china-india clashes: మార‌ని చైనా వ‌క్ర‌బుద్ధి.. మ‌రోసారి స‌రిహ‌ద్దుల్లో క‌వ్వింపు చ‌ర్య‌లు

china-india clashes: మార‌ని చైనా వ‌క్ర‌బుద్ధి.. మ‌రోసారి స‌రిహ‌ద్దుల్లో క‌వ్వింపు చ‌ర్య‌లు
x

china-india clashes:

Highlights

china-india clashes: చైనా బుద్ధిని మారడం లేదు. మరోసారి తన దురాక్రమణ పూరిత వైఖరిని బయటపెట్టుకుంది. స‌రిహ‌ద్దు వెంబ‌డి.. ప‌దేప‌దే అలజడిని రేపేందుకు ప్రయత్నిస్తోంది.

china-india clashes: చైనా బుద్ధిని మారడం లేదు. మరోసారి తన దురాక్రమణ పూరిత వైఖరిని బయటపెట్టుకుంది. స‌రిహ‌ద్దు వెంబ‌డి.. ప‌దేప‌దే అలజడిని రేపేందుకు ప్రయత్నిస్తోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను మరోసారి తుంగలో తొక్కింది. తాజాగా భారత్‌ను మరోసారి రెచ్చ గొట్టేందుకు డ్రాగన్ దేశం ప్రయత్నించింది. లద్దాఖ్‌లోని పాంగాంగ్ సో సరస్సు వ‌ద్ద గల వాస్తవాధీన రేఖ వెంట దూకుడుగా తన ఆర్మీ కదలికను ప్రోత్సహిస్తూ అక్కడ యథాతథ స్థితిని మార్చే ప్రయత్నం చేసిందని భారత ఆర్మీ సోమవారం ప్రకటించింది. ఆగస్టు 29-30 మధ్యరాత్రి ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే చైనా కుట్రలను ముందుగానే పసిగట్టిన మన బలగాలు వారి దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు.

ఇప్పటివరకూ సరస్సుకు ఉత్తరాన ఉన్న ప్రాంతానికే ఉద్రిక్తలు ఉండేవి. కానీ తాజాగా సరస్సుకు దక్షిణాన ఉన్న సరిహద్దును ఉల్లఘించేందుకు చైనా ప్రయత్నించిందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సరిహద్దుల్ని మార్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ కూడా తలెత్తినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చింది. డ్రాగన్‌ సైనికుల దాడుల‌ను తిప్పికొట్టింది. 'చైనా ఆర్మీ కదలికలను ముందుగానే గుర్తించి మేము పటిష్ట చర్యలను తీసుకున్నాం. ఏకపక్షంగా యథాతథస్థితిని మార్చాలనుకున్న చైనా వ్యూహాన్ని భగ్నం చేశాం' అని భారత్ ఆర్మీ పీఆర్‌ఓ కల్నల్ ఆమన్ ఆనంద్ మీడియాకు తెలిపారు.

కాగా గల్వాన్‌ లోయలో జూన్‌ 15న ఘాతుకానికి పాల్పడిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు దఫాలుగా దౌత్యపరమైన, మిలిటరీ చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దశల వారీగా బలగాలను రప్పించాలనే ఒప్పందానికి తూట్లు పొడిచిన చైనా ఆర్మీ ఆగష్టు 29, 30 తేదీల్లో తూర్పు లదాఖ్‌, ప్యాంగ్‌ యాంగ్‌ సరస్సు వద్ద స్టేటస్‌ కోను మార్చే ప్రయత్నాలు చేసిందని భారత రక్షణ శాఖ వెల్లడించింది.

పాంగాంగ్‌ వద్ద వివాదం అసలు కథ

పాంగాంగ్‌ సరస్సు లద్దాఖ్‌లో ఉంది. దాదాపు 134 కిలోమీటర్ల పొడవున్న ఈ సరస్సు టిబెట్‌ వరకు 604 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. 5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సరస్సు దాదాపు 60శాతం టిబెట్‌ పరిధిలో ఉంటుంది. 1962లో చైనా దాడి చేసి ఆక్సాయిచిన్‌ను దక్కించుకొంది. అప్పటి నుంచి ఇరు దేశాలు సరిహద్దులుగా భావిస్తున్న వాస్తవాధీన రేఖ ఈ సరస్సుమీద నుంచి పోతుంది. ఇరు దేశాలు కచ్చితమైన సరిహద్దులను ఇక్కడ నిర్ధారించుకోలేదు. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు 'ఫింగర్స్‌'గా అభివర్ణిస్తాయి. ఈ ఫింగర్ దగ్గర లెక్కలే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారాయి. భారత్‌ 'ఫింగర్‌ 8' నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతుంది.. భౌతికంగా మాత్రం ఫింగర్‌ 4 వరకే పట్టు ఉంది. కానీ చైనా సైన్యంకు ఫింగర్‌ 8 వద్ద సరిహద్దు పోస్టు ఉంది.. అయినా ఫింగర్‌ 2 వరకు తమదే అని వాదిస్తోంది. ప్రస్తుతం భారత్‌ సైన్యాన్ని ఫింగర్‌2 వద్దే ఆపేస్తోంది. సరస్సులో కూడా భారత్‌ చైనాల మధ్య వివాదం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం సరస్సులో భారత దళాలు పెట్రోలింగ్‌ చేస్తుంటే చైనా దళాలు మరబోట్లు వేసుకొని వచ్చి అడ్డుకొన్నాయి. దీంతో భారత్‌ కూడా టాంపా రకం బోట్లను ఇక్కడ వినియోగించడం మొదలుపెట్టింది. ఇటీవల పాంగాంగ్‌ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో చైనా ఎల్‌ఎక్స్‌ రకం బోట్లను తీసుకొచ్చింది.

వీటి వ్యూహాత్మక ప్రాముఖ్యం ఏమిటీ..?

ఇవి బంజరు పర్వతాలు మాత్రమే. చైనా వీటిపై ఆధిపత్యం కోసం ప్రయత్నించడం వెనుక చాలా వ్యూహం ఉంది. భారత్‌ 'ఫింగర్‌4' చాలా వ్యూహాత్మకమైంది. ఇక్కడకు శత్రుబలగాలు వస్తే భారత్‌ పాంగాంగ్‌ సరస్సులో గస్తీకి వినియోగించే బోట్ల సంఖ్య, వాటి వద్ద మన సైన్యం కదలికలు శత్రువులకు తేలిగ్గా తెలిసిపోతాయి. ఫింగర్‌ 4 నుంచి చూస్తే భారత్‌ మరపడవలను నిలిపే లుకుంగ్‌ ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది.

కార్గిల్‌ యుద్ధ సమయంలోనే..

కార్గిల్‌ యుద్ధ సమయంలో బలగాల అవసరం ఉండటంతో ఈ సరస్సు వద్ద కొంత మందిని అటువైపు మళ్లించారు. ఇదే అదునుగా భావించిన చైనా సైన్యం ఫింగర్‌ వద్ద రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది. ఇప్పుడు ఫింగర్‌ 2-3 మధ్య ఈ నిర్మాణం జరుగుతోంది. భారత్‌తో పోలిస్తే చైనా దళాలు ఈ ప్రదేశానికి వేగంగా చేరుకొనే అవకాశాలను ఇది కల్పిస్తోంది. గత కొన్ని నెలలుగా ఇక్కడ భారత పెట్రోలింగ్‌ను అడ్డుకొనేందుకు చైనా భారీ సంఖ్యలో దళాలను తరలించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories