకరాల్లో సాగవుతోంది. దీనిని 2 లక్షలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెల టన్ను ధర 12,500 నుంచి 19వేలు పలుకుతోంది.

దీంతో రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఆయిల్ పామ్‌ను సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహాకాలు కల్పిస్తోంది. రాష్ట్ర ఆయిల్ ఫెడ్‌తో పాటు 14 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ సొంత ఖర్చులతో నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టబోతున్నారు. ఎకరాకు 10 నుంచి 12 టన్నులు దిగుబడి వస్తోంది. ఎకరానికి రైతుకు నికర ఆదాయం లక్ష రూపాయలు వస్తుంది. ఈ పంటకు కోతులు, అడవి పందులు, రాళ్ళవాన, గాలివాన, దొంగల బెడద అసలు ఉండదు. ఆయిల్ పామ్ మొక్క దాదాపు 30 ఏళ్లపాటు పంటను ఇస్తుంది. మూడేళ్లపాటు అంతర పంటగా కోకో, డ్రాగన్ ప్రూట్, జాజికాయ, వక్క పంటలను వేసుకోవచ్చు, 4వ ఏడాది నుంచి ఆయిల్ పామ్ పంట చేతికొస్తుంది.

ఎస్సీ, ఎస్టీలకు 100శాతం, మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీతో పామ్ మొక్కలు, ఎరువులను అందిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎరువులు సబ్సిడీపై ఇస్తున్నందున ప్రస్తుత పామాయిల్ సాగు చేపట్టడం మంచిదంటున్నారు రైతులు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పామ్‌ సాగువైపే మొగ్గుచూపితే లాభాలు వస్తాయని వ్యవసాయశాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏళ్లపాటు నిశ్చింతగా ఉండొచ్చని వివరిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా పామాయిల్ సాగు చేసే రైతులకు అనేక ప్రోత్సాహాకాలను కల్పిస్తుందని..ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories