యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి రావాలని మోడీకి కేసీఆర్ ఆహ్వానం

CM KCR Invited the PM Modi to Yadadri Temple Inauguration
x

యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవానికి పీఎం మోడీని ఆహ్వానించినా కెసిఆర్ 

Highlights

CM KCR: అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఆలయ ప్రారంభోత్సవం ఉంటుందన్న కేసీఆర్

CM KCR: ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. 10 అంశాలపై ప్రధాని మోడీకి వినతులు అందజేశారు సీఎం కేసీఆర్. ఇందులో ప్రధానంగా ఐపిఎస్ క్యాడర్ రివ్యూ, రాష్ట్రంలో టెక్సటైల్ పార్క్ ఏర్పాటు, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు ఇవ్వాలని మోడీని అడిగారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు, హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు లాంటి పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు కేసీఆర్.

ఐపిఎస్ క్యాడర్ రివ్యూ చేయాలని, మరో 29 ఐపీఎస్ పోస్టులను అదనంగా ఇవ్వాలని మోడీ ఎదుట డిమాండ్ ఉంచారు. దీంతో 76 సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్యను 105 కు పెంచాలన్నారు. మొత్తంగా 195 పోస్టులకు చేరుతుందన్నారు సీఎం. పూర్తిగా వెయ్యి కోట్ల రూపాయల కేంద్ర గ్రాంట్ తో రాష్ట్రంలోనీ వరంగల్ లో టెక్సటైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 585 కిలో మీటర్ల పొడువున హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకరించాలన్నారు. కొత్త జిల్లాల్లో 11 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు, హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం కృషి చేయాలని ప్రధానిని కోరారు కేసీఆర్. తెలంగాణలో నీటి అవసరాలు పెరిగాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి వాటాను కచ్చితంగా పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. తాజాగా కేఆర్‌ఎంబీ సమావేశం, విద్యుత్ ఉత్పత్తి విషయాలకు సంబంధించిన పంచాయితీని ప్రధాని మోడీ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రధాని దృష్టికి కేసీఆర్‌ తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డులకు ప్రత్యేక అధికారాలు కల్పించడంపై పునఃసమీక్షించాలని కోరినట్లు సమాచారం.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా, అన్ని రాష్ట్రాలకు ఢిల్లీ కేంద్రంగా భవనాలు వున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా అధికారిక భవనం "తెలంగాణ భవన్" నిర్మించుకునేందుకు, ఢిల్లీలో అనువైన చోట స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కేసిఆర్ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని, భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని సీఎం కేసిఆర్ కు హామీ ఇచ్చారు. ఇక.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా.. మోడీని సీఎం కేసీఆర్‌ కోరారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ, యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories