Rains: ఉత్తరాదిన కొనసాగుతున్న వర్షబీభత్సం.. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలు

Continued Rainfall In The North States
x

Rains: ఉత్తరాదిన కొనసాగుతున్న వర్షబీభత్సం.. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలు

Highlights

Rains: ఉత్తరాదిలో మరింతగా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ

Rains: ఉత్తరాదిన వర్షబీభత్సం కొనసాగుతోంది. వరుసగా మూడోరోజూ భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. పాత ఇళ్లు కూలిపోతున్నాయి. ఈ జల ప్రళయానికి హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, యూపీ, ఉత్తరాఖండ్‌లో కలిపి 41 మంది మృతిచెందారు. ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 18 మంది చనిపోయారు. పంజాబ్‌, హరియాణాలో 9 మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తరాఖండ్‌లో నలుగురు, యూపీలో ముగ్గురు మృతిచెందారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. వేల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. చాలా చోట్ల రైల్వే ట్రాకులు మునిగిపోయాయి. ఢిల్లీ సహా ప్రభావిత రాష్ట్రాల్లో మంగళవారం కూడా విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ప్రభావిత రాష్ట్రాల్లో 39 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

రానున్న రోజుల్లో జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ సహా ఉత్తరాదిలో మరింత ఉధృతితో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఆ రాష్ట్రంలోని సిమ్లా, సిర్మార్‌, కుల్లు, మండి, కిన్నౌర్‌, లాహౌల్‌ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్‌ అలర్ట్‌ హెచ్చరించారు. వర్షాలు, వరదలకు ప్రత్యేకించి హిమాచల్‌ ప్రదేశ్‌ తీవ్ర ప్రభావితమవుతోంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రధాన వంతెనలు దెబ్బతిన్నాయి. ఉనా జిల్లా లాల్‌సింగిలో వదరల్లో చిక్కుకుపోయిన 515 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. హిమాచల్‌ వ్యాప్తంగా రోడ్లు మూసివేశారు.

ఢిల్లీలో యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. యమునా నది 1978లో 207.49 మీటర్ల ఎత్తులో ప్రవహించింది. యమునకు భారీ వరద పరంగా ఇప్పటిదాకా ఇదే రికార్డు. హత్నీకుండ్‌ నుంచి వరద వస్తుండటంతో బుధవారానికి యమునకు మరింత వరద పోటెత్తే అవకాశం ఉందటున్నారు నిపుణులు. 1978 నాటి రికార్డును తుడిచిపెడుతూ మరింత తీవ్రతతో ప్రవహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిల్లీలో రోడ్లపై మోకాలి లోతు వరద ప్రవహిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories