Top 6 News @ 6 PM : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్

Top 6 News @ 6 PM : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
x
Highlights

Top 6 News @ 6pm: ఇవాళ అక్టోబర్ 29న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు,...

Top 6 News @ 6pm: ఇవాళ అక్టోబర్ 29న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

1) మైక్రోసాఫ్ట్ సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు టెక్నికల్ సహకారం అందించాలని ఆయన కోరారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లో మైక్రోసాఫ్ట్ సంస్థ గ్లోబల్ లీడర్‌గా ఉన్న విషయాన్ని సత్య నాదెళ్ల చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్ నాటికి తమ సంస్థ 3.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌కు చేరుకుందన్నారు. లాస్టియర్ తమ సంస్థ 211.9 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిందన్నారు. రాష్ట్రంలో కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నామని లోకేష్ చెప్పారు. ఐటీ హబ్‌లను ప్రపంచస్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని మంత్రి కోరారు.

2) మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు నవంబర్ 1న శంకుస్థాపన చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ విషయంలో ముందడుగే తప్ప వెనకడుగు లేదన్నారు. రూ. 140 కోట్లతో డీపీఆర్ తయారీకి ఆదేశాలిచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పీపీపీ విధానంలో మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు. మూసీపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు తొలి విడత పనులు చేస్తామన్నారు. నవంబర్‌లోపు ప్రాజెక్టు పనుల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.

3) డ్రోన్ ద్వారా పేషెంట్ బ్లడ్ శాంపిల్స్ తెప్పించిన ఎయిమ్స్‌

మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష నిర్వహించారు. ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్‌సీకి డ్రోన్ పంపారు వైద్యులు. ఈ పీహెచ్‌సీలో రోగి బ్లడ్ శాంపిల్స్ సేకరించి తిరిగి ఎయిమ్స్‌కు చేరుకుంది డ్రోన్. ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్‌సీ 12 కి.మీ. దూరం ఉంటుంది. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న డ్రోన్ 9 నిమిషాల్లో తిరిగి ఎయిమ్స్‌కు చేరుకుంది.

అత్యవసర సేవల్లో డ్రోన్ వినియోగంపై ఎయిమ్స్ వైద్యులు డ్రోన్ టెస్ట్ చేశారు. విజయవాడలో వరదల సమయంలో డ్రోన్ల సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది. హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తే వేస్ట్ అవుతోందనే ఉద్దేశ్యంతో కొన్ని చోట్ల డ్రోన్లను ఉపయోగించారు.

4) కేటీఆర్ నోటీసులకు బండి సంజయ్ రిప్లై

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జవాబు ఇచ్చారు. లీగల్ నోటీసులో కేటీఆర్ ప్రస్తావించిన అంశాల్లో వాస్తవాలు లేవన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహరాలో తనపై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రికి ఆయన లీగల్ నోటీసు పంపారు. ఈ నోటీసుకు బండి సంజయ్ సమాధానమిచ్చారు.

5) మమతా బెనర్జి, కేజ్రీవాల్‌కి మోదీ సింగిల్ షాట్

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఢిల్లీని పరిపాలిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద వారికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా లభిస్తుంది. అయితే, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేయకపోవడం వల్ల అక్కడి వృద్ధులకు తాను సేవ చేసుకోలేకపోతున్నానని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి వృద్ధులు ఈ విషయంలో తనని క్షమించాలని అన్నారు. అధికార పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇబ్బందిపెట్టడం అమానవీయం అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.



6) హెజ్బొల్లాకు కొత్త చీఫ్

లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా తమ కొత్త చీఫ్ పేరును ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించారు. తరువాత ఆ మిలిటెంట్ సంస్థకు నయీం ఖాసిం డిప్యూటీ ఇంచార్జ్‌గా పనిచేస్తూ వచ్చారు. తాజాగా ఆయన్నే పూర్తిస్థాయిలో హెజ్బొల్లా చీఫ్‌గా నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇరాన్ సహకారంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హెజ్బొల్లా మిలిటెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు హెజ్బొల్లా మిలిటెంట్స్‌పై దాడులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ అప్పటి హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను వైమానిక దాడులతో మట్టుపెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories