Oxygen: ఆక్సిజన్​ ఉత్పత్తి'పై కేంద్రం కీలక ఆదేశాలు

Center key Commands on Oxygen Production in India
x

ఆక్సిజన్ ట్యాంకులు (ఫైల్ ఇమేజ్)

Highlights

Oxygen: మూతపడిన ఆక్సిజన్​ ప్లాంట్​లను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు

Oxygen: దేశంలో రెండో దశ కరోనా విస్తరిస్తున్న తరుణంలో మెడికల్​ ఆక్సిజన్​ కొరతను అధిగమించే చర్యలను మరింత ముమ్మరం చేసింది కేంద్రం. ఈ మేరకు మూతపడిన ఆక్సిజన్​ ప్లాంట్​లను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్న కేంద్ర హోం శాఖ.. సంబంధిత నివేదికను వెంటనే పంపాలని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా ప్రాణవాయువు కొరత ఏర్పడిన తరుణంలో ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు తమ పరిధిలోని ఆక్సిజన్​ ఉత్పత్తి సంస్థల జాబితాను సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది హోంశాఖ. పెరిగిన డిమాండ్​కు అనుగుణంగా సరఫరాను పెంచేందుకు మూతపడిన ప్లాంట్​లను పునరుద్ధరించాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచిస్తూ లేఖ రాసింది.

ఆక్సిజన్​ రవాణా చేసే వాహనాలను తగిన భద్రత కల్పించడం సహా ప్రత్యేక కారిడార్ల సదుపాయాలు కల్పించాలని లేఖలో పేర్కొంది కేంద్రం. ప్రజారోగ్యానికి సంబంధించిన వస్తువులకు నిరంతర సరఫరా, రవాణాను కల్పించాలని ఆదేశించింది. ఆక్సిజన్​ తరలింపునకు అవసరమైన అదనపు ట్యాంకర్లను అందుబాటులో ఉంచేందుకు సింగపూర్​, యూఏఈ వంటి విదేశాలను సంప్రదించామని హోం శాఖ తెలిపింది. భారత వైమానిక దళాల ద్వారా సరఫరా చేయగలిగే అధిక సామర్థ్యం కలిగిన ట్యాంకర్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది.

దేశంలో పలు జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయని, వాటిని స్థానిక ఆస్పత్రులకు ప్రాణవాయువు సరఫరా చేసేందుకు వినియోగించుకోవాలని కేంద్ర హోం కార్యదర్శి అజయ్​ భల్లా ఓ ప్రత్యేక లేఖలో పేర్కొన్నారు. అలాంటి ప్లాంట్​లన్నింటినీ గుర్తించటం సహా ఆక్సిజన్​ ఉత్పత్తయ్యే అన్ని ప్లాంట్​ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లుకు సూచించాలని కోరారు. మూతపడిన ప్లాంట్​ల పునరుద్ధరణ కోసం తగు చర్యలు చేపట్టాలని భల్లా సూచించారు. వీటన్నింటిపై తక్షణ చర్యలు తీసుకోవడం సహా సంబంధిత నివేదికను అత్యవసరంగా పంపాలని ఆయన ఆదేశించారు.కేంద్ర హోం మంత్రి అమిత్​ షా శుక్రవారం దేశంలో కరోనా పరిస్థితుల్ని సమీక్షించారు. వైద్య అవసరాల కోసం ఆక్సిజన్​ సరఫరాను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో గుజరాత్​ అహ్మదాబాద్​లోని ధన్వంతరి కొవిడ్​ ఆస్పత్రి సన్నద్ధతను సమీక్షించారు అమిత్​ షా. శనివారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్న ఈ వైద్యశాలలో 950 సాధారణ పడకలు, 250 ఐసీయూ పడకలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా"ధన్వంతరి కొవిడ్ హాస్పిటల్ శనివారం నుంచి పనిచేస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే గుజరాత్​లో ఎక్కువ ఐసియూ పడకలున్నాయి." అని అన్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ), గుజరాత్ విశ్వవిద్యాలయాల సహకారంతో ఈ సౌకర్యాలను కల్పించినట్టు షా చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories