Central Govt Cabinet Meeting: ఒకే పరీక్షతో ఉద్యోగాలు.. ఎన్ఆర్ ఏకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Central Govt Cabinet Meeting: ఒకే పరీక్షతో ఉద్యోగాలు.. ఎన్ఆర్ ఏకు కేంద్ర కేబినెట్ ఆమోదం
x
Highlights

Central Govt Cabinet Meeting: నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ నియామకాల సంస్థను (ఎన్ఆర్ ఏ)ను ఏర్పాటుచేసింది.

Central Govt Cabinet Meeting: నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ నియామకాల సంస్థను (ఎన్ఆర్ ఏ)ను ఏర్పాటుచేసింది. దీనికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఒకే పరీక్షతో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా రూపకల్పన చేసింది.

కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను సులభతరం చేసేందుకు, నిరుద్యోగులపై పరీక్షల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. నాన్‌ గెజిటెడ్‌, రైల్వే, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో(గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ) ఉద్యోగాల భర్తీకి జాతీయ నియామకాల సంస్థను(ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటు చేయనున్నది. ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటుకు బుధవారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. భవిష్యత్తులోఎన్‌ఆర్‌ఏ నిర్వహించే ఉమ్మడి అర్హత పరీక్ష(కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర క్యాబినెట్‌ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు కోసం రూ. 1,517 కోట్లు మంజూరు చేశారు. దీనికి ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి చైర్మన్‌గా ఉంటారు. ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు చరిత్రాత్మకమైన నిర్ణయం అని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అభిప్రాయపడ్డారు. ఉద్యోగార్థుల సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు.

ఉద్యోగ నియామకాల్లో కామన్‌ పరీక్ష కోసం యువత ఎన్నో ఏండ్లుగా డిమాండ్‌ చేస్తున్నదని, ఇప్పుడు వారి కోరిక నెరవేరిందని చెప్పారు. దేశ చరిత్రలో ఈ నిర్ణయం విప్లవాత్మకమైనదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. దేశంలో ప్రస్తుతం 20కి పైగా నియామక సంస్థలు ఉన్నాయి. ఇందులో మూడు సంస్థలు మాత్రమే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటుతో ఈ సంస్థలన్నీ ఒకే గొడుగుకిందకు రానున్నాయి. ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా చెరకుకు మద్దతు ధరను క్వింటాలుకు రూ. 10 పెంచారు.

జిల్లాకో పరీక్ష కేంద్రం

ఎన్‌ఆర్‌ఏలో రైల్వే శాఖ, ఆర్థిక శాఖ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ), ఐబీపీఎస్‌ నుంచి కూడా ప్రతినిధులు ఉంటారు. ప్రస్తుతం కామన్‌ టెస్ట్‌ స్కోరును బట్టి ముందుగా మూడు ముఖ్యమైన ఏజెన్సీల్లో(ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌) పోస్టులను భర్తీ చేస్తారు. దీర్ఘకాలంలో ఈ టెస్టు స్కోరును ఇతర రిక్రూటింగ్‌ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్తింపజేస్తారు. దీంతో వివిధ ఉద్యోగాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే ఖర్చు, ప్రయాణాల ఖర్చు తగ్గుతుంది. కామన్‌ టెస్ట్‌ నిర్వహించడానికి దేశవ్యాప్తంగా జిల్లాకొకటి చొప్పున దాదాపు వెయ్యి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు జితేంద్ర సింగ్‌ తెలిపారు.

అభ్యర్థుల షార్ట్‌ లిస్ట్‌

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ఎన్‌ఆర్‌ఏ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీఈటీ) నిర్వహిస్తుంది. ఇందులో స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయినవారు మాత్రమే ప్రభుత్వ సంస్థల తరఫున నియామక ఏజెన్సీలు నిర్వహించే పరీక్షలు రాయడానికి అర్హత సాధిస్తారు.

అదానీ గ్రూప్‌కు మరో మూడు ఎయిర్‌పోర్టులు లీజు

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద జైపూర్‌, తిరువనంతపురం, గౌహతి విమానాశ్రయాల నిర్వహణను అదానీ గ్రూప్‌కు లీజుకు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు(ఏఏఐ) రూ.1070 కోట్లు సమకూరనున్నాయి. మరోవైపు ఉజ్వల డిస్కమ్‌ యోజన పరిధిలోని డిస్కమ్‌ల వర్కింగ్‌ క్యాపిటల్‌పై గల పరిమితిని సడలించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 25శాతం నిబంధనను తొలిగించింది. ఈ సడలింపులతో డిస్కమ్‌లు రూ. 90వేల కోట్లు దాకా లోన్‌ తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది.

మూడేండ్లు వ్యాలిడిటీ

ఒక్కసారి కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష రాస్తే వచ్చిన మార్కులకు మూడేండ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్లీ మళ్లీ పరీక్షలు రాయనవసరంలేదు. మళ్లీ రాసినా ఎక్కువ మార్కులు దేనిలో వస్తే ఆ స్కోరును పరిగణలోకి తీసుకుంటారు. నిర్దిష్ట వయస్సు లోపు ఎన్నిసాైర్లెనా పరీక్షలు రాసుకోవచ్చు.

ముఖ్యాంశాలు

1. మొదట ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు కామన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది ప్రిలిమినరీ పరీక్ష

2. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు మరో పరీక్ష కోసం సంబంధిత నియామక ఏజెన్సీకి దరఖాస్తు చేసుకోవాలి.

3. టెస్టు స్కోరుకు మూడేండ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మూడేండ్లలోపు మళ్లీ రాస్తే ఎందులో ఎక్కవ మార్కులువస్తే దానిని పరిగణలోకి తీసుకుంటారు.

4. పరీక్షను ఎన్ని సార్లు రాయాలన్న నిబంధన ఏమీ లేదు. నిర్దిష్ట వయస్సు లోపు ఎన్నిసాైర్లెన రాయవచ్చు.

5. పదో తరగతి పూర్తైన వారు, ఇంటర్‌ పూర్తైన వారు, గ్రాడ్యుయేషన్‌ పూర్తైన వారు.. ఇలా ఎన్‌ఆర్‌ఏ మూడు స్థాయిల్లో కామన్‌ టెస్టును నిర్వహిస్తుంది. ఆయా అర్హతల ఆధారంగా అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories